39.2 C
Hyderabad
May 3, 2024 13: 58 PM
Slider ముఖ్యంశాలు

కరోనా క్లీనిక్: మాధ్యమాలకు బాధ్యత ఎక్కువ

#Social Media on Corona

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

కోవిడ్-19 మహమ్మారి దెబ్బ కు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల కుటుంబాలు ఇళ్ళకే పరిమితమైన పరిస్థితి నెలకొంది. అందివచ్చిన విరామ సమయంలో అధికశాతం ప్రజలు ఇంటర్నెట్ ఆధారిత  సమాచార సాధనాలపై ఆధారపడటం సహజం.

తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనుషుల్లో  ఎక్కువగా ఉంటుంది. సమాచార విప్లవం కారణంగా పలు సాంకేతిక పరికరాలు అందుబాటులో కి వచ్చాయి.

కరోనాపై ఆసక్తితో పెరిగిన మీడియా ప్రాధాన్యత

పిల్లలు మొదలు యువకులు, వృద్ధుల వరకు మొబైల్స్, టాబ్స్ ఇతర గాడ్జెట్స్ వినియోగం ప్రస్తుత కరోనా స్వీయనియంత్రణ సమయంలో మరింత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ప్రభావిత కేసులు, వైద్యానంతరం క్షేమంగా బయట పడిన వారి వివరాలు, మరణాల సంఖ్య వంటి విషయాలపై ప్రజల లో సహజంగానే ఆసక్తి పెరిగింది.

ప్రాణాలకు తెగించి ఆయా వివరాలు బాహ్య ప్రపంచానికి తాజాగా అందించడానికి ప్రచార, ప్రసార సాధనాల కృషి ప్రశంసనీయం..ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ,యునెస్కో ప్రతినిధులు మాట్లాడుతూ… ఇటువంటి భయోత్పాతాల విజృంభణ సమయంలో కూడా మీడియా అంకిత భావంతో పనిచేయడం ఆదర్శనీయమని శ్లాఘించారు.

నిరాధార వార్తలతో కీడు ఎక్కువ

ఐతే, మీడియా రెండువైపులా పదును ఉన్న కత్తి వంటిదని….దాన్ని ఉపయోగించే పద్ధతి పై ఫలితం ఆధారపడుతుందని యునెస్కో వ్యాఖ్యానించింది. ఇటువంటి క్లిష్ట సమయంలో నిరాధారమైన వార్తలు , అసత్యాలు, అర్ధసత్యాలు ప్రజలకు కీడుకలిగించగలవని తెలిపింది.

కొన్ని సామాజిక మాధ్యమాలు బాధ్యతా రహితంగా ప్రజలను లేనిపోని ఆందోళనలకు గురిచేసే సమాచారాన్ని అందించడం తగదన్నారు. తప్పుడు సమాచారం, నకిలీ వార్తలతో మీడియా స్థాయిని  దిగజార్చవద్దని హితవు పలికారు. కరోనా దెబ్బ కు మానసిక ఒత్తిడికి లోనైన వారికి ఇటువంటివి మరింత కలవరం కలిగిస్తాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

తప్పుదోవ పట్టించే పోస్టులతో అరిష్టం

సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల నిర్వహణ గణనీయంగా వృద్ధి చెందింది. యూట్యూబ్, ఫేస్ బుక్ ,ఇంస్టాగ్రామ్ ….రకరకాల వేదికలు ఇటీవల కాలంలో తామరతంపరగా పుట్టుకొచ్చాయి. వాటిల్లో పెడుతున్న అంశాలు, విషయాలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదాన్ని గుర్తించాలని అంతర్జాతీయ మీడియా రంగ నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా నియంత్రణ కు మానవ శరీరంలో హెర్డ్  ఇమ్యూనిటీ పెంచుకోవాలని వైద్యశాస్త్రం చెబుతుందని, దాని కోసం ఆవుపేడ, గోమూత్రం తీసుకుంటే ఫలితం ఉంటుందంటూ సామాజిక మాధ్యమాల్లో విపరీత ప్రచారం కనిపించింది. ఈ అంశాన్ని మనదేశానికి చెందిన ఒక ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధి ప్రకటించడం విశేషం. ఐతే శాస్త్రీయ నిర్ధారణ లేని కారణంగా ప్రజలు విశ్వసించవద్దని వైద్యనిపుణులు ప్రకటించారు.

కరోనా నిరోధ మందులపై పనికిమాలిన ప్రచారం

అదేవిధంగా వైరస్ నిరోధించడానికి రకరకాల పేర్లతో మందులు అందుబాటులో ఉన్నట్లు ప్రజల్ని వంచించిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. మద్య సేవనంతో వైరస్ నియంత్రణ సాధ్యం కాగలదని ఉచిత సలహాలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరహా ప్రకటనలు దాదాపు అన్నిదేశాలను చుట్టు ముట్టాయి.

కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై కూడా పలు కథనాలు సామాజిక మాధ్యమాలలో చోటుచేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పాత దృశ్యాల కు కరోనా మహమ్మారి ని జోడించడం వంటి అనైతికత  ఆయా మాధ్యమాల వెర్రితనానికి పరాకాష్ఠ.

ఇటువంటి దుశ్చర్యలకు కఠిన చర్యలు తప్పవని ఉన్నతస్థాయి మీడియా నియంత్రణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. విశ్వసనీయ వార్తాకేంద్రాలు, ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల ప్రకటనలను మాత్రమే నమ్మాలని ప్రజలకు హితవు పలికారు.

అభూత కల్పనలతో సమాజానికి ఆందోళన తప్పదు

ఒకవైపు వైరస్ కారణంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితులలో ప్రజలను తప్పుదోవ పట్టించడం దారుణం.. స్వల్పకాలిక ప్రయోజనం కోసం అభూతకల్పనలు ప్రకటిస్తే సమాజం మరింత కల్లోలానికి గురికావాల్సి వస్తుందని సామాజిక మాధ్యమాల నిర్వహకులు గుర్తించాలి.

ఇక్కట్లు అనుభవిస్తున్న మానవాళికి ధైర్య స్థైర్యాలను బాధ్యత తెల్సిన  మీడియా అందిస్తుంటే కొన్ని మాధ్యమాలు నిస్సిగ్గుగా వ్యవహరించడం పాత్రికేయ వృత్తికే ద్రోహంగా విజ్ఞులు పరిగణించాలి.  నకిలీ సమాచారం, వార్తలు అందిస్తున్న మకిలి మాధ్యమాలతో భౌతిక దూరం పాటించాలని ప్రజల్ని జాగృత పరచాల్సిన బాధ్యత ను ప్రభుత్వాలు, పౌరసమాజాలు, మీడియా నియంత్రణ యంత్రాంగం స్వీకరించాలి.

కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

దేవాదాయ శాఖ ఈవోల సంఘం అధ్యక్షుడుగా పురంధర్

Satyam NEWS

మాల మహానాడు మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా పాశం

Satyam NEWS

సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు మరో ముగ్గురు పోలీసులపై కేసు

Satyam NEWS

Leave a Comment