26.7 C
Hyderabad
May 3, 2024 09: 57 AM
Slider ముఖ్యంశాలు

ఆస్తుల లొల్లి.. అభివృద్ధి పై రగడ

#kamareddy

కామారెడ్డిలో షబ్బీర్ అలీ వర్సెస్ గంప గోవర్ధన్

గంప కౌంటర్ సవాల్

కామారెడ్డి నియోజకవర్గంలో 2018 నాటి సీన్ రిపీట్ అవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు ప్రధాన నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. అభివృద్ధి నీదా నాదా తేల్చుకుందామా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. ఇంతకీ ఇరువురు బహిరంగ చర్చకు వస్తారా అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

అసలేం జరిగింది

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర షబ్బీర్ అలీ వర్సెస్ గంప గోవర్ధన్ గా మారడానికి కారణమైంది. రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం స్థానిక ఎమ్మెల్యేపై లత్కోర్ గోవర్ధన్ పేరుతో 9 అంశాలతో చార్జిషీట్ విడుదల చేసారు. అందులో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అందులో ప్రధానంగా ఓ వెంచర్ లో తన అనుచరుల లబ్ది కోసం మున్సిపల్ నుంచి 3 కోట్లతో రోడ్డు వేయించారని ఆరోపించారు. కామారెడ్డిలో ఏ వ్యాపారం సాగినా అందులో ఎమ్మెల్యేకు అందులో వాటా ఉంటుందని పేర్కొన్నారు. కామారెడ్డి సమీపంలో ఉన్న చెక్ పోస్టులో ఎమ్మెల్యే అనుచరులు లక్షల్లో వసూలు చేస్తున్నారని, అందులోంచి ఎమ్మెల్యేకు ప్రతినెలా వాటా వెళ్తుందని ఆరోపించారు. అధికారులు చెప్పినట్టు వినకపోతే బండ బూతులు తిడుతున్నారని, భరించలేక అధికారులు వెళ్లిపోతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ఛార్జ్ షీట్ ఫోటో

ఛార్జిషీటుపై ఎమ్మెల్యే గరం గరం

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఛార్జిషీటుపై షబ్బీర్ ఆలీపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొందుర్తి శివారులోని ఓ ఫార్మహౌస్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో షబ్బీర్ ఆలీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షబ్బీర్ అలీ హయాంలో అభివృద్ధి లేదని పేర్కొన్నారు. కామారెడ్డి ప్రజలు రెండుసార్లు గెలిపిస్తే మంత్రి అయ్యాక ఆయన, ఆయన తమ్ముడు, కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. దమ్ముంటే తన అవినీతి నిరూపించాలని సవాల్ విసిరారు. చెక్ పోస్టులో వసూళ్లపై వీడియోలు విడుదల చేయాలన్నారు. వెయ్యికోట్ల ఆస్తి సంపాదించుకుని అబద్ధాలు ఆడటం సరికాదని పేర్కొన్నారు. తన ఆస్తులు కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు పంచుతానని, గంప గోవర్ధన్ గా తిరిగి బస్వాపూర్ గ్రామంలో బ్రతికే సత్తా తనకుందన్నారు. షబ్బీర్ ఆలీకి దమ్ముంటే ప్రజలకు ఇద్దరి ఆస్తులను పంచేద్దామా అని సవాల్ విసిరారు.

గంప చేసిన అభివృద్ధి లేదు-షబ్బీర్ అలీ

నిన్న జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ లోని గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీపై వేటుకు నిరసనగా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ గంప గోవర్ధన్ ఆరోపణలకు స్పందించారు. మంత్రిగా ఉన్న సమయంలో 6 నియోజకవర్గాలకు సబ్ స్టేషన్లు మంజూరు చేశానన్నారు. ఏరియా ఆస్పత్రి 30పడకల నుంచి 100 పడకలకు మార్చానని, ఇప్పుడు ఆ ఆస్పత్రి బాన్సువాడకు వెళ్తుంటే గంప గోవర్ధన్ అపలేకపోయారని విమర్శించారు. 240 కోట్లతో సాగునీరు అందించేందుకు ప్రాజెక్టు పనులను ప్రారంభించామన్నారు. నియోజకవర్గంలో 20 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించామని చెప్పారు. నేషనల్ హైవేపై ఉండేలా ఇందిరాగాంధీ స్టేడియం నిర్మించానన్నారు. తాను అధికారంలో ఉంటే అండర్ 19 క్రికెట్ పోటీలు ఇక్కడే నిర్వహించేవాడినని పేర్కొన్నారు. డ్రైనేజీలు, రోడ్లు ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనని ప్రకటించారు

షబ్బీర్ ఆలీకి గంప కౌంటర్

నేడు గంప గోవర్ధన్ షబ్బీర్ ఆలీకి మరోసారి కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో 165 కోట్లతో అభివృద్ధి చేపట్టానన్నారు. జిల్లా కేంద్రంలో ఆరులైన్ల రోడ్డు, కళాభారతి ఆడిటోరియం నిర్మించానన్నారు. 30 పడకల ఆస్పత్రి నుంచి 100 పడకల ఆస్పత్రికి మార్చింది తానేనన్నారు. జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల మంజూరు చేయించింది తానేనన్నారు. నియోజకవర్గంలో ప్రతి పంచాయతీకి భవనం, ప్రతి గ్రామంలో బిటి రోడ్లు, మండల కేంద్రాల్లో రెండు వరుసలు రోడ్లు వేయించానన్నారు.

షబ్బీర్ అలీ మంత్రిగా ఉండి 6 సబ్ స్టేషన్లు మంజూరు చేస్తే తాను ఎమ్మెల్యేగా ఉండి 13 సబ్ స్టేషన్లు మంజూరు చేశానన్నారు. షబ్బీర్ అలీ సొంత గ్రామంలో పంచాయతీ భవనాన్ని కూడా తానే మంజూరు చేయించానని, రోడ్డు కూడా వేయించానన్నారు. దోమకొండ, బిక్కనూర్, మాచారెడ్డి మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలు తెచ్చింది షబ్బీర్ అలీ కాదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమేనని తేదీ, స్థలం నిర్ణయించి చెప్పాలని మరోసారి సవాల్ విసిరారు

2018 ఎన్నికల్లో ఆస్తులపై రచ్చ

గడిచిన 2018 ఎన్నికల్లో సైతం ఇలాగే ఒకరి ఆస్తులపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకడుగు ముందుకు వేసి ఓ తేదీ ఖరారు చేయడంతో పాటు నాడు జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ లోని గాంధీ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. దాంతో నాడు పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా భారీ బందోబస్తు నిర్వహించి ఇద్దరు ఒకేసారి గాంధీ విగ్రహం వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దాంతో ఒకరు వెళ్లిన తర్వాత ఒకరు వచ్చి తమ ఆస్తుల వివరాలు చదివి వెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు అదే విషయం రిపీట్ అవుతోంది.

ఆరోపణలేనా.. ఆస్తులు పంచేస్తారా..?

గడిచిన ఎన్నికల సమయంలోనే ఇదే మాదిరిగా ఆరోపణలు చేసుకున్న నేతలు ప్రజలను పిచ్చోళ్ళను చేయడానికే మళ్ళీ ఆరోపణలు చేసుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలోనే ఇలాంటి ఆరోపణలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఆరోపణలు చేసుకోవడం తప్ప ఒకరి ఆరోపణలు ఒకరు నిరూపించిన దాఖలాలు లేవని చెప్తున్నారు. నిజంగా ఇద్దరు ప్రధాన అభ్యర్థులు అభివృద్ధిపై చర్చకు వస్తారా.. ఆస్తులు ప్రజలకు పంచె దమ్ము ఉందా అని చర్చించుకుంటున్నారు.

ఎన్నికలు వస్తున్నాయనే ఆరోపణలు చేసుకుంటున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మొత్తం మీద కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్రతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ రాజకీయ విమర్శలు, ఆస్తుల పంపకాల అంశం సవాళ్లకే పరిమితం అవుతుందో నిజంగా చర్చకు వస్తారో కాలమే నిర్ణయిస్తుంది.

Related posts

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంగనా రనౌత్

Satyam NEWS

ఉక్కపోత: వాసుపల్లి గణేష్…. అక్కడ ఉండలేక… ఇక్కడకు రాలేక..

Satyam NEWS

కార్మిక ఉద్యమం నుంచి పుట్టిందే మహిళాదినోత్సవం

Satyam NEWS

Leave a Comment