క్రిస్టియన్ మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి, ప్రొడ్యూసర్ రవీనా టాండన్‌పై పంజాబ్‌లో కేసు నమోదు అయింది. పంజాబీలో భారతీ సింగ్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ‘బ్యాక్ బెంచర్స్’ అనే రియాలిటీ షోలో రవీనా టాండన్, దర్శకురాలు ఫరా ఖాన్ పాల్గొన్నారు.
ఈ షోలో వీరిని హోస్ట్ భారతీ సింగ్ ‘హలలూయా’ స్పెల్లింగ్ రాయమని అడుగుతుంది. దానికి వారు తమ సమాధానాన్ని బోర్డుపై వేరువేరుగా రాశారు. వారిరివురు ఆ స్పెల్లింగ్స్‌పై కాసేపు షోలో ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియన్ మతస్థులు ఆ వ్యాఖ్యలను తప్పుబడుతూ రవీనా, ఫరా ఖాన్, భారతీ సింగ్ తమ మతాన్ని కించపరిచారంటూ అంజాలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానికి స్పందించిన రవీనా.. ఎవరినీ అవమానించడం తమ ఉద్దేశం కాదని చెబుతూ, షోలో జరిగిన సన్నివేశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
‘దయచేసి అందరూ ఒకసారి ఈ లింక్‌ను చూడండి. ఏ మతాన్ని అవమానించినట్లుగా నేను మాట్లాడలేదు. మేం ముగ్గురం (ఫరా ఖాన్, భారతి సింగ్ మరియు నేను) ఎవరినీ కించపరచాలని ఎప్పుడూ అనుకోలేదు. మా మాటల వల్ల ఎవరైనా బాధపడితే వారికి నా హృదయపూర్వక క్షమాపణలు’ అని ట్వీట్‌లో కోరారు.