38.2 C
Hyderabad
April 29, 2024 22: 03 PM
Slider ప్రత్యేకం

ఆయుర్వేదం వైపు అడుగులు!

#narendramodi

మనదైన ఆయుర్వేదం వైపు ప్రపంచమంతా చూస్తోంది. కాకపోతే, మనమే ఇంకా చూడాల్సివుంది. వెనక్కు తిరిగి చూసుకోవాల్సి వుంది. ముందుకు సాగాల్సివుంది. గోవాలో 9వ ప్రపంచ ఆయుర్వేద సమావేశం,ఆరోగ్య ఎక్స్ పో ఆదివారం నాడు ముగిసింది. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ ఆయుర్వేదంపై తన భావాలను హృదయం పరచి పంచుకున్నారు. భారతదేశంలో మరెంతో శక్తివంతంగా వ్యవస్థీకృతం చేయడానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకొని వుందని ప్రకటించారు. ఆయుర్వేద వైద్య ప్రస్థానం వైపు అచంచలమైన విశ్వాసాన్ని వెళ్ళబుచ్చారు. 2014లో 20వేల కోట్ల పరిశ్రమగా వున్న ఆయుర్వేదం ఇప్పుడు లక్షా యాభై వేల కోట్లకు విస్తరించిందని ప్రధాని వివరించారు.

ఇదంతా ఆనందదాయకమే. అదే సమయంలో ఔషధ మొక్కల పెంపకం,పరిశోధనల్లో పెరుగుదల, నాణ్యతలో మెరుగుదల, విద్యాలయాల స్థాపనలో అభివృద్ధి, ఉద్యోగ కల్పనలో ప్రగతి పట్ల ప్రభుత్వాలు మరింత పెద్దఎత్తున దృష్టి సారించాల్సి వుంది. కరోనా కాలంలో జరిగిన మంచి పరిణామాల్లో భారతీయ సంప్రదాయ జీవన విధానాల పట్ల ఆసక్తి పెరగడం ఒకటి. వ్యక్తిగత స్థాయిల్లోనూ ఆయుర్వేదంపై అనేకులు పరిశోధనలు చేయడం ఆరంభించారు. అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రం గుజరాత్ లో రూపుదిద్దుకుంటోంది. త్వరలో జాతీయ ఆయుష్ రీసెర్చ్ కన్సార్టియం అందుబాటులోకి రానున్నట్లు ప్రధాని మాటల ద్వారా తెలుస్తోంది.

ఈ తరుణంలో ఆయుర్వేద ప్రాభవం పెరిగే దిశగా ఆలోచనలు పెరగాల్సి వుంది. ఔషధ మొక్కలను పరిరక్షించుకోవడం,పెంచుకోవడం, పంచుకోవడం మూడూ ముఖ్యమైన అంశాలు.ప్రకృతి వైద్యంలో ఔషధ మొక్కల పాత్ర అపారం. విషతుల్యమైన రసాయనాలు, ఆరోగ్యాన్ని ఛిద్రం చేసే నకిలీ ఉత్పత్తులు, కాస్మోటిక్స్ అపరిమితంగా పెరిగిపోతున్నాయి. సమాంతరంగా హెర్బల్ ఉత్పత్తులు పెరగాల్సిన అవసరం వుంది. వ్యాధుల నియంత్రణకు,ఆహార పదార్ధాలు,నూనెల తయారీకి వీటి అవసరం ఎంతో వుంది. ఇవి మానసిక,శారీరక ఆరోగ్యాలను రెండింటినీ పెంచి పోషించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. హెర్బల్ రంగంలో విద్య,ఉపాధి, పరిశోధనలు పెరగడం కూడా మంచి పరిణామం.

సాగు కూడా గణనీయంగా పెరుగుతోంది. మరింత సమగ్రంగా,పారదర్శకంగా సాగినప్పుడే అనుకున్న లక్ష్యాలు దరిచేరగలవు. ఆరోగ్యం బాగుపడాలంటే ఆరుసూత్రాలను పాటించమని ఆయుర్వేదం చెబుతోంది. ఎండలో కూర్చోవడం,సాయంకాలం వేళ కాస్త చల్లగాలిని పీల్చడం, ఆహారంలో పరిమితులను పాటించడం,జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇచ్చేలా అప్పుడప్పుడూ ఉపవాసం చేయడం,పచనం… అంటే జీర్ణమయ్యేంత వరకూ మళ్ళీ తినకుండా ఉండడం,నీరు మొదలైన ద్రవ పదార్ధాలను తీసుకోవడంలోనూ పరిమితిని పాటించడం. ఈ ఆరు అంశాలపైన దృష్టి పెట్టడం ఆధునిక జీవనశైలిలో మగ్గుతున్నవారికి మరింత ముఖ్యం.

ఇదంతా ఏ మాత్రం ఖర్చులేని వ్యవహారం.కరోనా ప్రభావం నేపథ్యంలో ఆయుర్వేదం వైపు మళ్ళుతున్నవారి సంఖ్య, పెట్టుబడులు,ఎగుమతులు కూడా భారీగా పెరుగుతున్నట్లు సమాచారం.ఇది చాలా మంచి పరివర్తన.ఇందులో విదేశీ పెట్టుబడులు కూడా బాగా పెరుగుతున్నాయి.ఈ విషయంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంప్రదాయమైన విధానాలు, ఆధునిక శాస్త్రీయ పద్ధతులు, అందివచ్చిన సదుపాయాలను సమన్వయం చేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలి. వెరసి ఆయుర్వేదం మనది.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

45 ఏళ్లుగా కాంగ్రెస్ లో మాదిగలకు అన్యాయం

Bhavani

రాజంపేట లో వైసీపీ రైతు దగా దినోత్సవం…

Satyam NEWS

ఏపీలో చీప్ లిక్కర్ లేదు

Sub Editor 2

Leave a Comment