38.2 C
Hyderabad
May 1, 2024 21: 32 PM
Slider చిత్తూరు

ఎస్సై నుండి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించిన స్వాతి

#Police Department

2018 బ్యాచ్ SI గా తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో నియామకమై, విధులు నిర్వహిస్తూనే గ్రూప్-1 ఉద్యోగ నియామకాలలో రాష్ట్రంలోనే 8 వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని స్వాతి సాధించారు. సత్యసాయి జిల్లా, హిందూపురం, గురవనహళ్లి గ్రామం వాస్తవ్యులు నాగరాజు, రత్నమ్మ దంపతులకు స్వాతి 1993 సంవత్సరంలో జన్మించారు. బాల్యం నుండే విద్యలో చురుకుగా ఉంటూ M.Sc కెమిస్ట్రీ ఎస్వీ యూనివర్సిటీ నందు ఉన్నత విద్యను అభ్యసించారు.

అనంతరం ఎస్సై నియామక పరీక్షలలో ఉత్తీర్ణలై 2017 సంవత్సరంలో ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించి ట్రైనింగ్ కు వెళ్లారు. 2018 జూలై మూడవ తేదీన ఎస్సై ట్రైనింగ్ పూర్తి చేసుకుని అప్పటి తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా లోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ నందు ప్రొబేషనరీ ఎస్సైగా స్వాతి నియామకం అయ్యారు. తర్వాత ఆమె గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో SHO గా, శ్రీకాళహస్తి 2-టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా, జిల్లా SB నందు ఎస్ఐగా విధులు నిర్వర్తించారు.

2021 సంవత్సరంలో ఒంగోలుకు చెందిన మహేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని వివాహమాడారు. ఈ క్రమంలో తన భర్త ప్రోత్సాహంతో ఆశయ సాధన కోసం కృషి చేస్తూ దాదాపు ఒకటిన్నర సంవత్సరం లీవు తీసుకుని హైదరాబాదులోని ప్రముఖ అకాడమీలో కోచింగ్ తీసుకుని 2022 సంవత్సరంలో వచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా తన ఆశయ సాధనే లక్ష్యంగా నిబద్ధత, పట్టుదల, కఠోర శ్రమతో అహర్నిశలు కష్టపడి చదివి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల కాలంలో ఇంటర్వ్యూలు పూర్తిచేసి ఏపీపీఎస్సీ వెలువరించిన గ్రూప్-1 తుది ఫలితాలలో స్వాతి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపిక అయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గా నియామకం పొందారు.

ఈ నేపథ్యంలో గురువారం నాడు తిరుపతి జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి తన కార్యాలయం నందు తిరుపతి జిల్లా పోలీస్ యూనిట్ నుండి ఎస్సైగా స్వాతిని రిలీవ్ చేస్తూ, ఆమెకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తరపున ఘనంగా సన్మానం చేశారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తిరుపతి పోలీస్ శాఖ నుండి ఎస్సైగా పనిచేస్తూ పట్టుదల విశేష కృషితో కష్టపడి చదివి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించడం చాలా సంతోషకరం అన్నారు. సాధారణంగా పోలీసు అధికారులు గానీ సిబ్బంది గాని పోలీస్ ట్రైనింగ్ తర్వాత చాలామంది తన ఆశయాన్ని క్రమంగా మర్చిపోతూ పట్టుదల సడలిస్తారు. కానీ స్వాతి తన లక్ష్యం వైపు పైనుంచి కఠోర శ్రమ చేసి ఇటీవల ఏపీపీఎస్సీ వారు చేపట్టిన గ్రూప్-1 రిక్రూట్మెంట్ లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించడం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా పరిపాలన విభాగంలో భాగమైన ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలని అన్నారు.

పోలీస్ శాఖలో బాగా చదువుకొని ఉన్న చాలామంది స్వాతి ని స్ఫూర్తిగా తీసుకొని మీ నైపుణ్యాలకు పదును పెట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీ ఆశయ సాధనే లక్ష్యంగా పయనించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆమె విజయానికి సహకరించిన కుటుంబ సభ్యులకు, తన తోటి పోలీస్ అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. సన్మానం అనంతరం స్వాతి మాట్లాడుతూ 2018 నుండి తిరుపతి జిల్లాలో ఎస్సైగా పనిచేస్తున్నానని ఈ జిల్లా పోలీసు విభాగం పుట్టినిల్లుతో సమానమని ఉద్వేగమయ్యారు.

ఇన్ని రోజులు పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఎస్సైగా విధులు నిర్వర్తించాను రేపటి నుండి పోలీస్ యూనిఫాం వేసుకోలేనని తెలిసి ఒకవైపు బాధగా ఉన్నా, మరోవైపు నా లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషకరంగా ఉందన్నారు.

ఈరోజు గ్రూప్-1 ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి ముఖ్య కారణం నేను పోలీస్ శాఖలో పనిచేసిన అనుభవం వలనే ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా, కచ్చితత్వంతో సమాధానాలు చెప్పగలిగాను. ఫలితంగా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించడంలో పోలీస్ శాఖ అనుభవం ఎంతో ఉపయోగపడిందని జీవితాంతం పోలీస్ శాఖకు రుణపడి ఉంటాను అన్నారు. పోలీస్ శాఖలో తిరుపతి జిల్లా తరఫున మీరు నాకు సన్మానం చేయడం చాలా సంతోషదాయకం అని భావోద్వేగమయ్యారు.

ఈ సన్మాన కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన) కులశేఖర్ (శాంతిభద్రత) విమల కుమారి (నేర విభాగం) డీఎస్పీలు గిరిధర ఎస్బి సురేంద్ర రెడ్డి తిరుపతి ఏవో కిషోర్ కుమార్ ఎస్బి సిఐలు శ్రీనివాసులు రామకృష్ణ ఆచారి ఎంటిఓ రెడ్డప్ప రెడ్డి, ఎస్బి ఎస్సైలు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పని చేయించుకుని బిల్లులు ఇవ్వని ప్రభుత్వం ఇది

Satyam NEWS

మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం సమర్పించిన వీఆర్ఏలు

Satyam NEWS

భయం వీడి… కరోనా వ్యాక్సిన్ దిశగా..

Satyam NEWS

Leave a Comment