42.2 C
Hyderabad
April 30, 2024 17: 41 PM
Slider సంపాదకీయం

అరుదైన ఈ జాతి ముత్యాన్ని కాపాడుకుందాం

#SonuSood

సోనూ సూద్ దేశం మొత్తం తెలిసిన ఈ పేరును ఇప్పుడు దుర్వినియోగం చేస్తున్నారు. కరోనా ఆపత్కాలంలో ఎందరికో సాయం చేసిన సోనూ సూద్ ఎన్నో కుటుంబాలను నిలబెట్టాడు. అయితే ఆయన ఆ పనిని కేవలం దాతృత్వంతో మాత్రమే చేశాడు. తన కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బులున్నవారు చేయడం లేదు.

తన కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కూడా ఎవరికీ సాయం చేయడం లేదు. అయితే సోనూ సూద్ చేస్తున్నాడు. తన శక్తికి మించి, తన తాహతకు మించి కూడా సోనూ సూద్ సాయం చేస్తున్నాడు. కొన్ని వేల మంది వలస కూలీలకు అతను ఇప్పుడు దేవుడుగా మారాడు.

ప్రభుత్వాలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు చేయని సాయాన్ని సోనూ సూద్ కేవలం ఒక వ్యక్తిగా చేశాడు. అలాగని అతనిపై భారం మోపడం సరి కాదు. సాయం కావాల్సిన వారు ప్రభుత్వాన్ని అడగాలి. తాము ఓటేసి గెలిపించుకున్న ప్రజా ప్రతినిధులను అడగాలి అంతే కానీ సోనూ సూద్ ను అడగడం ఏమిటి?

ఎవరూ అడగకపోయినా తన బాధ్యతగా ఇప్పటి వరకూ సాయం చేసిన సోనూ సూద్ ఉదారత్వాన్ని చాలా మంది వాడుకోవాలని చూస్తున్నారు. ఒక్క రోజులో 31 వేల రిక్వెస్టులు పంపారు. ఇది తప్పు కాదా? సాయం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. లేదా తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు.

ఈ రిక్వెస్టులు వారికి పంపాలి. సారీ నేను అన్ని రిక్వెస్టులూ చూడలేకపోతున్నాను అని సోనూ సూద్ తో అనిపించుకోవడం అంటే సమాజం సిగ్గుపడాలి. ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుతో తలదించుకోవాలి.

మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు సిగ్గు పడాలి

తమను ఎన్నుకున్న ప్రజలు తమను అడగకుండా సోనూ సూద్ ను సాయం అడుగుతున్నారంటే మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు సిగ్గు పడాలి. తమను సాయం అడగాల్సిన ప్రజలు ఒక సినిమా నటుడివైపు వెళుతున్నారంటే తమలో ఉన్న లోపాన్ని తెలుసుకోవాలి.

ప్రభుత్వం నియమ నిబంధనల పేరుతో, ఓటు బ్యాంకు అవసరాలతో చేస్తున్న సాయం సరైన వారికి చేరడం లేదని ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఓటుకు పనికి రాడనో, సదరు కులం వల్ల లాభం లేదనో ఈ ప్రజా ప్రతినిధులు వీరికి సహాయం చేయడం లేదన్నమాట. అందుకే ఈ బాధితులంతా సోనూ సూద్ వైపు చూస్తున్నారు.

సోనూ సూద్ పై భారం వేయడం మంచిది కాదు. సోనూ సూద్ చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశాడు. తనకు వీలున్నప్పుడు, తన మనసును కదిలించిన వారికి సాయం చేస్తాడు తప్పకుండా. అంతే కానీ అతడిని ఇబ్బంది పెట్టవద్దు. మీరు ఓటేసి గెలిపించుకుని నెత్తిన ఎక్కించుకున్న వారి కాలర్ పట్టుకోండి.

మీరు ఓటేస్తే మంత్రులైన వారిని నిలదీయండి. మీరు ఓటేస్తే ఏర్పడిన ప్రభుత్వాలను అడుక్కోండి. సోనూ సూద్ ను కాదు. దయచేసి మానవత్వాన్ని దుర్వినియోగం చేయకండి. మానవ జాతిలో అరుదైన జాతిగా ఉన్న సోనూ సూద్ లాంటి వారిని దుర్వినియోగం చేసుకోకండి.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్

Related posts

ప్రభుత్వ ఉద్యోగిని తిట్టినందుకు టీడీపీ నేత అరెస్ట్‌

Satyam NEWS

నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతన చట్టం సవరణ చేయాలి

Satyam NEWS

తిరుమల శ్రీవారి హుండీలో డబ్బు చోరీ చేస్తుండగా..

Satyam NEWS

Leave a Comment