37.2 C
Hyderabad
April 30, 2024 12: 14 PM
Slider ఖమ్మం

ప్రజా చైతన్యమే లక్ష్యంగా ప్రజాపోరు యాత్ర

#CPI National Samithi

అనేక దశాబ్దాల పాటు భారతదేశంలో కొనసాగిన రాజ్యాంగ విలువలకు బిజెపి తిలోదకాలు ఇచ్చిందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు ఆరోపించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం పునాదులుగా రూపుదిద్దుకున్న వ్యవస్థ ఇప్పుడు బిజెపి కారణంగా ప్రమాదంలో పడిందన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మోడీ విధానాలతో కుదేలైందన్నారు. సంపన్నుల కోసం మాత్రమే బిజెపి పాలన కొనసాగుతుందని సామాన్యులు సమిధలు అవుతున్నారన్నారు. కార్పొరేట్ శక్తులకు అన్ని వనరులు కల్పిస్తున్నా బిజెపి అంబానీ, అదానీలను పెంచి పోషిస్తుందని ఆయన ఆరోపించారు.

మతం పేరున విభజన తీసుకు వచ్చి రాజకీయ లబ్ది పొందెందుకు ప్రయత్నిస్తుందని ఈ క్రమంలో బిజెపి విధానాలను ప్రశ్నించిన వారిపై నిర్బంధాలు పెరుగుతున్నాయని ప్రశ్నించే వారిని జైళ్లలో పెడుతున్నారని హేమంతరావు తెలిపారు. దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. ఆర్థిక కుంభకోణాలకు సంబంధించి విపక్షాలు అనేక ఆరోపణలు చేసినా మోడీ సర్కార్ స్పందించక పోవడం శోచనీయమన్నారు. ప్రైవేటీకరణ ఫలితంగా రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు ఆయా వర్గాలకు దక్కడం లేదని బిజెపి, ఆర్ఎస్ఎస్లు రిజర్వేషన్ వ్యతిరేకులని ఆయన విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపిని ఇంటికి పంపడం ఎజెండాగా వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యతకు సిపిఐ కృషి చేస్తుందన్నారు.


ఈనెల 14 నుంచి 21 వరకు ఖమ్మంజిల్లాలో సిపిఐ ప్రజా పోరు యాత్రను నిర్వహించనున్నట్లు. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారం, జనచైతన్యం లక్ష్యంగా జరగనున్న ప్రజాపోరు యాత్రలో పోడు భూమికి పట్టాలు, సీతారామ మొదలైన ప్రాజెక్టుల సత్వర నిర్మాణం, రేషన్ కార్డులు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఖమ్మంజిల్లాలోని అన్ని మండలాలు సిపిఐ గ్రామాల్లో యాత్ర నిర్వహించనున్నట్లు ప్రసాద్ తెలిపారు.

14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. 19న ఏన్కూరు, కాచేపల్లి, కామేపల్లి మండలాల్లోనూ, 16న రఘునాథపాలెం, కొణిజర్ల మండలాల్లోనూ, 17న మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లోనూ, 18న చింతకాని, ఖమ్మం కార్పోరేషన్ ప్రాంతాల్లోనూ, 19న ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో సాగుతుందని తెలిపారు. ప్రతి మండలంలోనూ, బలమైన గ్రామాల్లో బహిరంగ సభలు జరుగుతాయన్నారు. 20న ముస్తఫానగర్, 21న రూరల్ మండలం ఎదులాపురం గ్రామంలో భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు ప్రసాద్ తెలిపారు.

ఈ బహిరంగ సభలకు సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కి జానిమియా, కొండపర్తి గోవిందరావు, తాటి వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాసరావు, రావి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రక్తదానం చేసిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి

Satyam NEWS

పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Satyam NEWS

రసకందాయంలో పడ్డ శ్రీకాళహస్తి రాజకీయాలు

Bhavani

Leave a Comment