32.7 C
Hyderabad
April 27, 2024 00: 19 AM
Slider విజయనగరం

వివాదస్పద కొటియా గ్రామస్థులకు అండగా ఉంటాం

#depikaips

ఆంధ్ర – ఒడిస్సా రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న కొటియా గ్రామ ప్రజలకు అండగా ఉంటామని, వారికి రక్షణ కల్పిస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక అన్నారు. ఇటీవల ఆంధ్ర – ఒడిస్సా రాష్ట్రాల మధ్య వివాదాస్పద గ్రామాల్లో ఒడిస్సా పోలీసు ఇటీవల దుడుకుగా వ్యవహరించడంతో, అక్కడ నివాసం ఉంటున్న కొటియా, గంజాయిభద్ర, పనికి, రణసింగి, దిగువశెంబి, ఎగువశెంబి, సినీవలస, కోనదొర గ్రామాలకు చెందిన 60మంది గిరిజనులు జిల్లా కేంద్రానికి వచ్చి, ఒడిస్సా పోలీసుల దౌర్జన్యాలను జిల్లా ఎస్పీకి వివరించి, వారికి రక్షణ కల్పించమని జిల్లా ఎస్పీని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ కొఠియా వివాదాస్పద గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి, గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారికి రక్షణ కల్పిస్తామని, వారికి ఏ సమస్య ఉన్న పోలీసుల దృష్టికి తీసుకొని వస్తే, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అదే విధంగా కొఠియా వివాదాస్పద గ్రామాల్లో ఇకపై ప్రతీ సోమవారం “స్పందన” కార్యక్రమాన్ని చేపట్టి, అక్కడే వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. కొఠియాలో 1998 వరకు పూర్తిస్థాయి పోలీసు స్టేషను ఉండేదని, తరువాత కాలంలో మావోయిస్టుల ప్రభావం వలన ప్రమాదకరంగా భావించి, అప్పటి పరిస్థితుల కారణంగా పోలీసు స్టేషను సాలూరుకు తరలించి, అక్కడ నుండి సేవలను అందిస్తున్నామన్నారు.

కొటియా గ్రామంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు

ఈ వివాదాస్పద గ్రామాల్లో కోర్టు స్టేటస్కో ఇచ్చిందని, రెండు రాష్ట్రాల వారు కొటియా గ్రామాలకు వెళ్ళవచ్చునని, ప్రజలకు సహాయపడవచ్చునన్నారు. కానీ, ఇటీవల కాలంలో ఒడిషా పోలీసులు ఈ గ్రామాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ, ఆంధ్ర అధికారులను అడ్డుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే, ఈ సమస్యను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళామన్నారు. త్వరలో కొఠియాలోనే పోలీసు స్టేషను ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరామన్నారు.

సుదూర ప్రాంతాల నుండి సాలూరు వరకు రాకుండా స్థానికంగా ఉండే పోలీసు స్టేషను ద్వారానే ప్రజలకు సేవలందించడం, రక్షణ కల్పిస్తామని, ప్రజల ఫిర్యాదులను న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా ప్రజలకు రక్షణ కల్పించేందుకు విజయనగరం పోలీసులు సిద్ధంగా ఉన్నారని, ఆయా గ్రామాల్లో ముఖ్య నాయకులు, ప్రజలకు ముఖ్యమైన పోలీసు అధికారుల ఫోను నంబర్లును కూడా అందిస్తామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక భరోసా కల్పించారు.

పార్వతీపురం ఒఎస్ డి ఎన్.సూర్యచంద్రరావు మాట్లాడుతూ – ప్రస్తుతం వివాదంలో ఉన్న 21 కొఠియా గ్రామాలు 1936కు ముందు జైపూర్ సంస్థానంలో ఉండేవన్నారు. 1955లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు ఇరు రాష్ట్రాలు ఈ గ్రామాల్లో సర్వే నిర్వహించక పోవడం వలన వివాదస్పదంగా మిగిలిపోయాయన్నారు. ప్రస్తుతం ఈ విషయం కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు పరిధిలో ఉన్నందున సమస్య పరిష్కారం అయ్యేంత వరకు శాంతియుతంగా మెలగాలన్నారు.

అనంతరం, కొఠియా వివాదాస్పద గ్రామాల నుండి జిల్లా కేంద్రానికి వచ్చిన 60మంది గిరిజనులకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక చేతుల మీదుగా గ్రోసరీ వస్తువులను అందజేసారు. గ్రామస్థులు, గిరిజనులు కొటియా వెళ్ళేందుకు జిల్లా ఎస్పీ బస్సు సౌకర్యాన్ని కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఒఎస్ డి ఎన్. సూర్యచంద్రరావు, ఎస్బీ సిఐలు ఎన్. శ్రీనివాసరావు, జి. రాంబాబు, ఆర్ ఐ చిరంజీవి, ఆర్ఎస్ఐ ప్రసాదరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, కొఠియా గ్రామస్థులు, పెద్దలు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

జర్నలిస్ట్ కోల నాగేశ్వరరావుకి టిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆత్మీయ సన్మానం

Satyam NEWS

భ‌ద్రాద్రిలో వైభ‌వంగా శ్రీ సీతారాముల క‌ల్యాణం

Satyam NEWS

అధికారులను చూసి పరారైన బంగారు వ్యాపారులు

Satyam NEWS

Leave a Comment