33.7 C
Hyderabad
April 29, 2024 02: 49 AM
Slider ప్రత్యేకం

మంత్రి రోజాపై అసమ్మతి రెచ్చగొడుతున్న ‘‘పెద్ద నాయకులు’’

#rojark

మంత్రి రోజాపై అసమ్మతి రెచ్చగొడుతున్న ‘‘పెద్ద నాయకులు’’ చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పై వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు పెద్ద నాయకుల ప్రమేయంతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజాపై స్థానిక వైసీపీ నేతలు తరచూ తిరుగుబాటు చేస్తున్నారు.

సినీ నటిగా మంచి పేరు ఉన్న మంత్రి కావడంతో రోజాపై జరుగుతున్న ఈ తిరుగుబాట్లు సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. మంత్రి రోజాను టార్గెట్ గా చేస్తున్న ఈ కుట్రలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్నాయి. నగరి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ పార్టీ అగ్ర నాయకులందరికి తెలిసినా కూడా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

ఇది అసమ్మతి నాయకులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నది. తాజాగా వడమాలపేట మండలం, పత్తిపుత్తూరు సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన రభస రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ‘‘పెద్ద నాయకుల’’ ప్రోత్సాహంతో జరిగిన ఈ రగడలో రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయింది. భవనాలు కడుతున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదనే విషయం విస్తృతంగా ప్రచారం జరిగింది.

వాస్తవానికి సచివాలయం నిర్మాణానికి సంబంధించి బిల్లులు మొత్తం చెల్లించినట్లు రోజా వర్గం నాయకులు చెబుతున్నారు. అయినా సరే వైసీపీలో అసమ్మతిని ప్రోత్సహిస్తున్న వారు ఇవేవీ గమనంలోకి తీసుకోకుండా మంత్రి రోజాపై వ్యతిరేకత రెచ్చగొట్టే క్రమంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదనే ఆరోపణలు చేస్తూ మీడియాకు ఎక్కారు. ఆ సచివాలయ నిర్మాణ కాంట్రాక్ట్ పనులు చేసిన మురళి రెడ్డికి బిల్లు డబ్బు ఇంకా రూ.25 లక్షలు రావాల్సి ఉందని, ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని, ఈ ప్రారంభ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపిటిసిలను పిలవలేదని ఆరోపణలు చేస్తూ ఆ భవనానికి ఆయన తాళాలు వేశారు.

మంత్రి రోజా వర్గం వారు ఆ తాళాలను పగుల గొట్టి బలవంతంగా ప్రారంభోత్సవం చేయాలని చూశారని ప్రచారం చేశారు. పత్తిపుత్తూరు సచివాలయ ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి రోజను అవమాన పరచడానికి మురళీరెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ కూడా అంతా ఇంతా కాదు. ఆయన చెప్పిన మాటలు కొన్ని వార్తా ఛానెళ్లలో పదే పదే ప్రసారం చేశారు. అయితే శిలాఫలకంలో స్థానిక సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపిల పేర్లు స్పష్టంగా కనబడుతున్నాయని రోజా వర్గీయులు తెలిపారు.

బిల్లుల చెల్లింపునకు సంబంధించి కూడా రోజా వర్గీయులు చెబుతున్న విషయం వేరే విధంగా ఉంది. సదరు కాంట్రాక్టర్ కు ఇప్పటికే రూ.34.5 లక్షలు జమ అయింది. అయితే ఇంకా పెండింగ్ పని కొంత ఉంది. ఆ భవనం టైప్3 క్రింద, ప్రస్తుతం ఉన్న భవనంపైనే రెండు ఫ్లోర్లు కట్టడానికి రూ.35 లక్షలు మంజూరు ఐతే, అతను చట్ట విరుద్దంగా ఊరి బయట నిర్మాణాన్ని చేపట్టాడని మంత్రి రోజా వర్గీయులు తెలిపారు. 

అప్పుడున్న అధికారిని భయపెట్టి మండల ఫండ్స్ రూ.6 లక్షలు ముందే అడ్వాన్సుగా తీసేసుకొన్నాడని కూడా అంటున్నారు. పైగా దాన్ని ఎక్కడా కనబరచకుండా మరో రూ.34.21 లక్షలు జమ చేసుకున్నాడని మంత్రి వర్గీయులు వివరించారు. ఈ లెక్కన అతనికి రావాల్సింది రూ.35 లక్షలైతే, ఇప్పటికే రూ 41.21 లక్షలు తీసేసుకొన్నాడని, అంటే అదనంగా రూ.6 లక్షలు స్వాహా చేశాడని అంటున్నారు.

దొంగే.. దొంగా దొంగా! అన్నట్లు ఇంకా తనకు రూ.25 లక్షలు రావాలంటూ మీడియా ముందు చెబుతున్నారని వారు అంటున్నారు. ప్రజాధనం స్వాహా చేస్తే మంత్రి రోజా ఊరుకోరని ముందే పసిగట్టి, అసలు విషయం బయటికి రాకుండా ఓవరాక్షన్ తో డ్రామాకి తెరలేపాడుని అంటున్నారు. అతని వెనుక ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ‘‘పెద్ద నాయకులు’’ ఉన్నట్లు జిల్లాలో అందరికి తెలుసునని కూడా మంత్రి రోజా వర్గీయులు అంటున్నారు.

Related posts

ఆధార్ కార్డు లేక పోయిన తల్లీ ప్రాణం

Satyam NEWS

సి.ఎం.ఆర్. బియ్యం సత్వరమే అందించాలి

Satyam NEWS

పెండింగులో ఉన్న కేసుల పరిష్కారానికి బాధ్యతగా కృషి చేయాలి

Satyam NEWS

Leave a Comment