దేశంలో ఒకే రోజు నాలుగు చోట్ల బాలికలపై అత్యాచారం జరిగింది. ఇలాంటి ఘోరాలు ఎన్ని జరిగాయో కానీ పోలీసుల రికార్డులోకి వచ్చింది మాత్రం నాలుగు. మధ్య ప్రదేశ్‌లోని బయోరా సిటీ బస్టాండ్‌లోని బస్సులో అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయిని బస్సులోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మూడు వేర్వేరు ప్రదేశాల్లో బాలికలపై అఘాయిత్యాలు జరిగాయి.
ఈతా జిల్లా జైతారా ప్రాంతంలో బాలికపై ముగ్గరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మోరదాబాద్ లో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆ బాలిక స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని ఎఎస్‌పి దీపక్ భుకర్ తెలిపాడు. అమ్రోహ జిల్లాలో హసన్‌పూర్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక తనపై మదర్సా నిర్వహకుడు అత్యాచారం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని ఎఎస్‌పి అజయ్ ప్రతాప్ సింగ్ తెలిపాడు.