40.2 C
Hyderabad
April 29, 2024 15: 12 PM
Slider నిజామాబాద్

6 నెలల్లో 100 బెడ్ రూంల ప్రగతి భవన్ కట్టుకున్నాడు కానీ…

#raghunandan

సీఎం కేసీఆర్ కు ఆరునెలల్లో 100 బెడ్ రూంల ప్రగతి భవన్ నిర్మాణం జరిగింది కానీ నిరుపేదలకు మాత్రం తొమ్మిదిన్నరేళ్లు గడిచినా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కావడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికి వెంటనే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాకు బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇండ్లలో ఉండటానికి సరిపడా గదులు లేవని, 2014 లో కేసీఆర్ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. తొమ్మిదేళ్లు గడిచిపోయినా ఎంతమందికి ఇల్లు ఇచ్చారని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో డబుల్ ఇళ్ల పథకాన్ని తొలగించి గృహాలక్ష్మి పథకం కింద స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి 3 లక్షలు ప్రభుత్వం అందిస్తుందని మంత్రి హరీష్ రావు ప్రకటించారన్నారు.

అదేరోజు సభలో 5 లక్షలు ఇస్తామని చెప్పి 3 లక్షలకు కుదించారని, ఇళ్ల నిర్మాణానికి ఏడున్నర లక్షలు విడుదల చేయాలని తాను డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం వచ్చే నెలలో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని, ఈసారి డబుల్ ఇళ్లపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కొత్త పించన్లు ఇస్తామని చెప్పి కార్డు ఇచ్చినా ఇప్పటికి ఇవ్వలేదని, గృహాలక్ష్మి కింద 3 లక్షల మంజూరు పత్రం కూడా అలాగే ఇచ్చి చేతులు దులుపుకుంటారని అన్నారు.

ఎన్నికల ముందే కేసీఆర్ కు కొత్త పథకాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. దళిత బంధు పథకం కింద ఎంతమందికి 10 లక్షలు ఇచ్చారని ప్రశ్నించారు. కులవృత్తుల వారికి ఆర్థిక సహాయము అంటూ బిసి బంధు ప్రకటించి లక్ష సహాయం అందిస్తామని దరఖాస్తులు తీసుకుని ఒక్కరికైనా లక్ష సహాయం చేసారా అని ప్రశ్నించారు. మైనారిటీలకు లక్ష సహాయం అందిస్తామని, క్రిస్టియన్ బంధు కూడా ఇస్తామన్నారని తెలిపారు.

అల్లుడు కలగంటే మామ అమలు చేస్తున్నాడని విమర్శించారు. బిసిలకు లక్ష ఆర్థిక సహాయం అని నియోజకవర్గానికి 300 మందికి ఇస్తామని, అసలైన కుల వృత్తుల వారికి ఇవ్వకుండా బీఆర్ఎస్ కండువా కప్పుకున్న వారికే లక్ష సహాయం ఇస్తారని జ్యోస్యం చెప్పారు. 12 శాతం ఉన్న గిరిజనులకు కూడా గిరిజన బంధు అమలు చేయాలని, కామారెడ్డి జిల్లా నుంచే గిరిజన బంధు అమలు చేయడానికి ఉద్యమం చేపట్టాలని సూచించారు.

ఆగస్ట్ 30 లోపు నిరుపేదలకు ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే బీజేపీ నాయకులు నిరుపేదలను నిర్మాణం పూర్తయిన ఇళ్లలోకి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, రాష్ట్ర నాయకులు ఎంజి వేణుగోపాల్ గౌడ్, నీలం రాజులు, పైలా కృష్ణారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

డోర్నకల్‌ – మిర్యాలగూడెం రైల్వే లైను ఎలైన్‌మెంట్‌ మార్పుచేయాలి

Bhavani

ఎక్సపర్ట్ కామెంట్రీ: ఉండవెల్లి మౌనం ఎప్పుడు వీడతారో?

Satyam NEWS

గౌరారం వెంకట్ రెడ్డి కి మేం అనుచరులం కాదు

Satyam NEWS

Leave a Comment