సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. అత్యంత రద్దీగా ఉండే సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కనీసం 73 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు.
పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 73 మంది మృతదేహాలను గుర్తించినట్లు మేయర్ ఒమర్ మహమూద్ తెలిపారు. మృతుల్లో చాలా మంది స్థానిక యూనివర్శిటీకి చెందిన విద్యార్థులేనని చెప్పారు. పన్ను వసూలు కేంద్రం లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఉదయం సమయంలో ఇక్కడ రద్దీ విపరీతంగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటనలు చేయలేదు. అయితే అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్-షబాబ్ ఈ ప్రాంతంలో తరచూ దాడులు చేస్తుంటుంది.
రద్దీగా ఉండే చెక్‌పాయింట్లు, హోటళ్లను లక్ష్యంగా చేసుకొని గతంలో దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2017 అక్టోబరులో జరిగిన ట్రక్కు బాంబు పేలుడులో 500మందికి పైగా మరణించారు. ఈ దాడికి అల్-షబాబే కారణమని అప్పట్లో ప్రభుత్వం ఆరోపించింది.