Slider నిజామాబాద్

రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్: 43 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ రాజు

#raju

43 గంటల పాటు గుహలో నరకయాతన.. 18 గంటల పాటు జిల్లా పోలీసు, ఇతర శాఖల అధికారుల రెస్క్యూ ఆపరేషన్.. క్షణక్షణం ఉత్కంఠ.. ఏం జరుగుతుందో.. ప్రాణాలతోనే బయట పడతాడా.. ఇంకా ఏదైనా జరుగుతుందా అనే అనుమానాలకు తెరపడింది. గుహలో చిక్కుకున్న రాజు ప్రాణాలతో బయటపడ్డాడు. కాదు అధికారుల సమిష్టి కృషి, గ్రామస్తుల సహకారంతో బయటపడ్డాడు. షికారుకు వెళ్లి గుహలో చిక్కుకుని 43 గంటల పాటు నరకయాతన అనుభవించిన చాడ రాజు ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన చాడ రాజు మంగళవారం మధ్యాహ్నం సమయంలో వేటకు వెళ్లి గుహలో ఇరుక్కుపోయాడు. ఎడమ చేయి రాళ్ళ మధ్యలో ఇరుక్కుని ఎంతకీ రాకపోవడంతో చేసేదేమిలేక అందులోనే ఉండిపోయాడు. నిన్న మధ్యాహ్నం రాజు రాళ్ళ గుహలోనే ఉండిపోయాడు అని తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, ఇతర శాఖల అధికారులు గుహ వద్దకు చేరుకుని రాజును కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించారు. రాత్రి అయినా కంప్రెషర్, మరొక జేసిబిని తెప్పించి అర్ధరాత్రి తరవాత ఒక్కొక్క రాయిని బ్లాస్టింగ్ చేయడం ప్రారంభించారు.

బ్లాస్టింగ్ తో రాజుకు ప్రమాదం లేదని నిర్దారించుకున్న తర్వాత బండరాళ్లను బ్లాస్టింగ్ చేశారు. నేడు ఉదయం నుంచి పలుమార్లు బండరాళ్లను బ్లాస్టింగ్ చేసిన తర్వాత గుహ లోపల చిక్కుకున్న రాజు కాళ్ళు బయటపడ్డాయి. దాంతో రెస్క్యూ టీంలో ధైర్యం వచ్చింది. బలమైన బండరాళ్లు తొలగిపోవడంతో రాజు పక్కనే ఉన్న బండరాయిని బ్లాస్ట్ చేయడానికి అధికారులు కాస్త వెనకముందు ఆలోచించారు. రాజు పక్కనే ఉన్న బండ కావడంతో రాజుకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న అనుమానం ఉన్నా అధికారులు ధైర్యం చేసి బండరాయిని బ్లాస్ట్ చేయడంతో రాజు క్షేమంగా బయటపడ్డాడు. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే రాజును 108 అంబులెన్సులో జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ప్రాణాలకు తెగించిన స్నేహితుడు

గుహలో రాజు చిక్కుకున్నాడని తెలుసుకున్న క్షణం నుంచి అధికారులకు అన్ని విషయాలలో సహాయంగా ఉన్నాడు రాజు స్నేహితుడు అశోక్. సహాయక చర్యలు చేపట్టక ముందునుంచి గుహలో ఉన్న రాజు వద్దకు వెళ్లి మంచి నీళ్ళు ఇస్తూ రాజు క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాడు. రాజును రక్షించడం కోసం చేపట్టిన సహాయక చర్యలు నుంచి మొదలుకుని రాజు ప్రాణాలతో బయటపడే వరకు అశోక్ క్రియాశీలకంగా పనిచేశాడు. ఒకవిధంగా చెప్పాలంటే రెస్క్యూ టీంకు, రాజుకు మధ్య సమన్వయకర్తగా రాజు పనిచేశాడు. ప్రాణాలకు తెగించి రాజు ఉన్నచోటకు వెళ్లి వచ్చాడు.

జిల్లా ఆస్పత్రిలో రాజుకు చికిత్స

రెస్క్యూ ఆపరేషన్ అనంతరం క్షేమంగా ప్రాణాలతో బయటపడిన రాజును అంబులెన్సులో జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూలో రాజును ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతానికి రాజు ఆరోగ్యం నిలకడగానే ఉందని, రెండు రోజులకు పైగా ఎలాంటి ఆహారం లేకపోవడంతో నీరసంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన రాజు ఎడమ చేయి ప్రస్తుతం స్వేల్లింగ్ రావడంతో దానికి ఎక్స్ రే, స్కానింగ్ చేస్తామని వైద్యులు పేర్కొన్నారు.

ఊపిరి పీల్చుకున్న అధికారులు

43 గంటల పాటు గుహలో చిక్కుకుని నరకయాతన అనుభవించిన రాజు ఎట్టకేలకు 18 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ప్రాణాలతో బయటపడటంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. రాజును ప్రాణాలతో కాపాడటానికి పోలీసులు భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. క్షణక్షణం అప్రమత్తంగా ఉంటూ రాజును కాపాడారు. అధికారులకు గ్రామస్తుల సహకారం తోడవడంతో ఆపరేషన్ సక్సెస్ అయింది. దాంతో అధికారులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

అగ్రిగోల్డ్ బాధితుల సదస్సు విజయవంతం చేయండి

Satyam NEWS

శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

Sub Editor

కార్డన్ సెర్చ్: కంచికచర్లలో పోలీసుల కొత్త ప్రయోగం

Satyam NEWS

Leave a Comment