దేశంలోని అణగారిన వర్గాలకు అక్షరసరస్వతిని అందించి అద్వితీయమైన సేవలు అందించిన మహా సాధ్వి సావిత్రిబాయి పూలే అని తెలంగాణ మహిళా జాగృతి అధ్యక్షురాలు ఆలం పల్లి లత కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని మహిళా జాగృతి కార్యాలయం లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా లత మాట్లాడుతూ నిమ్న సమాజం ముఖ్యంగా మహిళల్లో అక్షర జ్ఞానాన్ని అందించి వారి అభ్యున్నతికి తోడ్పడ్డ తొలి మహిళా ఉపాధ్యాయిని అని అన్నారు. దేశంలోని నిమ్న వర్గాలకు అద్వితీయమైన సేవలు అందించిన వారిలో సావిత్రిబాయి ఒకరని అన్నారు.
మహిళలకు సమాజంలో సముచిత స్థానం కల్పించేందుకు ఎన్నో అవమానాలను సహితం భరించి ఆమె జీవితాన్ని త్యాగం చేసారన్నారు. ముఖ్యంగా మహిళలకు విద్య అవసరమనే విషయాన్ని ఆమె విస్తృతంగా ప్రచారం చేశారని అన్నారు.
ఆమె ఆనాడు ఆమె మహిళలపట్ల శ్రద్ద చూపక పోయేనట్లైతే నేడు మహిళలు వంటింటికే పరిమితం అయ్యేవరన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మల, గీత, లక్ష్మి, సులోచన, సుమతి,పాండు రాజు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.