మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి రైట్ హ్యాండ్ అయిన సూరీడుపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం సూరీడి కుమార్తెను కడపకు చెందిన పోతిరెడ్డి సురేందర్‌రెడ్డికి ఇచ్చి గతంలో పెళ్లిచేశారు. తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో సూరీడి కుమార్తె తన భర్తపై వరకట్న వేధింపుల కింద కేసు పెట్టారు. 2021 మార్చి 23న రాత్రి 7.30కు సురేందర్‌రెడ్డి క్రికెట్ ఆడిన తర్వాత కుమార్తెను చూడడానికి జూబ్లీహిల్స్‌లోని తన మామ ఇంటికి వెళ్లారు. అక్కడ మామా అల్లుళ్ల మధ్య గొడవ జరిగింది. అల్లుడిపై సూరీడు దాడిచేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సురేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని, ఆయన చేతిలోని క్రికెట్ బ్యాట్‌ను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు.
ఆ సమయంలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేష్‌లు ప్రస్తుతం ఆంద్రప్రదేశ్‌లో ఐజీగా పనిచేస్తున్న జి.పాలరాజుతో కలిసి తనను అక్రమంగా నిర్బంధించి, దాడికి పాల్పడ్డారని సురేందర్‌రెడ్డి ఆరోపించారు. తనను అక్రమంగా కస్టడీలోకి తీసుకొని, తనపై తప్పుడు కేసులు పెట్టిన సూర్యనారాయణరెడ్డి (సూరీడు), రాజశేఖర్‌రెడ్డి, నరేష్, పాలరాజులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత మంగళవారం సురేందర్‌రెడ్డి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లగా న్యాయమూర్తి ఆయన వాంగ్మూలాన్ని పరిశీలించి కేసు నమోదు చేయాలంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సుబ్బయ్య నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ పాలరాజుపై సురేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా, సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.