మహిళా కానిస్టేబుల్‌ను వేధింపులకు గురిచేస్తున్న ఓ కీచక ఎస్‌ఐపై వేటు పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జగిత్యాల జిల్లా ఓ పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను అదే ఠాణాకు చెందిన ఎస్సై ఆర్నెల్లుగా వేధిస్తున్నట్లు తెలిసింది.
తరచూ వాట్సాప్‌లో మెసేజ్ లు పెడుతూ.. వీడియో కాల్ చేయాలని ఆ వేధింపులకు గురి చేసేవాడు. బయట తెలిస్తే పరువు పోతుందేమోనని ఆమె ఎవరికీ చెప్పు కోలేక తనలో తాను కుమిలిపోయింది. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె తన సన్నిహితులు.. అలాగే అదే సబ్ డివిజన్‌కు చెందిన ఓ సీఐతో మొర పెట్టుకున్నట్లు సమాచారం.
ఆయన ఈ విషయంపై ఆరా తీసి సదరు ఎస్సైని మందలించినట్లు తెలిసింది. సీఐ చెప్పినా అతని వైఖరిలో మార్పు రాలేదు. చివరకు ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లగా.. తక్షణం అతడిని బదిలీ చేసి వీఆర్‌లో ఉంచినట్లు సమాచారం.