29.7 C
Hyderabad
May 2, 2024 06: 12 AM
Slider ప్రపంచం

రష్యా వార్నింగ్: మూడో ప్రపంచ యుద్ధం వచ్చేనా?

#sergeilavrov

ఉక్రెయిన్ -రష్యా మధ్య ఎడతెరపిలేని యుద్ధం జరుగుతున్న వేళ,తాజాగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ ప్రజల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ కు సహాయం ఆపకపోతే మూడో ప్రపంచయుద్ధం తప్పదనే ధ్వనిని ఆయన వినిపించారు.

ఈ హెచ్చరికలు అమెరికా తదితర దేశాలను ఉద్దేశించి చేసినప్పటికీ,పరోక్షంగా ప్రపంచ దేశాలన్నింటికీ ఇచ్చిన హెచ్చరికగానే భావించాల్సి వస్తోంది. తమ జోలికి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తామనే అహం, యుధ్ధోన్మాదం అందులో కనిపిస్తున్నాయి. ఫి

న్ ల్యాండ్, స్వీడన్ ‘నాటో’తో కలిస్తే సహించేది లేదని రష్యా అధిపతి అనునూయుల నుంచి వినపడుతోంది. యుద్ధంలో గెలవాలంటే అణ్వాయుధాలకు పనిచెప్పాల్సిందేనని రష్యాకు చెందిన కొందరు విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు, మరో 10ఏళ్ళు కొనసాగవచ్చని యూకె విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ చేసిన తాజా వ్యాఖ్యలు కూడా కలవరం పెడుతున్నాయి.

పుతిన్ గెలిస్తే ఇంకా పెట్రేగుతాడు

ఉక్రెయిన్ – రష్యా మధ్య సాగుతున్న యుద్ధంలో పుతిన్ గెలిస్తే,యూరప్ లో భయంకరమైన పరిస్థితులు,ప్రపంచవ్యాప్తంగా తీవ్రపరిణామాలు ఉంటాయని ఆమె వ్యక్తం చేసిన ఆందోళన మిగిలిన వారికి కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో,యూరప్ దేశాలన్నీ సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్ నుంచి రష్యాను వెళ్ళగొట్టేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని యూకె విదేశాంగ కార్యదర్శి చేసిన సూచనలు ప్రపంచాన్ని అలోచనలో పడేస్తున్నాయి. ఉక్రెయిన్ పై మొదలైన ఈ దాడి జార్జియా,మాల్దోవా దేశాలపైకి కూడా ఎగబాకే అవకాశం ఉందని యూకె ప్రభుత్వానికి చెందిన కొందరు అధికారులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆంక్షలు పెడుతున్నా లెక్క చేయని మూర్ఖత్వం

ప్రపంచ నికర సంపదలో సగానికి పైగా వాటా ఉన్నజి 7 దేశాలు ఇక నుంచి మరింత కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షల చట్రాలు బిగిస్తున్నా, రష్యా వెరవులేకుండా ముందుకు వెళ్తోంది.

చైనా అండ ఎట్లాగూ ఉందని తెలిసిందే. అమెరికాను అగ్రాసనం నుంచి దించేయాలి,ఆ కుర్చీపై తాను స్వారీ చేయాలన్నదే చైనా ఏకైక లక్ష్యం. ఈ నయా సామ్రాజ్యవాదానికి బక్కదేశాలన్నీ బలైపోతున్నాయి. రష్యా అధినేత పుతిన్ ది కూడా ఒకే లక్ష్యం.

సోవియట్ యూనియన్ గా ఉన్నప్పటి పూర్వ వైభవం మళ్ళీ తేవాలి. తాను ప్రపంచంపై పెత్తందారీగా ఉండాలి. ఉక్రెయిన్ – రష్యా మధ్య అంతర్గత విషయాలు, విభేదాలు ఎలా ఉన్నా, ప్రస్తుత యుద్ధ వాతావరణం, నరమేధం ఏమాత్రం సమర్ధనీయం కాదు.

అణ్వాయుధాలు కూడా వాడతారా?

పెద్ద దేశాల పోరు ప్రపంచంలో మళ్ళీ పెను యుద్ధం సంభవించే సంకేతాలను వ్యాప్తి చేస్తోంది. యుద్ధాన్ని తక్షణం విరమించి ఉక్రెయిన్ ను వదిలిపెట్టమని మొన్నటికి మొన్న కూడా ఐక్య రాజ్య సమితిలోని 141 దేశాలు రష్యాకు హితవు పలికాయి. ఈ మాటలు రష్యాకు ఏ మాత్రం రుచించడం లేదు.

అణ్వాయుధాల వినియోగానికి ఏ మాత్రం వెనకాడబోమని రష్యా నుంచి వినవస్తున్న మాటలు  ఏ మాత్రం సమర్ధనీయం కాదు. నిజంగా,అదే జరిగితే? జరుగబోయే వినాశనం ఆ రెండు దేశాలకే పరిమితం కాదు.భూగోళం మొత్తం నిశీధిగా మారిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ పై అమెరికా విడిచిన అణుబాంబుల దాటికి రెండు లక్షల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు.

ఇప్పుడు వాటి శక్తి ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ప్రపంచంలో ప్రస్తుతం సుమారు 13వేల అణ్వాయుధాలు ఉన్నట్లు సమాచారం. అందులో ఒక్క శాతం వాడితే చాలు. ఆ విధ్వంసకాండ ఊహాతీతంగా ఉంటుంది. భూవాతావరణం మొత్తం మారిపోతుంది. మనుషులతో పాటు ఎన్నో జీవరాసులు నాశనమై పోతాయి.

ఇంతకన్నా అమానుషం ఇంకోటి ఉంటుందా?

కరువు కాటకాలు విలయతాండవం చేస్తాయి. కొన్ని వందల కోట్లమందికి తీర్చలేని ఇక్కట్లు ఎదురవుతాయి. ఇంత తెలిసి,ఇన్ని ఎరిగి… అణ్వాయుధాల ఊసెత్తటమంటే? అంతకు మించిన అమానుషం  ఇంకొకటి లేదు. రెండు నెలల నుంచి జరుగుతున్న ఈ యుద్ధం నేపథ్యంలో,ఇప్పటికే ధరలు ఎగబాకాయి.

ఆహార కొరత, ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ప్రపంచ దేశాల్లో కొన్ని వందల కోట్లమంది ఇక్కట్లు పాలవుతున్నారు. కరోనా తాకిడి నుంచి ఇంకా బయటపడని మానవాళికి, ఈ యుధ్ధోన్మాదం రెట్టింపు కష్టాలను తెచ్చి పెడుతోంది. కలలో కూడా ఎన్నడూ ఊహించని కరోనా సృష్టించిన కల్లోలం నుంచి కూడా ఈ పాలకులు పాఠాలు నేర్చుకోలేదంటే వీళ్ళని ఏమనాలి?

ఆ రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం సైనికుల వరకే పరిమితం కాలేదు. సాధారణ పౌరులను కూడా హరించి వేస్తోంది.మహిళలు, చిన్నారులు కూడా బలైపోతున్నారు. మహిళలు, బాలికలపైన కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.

అత్యాచారాలు చేస్తున్న రష్యా సైనికులు

యుద్ధం ముసుగులో అరాచకాలు జరుగుతున్నాయనే వార్తలు సభ్యసమాజాన్ని కలచివేస్తున్నాయి. క్రెమ్లిన్ అధీనంలో ఉన్న ఖేర్సస్ పరిధిలోని ఓ గ్రామంలో రష్యా సైనికుడు తప్పతాగి 16ఏళ్ళ బాలికపై లైంగిక దాడి చేశాడని వార్తలు వచ్చాయి.

“నువ్వు ఒప్పుకోకపోతే మరో 20మంది మగాళ్లను తెస్తా..” అని ఆ సైనికుడు ఆమెను బెదిరించి అనుభవించాడని ఆ అమ్మాయి వెల్లడించినట్లు చెబుతున్నారు. ఈ దారుణ ఘటన నిజమేనని ఉక్రెయిన్ అధికారులు చేపట్టిన విచారణలో తేలింది. ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయో.. అంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా ఈ నరహింస ఆగాలి. ప్రపంచ దేశాధినేతలంతా  దీనిపై దృష్టి సారించాలి. ముందుగా ఈ రెండు దేశాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఆపించాలి. మూడో ప్రపంచ యుద్ధం అనే మాటే లేకుండా మొగ్గలోనే తుంచేయాలి. కొందరి సామ్రాజ్యకాంక్షకు అందరు బలికాకుండా చూడాలి. శాంతి వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

రైతు వేదికల నిర్మాణం దేశానికి ఆదర్శం…

Satyam NEWS

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన గద్వాల డిఎంహెచ్ఓ

Satyam NEWS

అక్రమంగా తరలిపోతున్న పోలవరం కాలువ గట్టు మట్టి

Satyam NEWS

Leave a Comment