33.2 C
Hyderabad
May 11, 2024 14: 30 PM
Slider సంపాదకీయం

ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక సవాల్

ap-cm-ys-jagan-mohan-reddy

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియంకు పట్టిన తెగులు కొద్ది సేపు మర్చిపోదాం. ఇంగ్లీష్ మీడియం ఎవరు వద్దన్నా అమలు చేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా వదిలేద్దాం. నాడు నేడు పేరుతో పాఠశాలల జాతకాలే మర్చేస్తామంటున్నారు దాన్ని స్వాగతిద్దాం. ఇప్పుడు సత్యం న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేస్తున్నది. విద్యారంగాన్ని పటిష్టం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలను పేదలకు పూర్తిగా ఉపయోగపడాలని, విద్యాప్రమాణాలు మెరుగుడాలని చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకురావాలి.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో విద్యారంగ పూర్తి భారాన్ని ప్రభుత్వాలే మోశాయి. ఆ తర్వాత ఉన్నత విద్యారంగాన్ని ప్రభుత్వాలు వదిలేసి క్రమంగా ప్రయివేటు సంస్థలకు బదిలీ చేశారు. మాధ్యమిక విద్యను 50:50 గా నిర్వహిస్తున్నారు. అంటే ప్రభుత్వ ప్రమేయంతో నడిచే సంస్థలు, ప్రయివేటు సంస్థలు నడిపేవి కూడా సమంగా భాగస్వామ్యం తీసుకుంటాయి. ప్రాధమిక విద్య మొత్తం ప్రభుత్వం బాధ్యతగా నిర్వర్తించాల్సి ఉంటుంది.

అయితే ఈ గీత కూడా చాలా వరకూ చెరిగిపోయి ప్రాధమిక విద్యను కూడా పూర్తిగా ప్రయివేటు వ్యక్తులకు అప్పగిచ్చేస్తున్నారు. ప్రాధమిక, మాధ్యమిక విద్య నుంచి ప్రభుత్వం వైదొలగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. స్కూళ్లు, జూనియర్ కాలేజీలలో కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేస్తే చాలు, అందరూ ప్రయివేటు వైపు వెళ్లిపోతారు. అదే ప్రభుత్వాలు చేస్తున్న పని. దీన్ని అరికట్టేందుకా అన్నట్లు ఏపిలో జగన్ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంతో స్కూళ్లకు ఫేస్ లిఫ్ట్ ఇచ్చే పని చేపట్టారు.

హర్షణీయం. అమ్మ వొడి కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. అదీ సంతోషకరమైనదే. అమ్మ వొడి కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలని అందరూ నెత్తీనోరూ బాదుకుని చెప్పారు కానీ ముఖ్యమంత్రి వినలేదు. ప్రయివేటు స్కూళ్లకు కూడా అమ్మ వొడి ఇచ్చేస్తున్నారు. ఇది నిర్హేతుకమైన నిర్ణయం. దీనివల్ల ప్రభుత్వం ప్రాధమిక విద్యపట్ల తీసుకుంటున్న శ్రద్ధ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.

అమ్మ వొడి కేవలం ప్రభుత్వ స్కూళ్లలో చేర్చేవారికే పరిమితం చేస్తే జగన్ అనుకున్న నాడు నేడు కార్యక్రమం ఫలవంతం అవుతుంది. ఈ రెంటికి పరోక్ష సంబంధం ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంతకాలం ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో లేదు కాబట్టి మేం ప్రయివేటు స్కూళ్లకు పిల్లల్ని పంపుతున్నామని చెప్పేవారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది కదా అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తారా? అలా పంపే విధంగా ప్రభుత్వం చేయగలిగితే జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రయోగం సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వ స్కూళ్లు బాగుపడిపోతాయి.

జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినంత మాత్రాన అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్చరు. అందుకోసమే సత్యం న్యూస్ ఈ ప్రతిపాదన చేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలో కాంట్రాక్టు పై పని చేసేవారు, సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుడి వరకూ అందరు ప్రజాప్రతినిధులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలనే నిబంధన తీసుకురావాలి.

నిర్భంధంగా వీరి పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలి. తెలంగాణ లోని వికారాబాద్ కలెక్టర్ తన పిల్లల్ని ప్రభుత్వ స్కూల్ లోనే చదివించాలనే నిబంధన పెట్టుకుని అమలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు కింద స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకూ, ప్రజాప్రతినిధులు అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించే నిబంధన తీసుకురావాలి. ఈ నిబంధనకు ఎలాంటి తూట్లు పొడిచే వీలులేకుండా చూడాలి.

అమ్మ వొడి కేవలం ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే వర్తింపచేయాలి. ఆ బెనిఫిట్ ను ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు కల్పించినా తప్పు లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి పై విషయాలపై చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రతిపాదనను పరిశీలించాలి. పరిశీలించి అమలు చేయాలి. ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతకు సవాల్ లాంటిది. ఈ సవాల్ ను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వీకరించాలి.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

తిమ్మాపూర్ తిరుపతి క్షేత్రంలో బోటింగ్ ప్రారంభించిన స్పీకర్

Satyam NEWS

యూనియన్ బ్యాంకు బంగారం మాయం: ఖాతాదారుల ఆందోళన

Bhavani

ఫేక్ న్యూస్: కరోనా వైరస్‌ వదంతులు నమ్మెద్దు

Satyam NEWS

Leave a Comment