ఆన్ లైన్ వ్యాపారంతో తమ షాపులు గుల్ల అయిపోతున్నాయని రిటైల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అంతే కాదు. ఆన్ లైన్ ఆఫర్లను ఆపకపోతే సంబంధిత బ్రాండ్ మొబైల్ ఫోన్ లను అమ్మడం నిలిపివేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా ఆఫర్‌లను అందిస్తున్నాయని, ఇది దుకాణాల్లో అమ్మకాలను తగ్గిస్తున్నదని వారు అంటున్నారు.
ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ఆన్‌లైన్ ఆఫర్లను ఆపాలని దేశంలోని ప్రముఖ బ్రాండ్లకు లేఖ రాసింది. మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడేది లేదని వారు ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీలకు లేఖలు రాశారు. ఆన్ లైన్ ఆఫర్లు ఆపాలని లేకపోతే రిటైలర్లు, షోరూం దుకాణందారులు అలా చేయని బ్రాండ్లను బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయని ఆ సంఘం ప్రతినిధి తెలిపారు.
గత నెలలో మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందించే ఆఫర్లను పున:పరిశీలించాలని కోరడంతో ప్రతిస్పందనగా ఒపో, వివో, రియల్ మి బ్రాండ్లు వ్యాపారుల సమస్యలను పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. అయితే ఈ విషయంపై శామ్‌సంగ్, షామీ ఇంకా ఒక వైఖరి తీసుకోలేదు. అందువల్ల శామ్ సంగ్, షామీ ఫోన్‌లను బహిష్కరించడానికి వ్యాపారులు సిద్ధమైతున్నారు.