42.2 C
Hyderabad
May 3, 2024 17: 12 PM
Slider తెలంగాణ

కారు, బస్సు మధ్య నలిగిపోతున్న కమలనాథులు

vidyasagar 34

తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుదామనుకుంటున్న బిజెపి, నాయకత్వ లేమితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా కనిపిస్తున్నది. కేసీఆర్ ను సవాల్ చేసే స్థాయి, జనాకర్షణ శక్తి ఉన్న నాయకుడు లేకపోవడం బిజెపికి ఊపు తీసుకురావడం లేదు. పార్లమెంటు ఎన్నికలలో నాలుగు స్థానాలు గెలవడం కేవలం గాలి వాటమే తప్ప వారికి క్షేత్ర స్థాయిలో బలం లేదనే టిఆర్ఎస్ నాయకుల మాటలు నిజమే అని రాష్ట్ర బిజెపి నాయకులు రుజువు చేస్తున్నారు.

పోలింగ్ ముగిసిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బిజెపి ఏ మాత్రం ప్రభావం చూపించలేదని ఎగ్జిట్ పోల్స్ రుజువు చేస్తున్నాయి. టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొని ఉన్న తీవ్రమైన పోటీలో బిజెపి స్థానం ఏమిటో హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అర్ధమైపోయింది. మాస్ లీడర్ లేకపోవడం, డబ్బు ఖర్చు చేసే శక్తి లేకపోవడం స్పష్టంగా కనిపిస్తున్నది. వీటన్నింటికి తోడు ఉన్న నాయకత్వం కూడా అందరిని కలుపుకుని వెళ్లే విధంగా పని చేయకపోవడంతో పార్టీ బలపడటం లేదని కేంద్ర కమిటీకి నివేదికలు వెళ్లాయి.

తెలంగాణ వ్యాప్తంగా బిజెపి తన యంత్రాంగాన్ని బలపరచుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం పెద్ద లోపం. నియోజకవర్గాలకు బాధ్యులను ఇప్పటి నుంచే తయారు చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఫలితం ఉంటుంది కానీ పని చేస్తున్న వారికి కచ్చింతగా టిక్కెట్ వస్తుందనే గ్యారెంటీ లేకపోవడం తో చాలా మంది మౌనంగానే ఉంటున్నారు. తెలంగాణలో బలపడేందుకు బిజెపి నాయకత్వం ఆర్టీసీ సమ్మెను తీసుకోవడం ఇబ్బంది కరంగా మారిందని బిజెపి నాయకులు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఆర్టీసీ సమ్మెలో బిజెపి పాత్ర నామమాత్రంగానే ఉంది. హైదరాబాద్ నగరంలో బిజెపి కార్యకర్తలు ఆర్టీసీకి సంఘీభావంగా నిరసనలు తెలిపినా జిల్లాలలో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంపై పార్టీ కూడా మల్లగుల్లాలు పడుతున్నది. ఆర్టీసీ సమ్మెను నీరుగార్చేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుండటంతో ఎక్కువ రోజులు సమ్మె కొనసాగించేందుకు అవకాశం లేని ఈ స్థితిలో బిజెపి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతున్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను భగ్నం చేసేందుకు యూనియన్లను డివైడ్ చేసే పనికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో సమ్మె కొనసాగించడం రాబోయే రోజుల్లో కష్టమౌతుంది.

ఈ దశలో బిజెపి చేయగలిగింది లేదు. తమ పాత్ర పెద్దగా లేని ఆర్టీసీ సమ్మెను భుజాన వేసుకోవడం వల్ల బిజెపి విఫలం అయిందనే అపప్రథను మూటగట్టుకోవాల్సి వస్తుందని బిజెపి కేంద్ర కమిటీ ముందు నుంచే హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిందని అంటున్నారు.

ఏ కారణం వల్ల ఆర్టీసీ సమ్మె విఫలం అయినా అది బిజెపి రాష్ట్ర కమిటీ పై పెను ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తున్నది. బిజెపి ఇలాంటి తప్పటడుగులే వేస్తుంటే ప్రత్యర్థులకు ఎలాంటి ప్రమాదం ఉండదు.  

Related posts

మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

రైతాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి

Satyam NEWS

గుడ్ న్యూస్: త్వరలో గ్రీన్ జోన్ లోకి వెళుతున్నాం

Satyam NEWS

Leave a Comment