ప్రయివేటు ట్రావెల్స్ అన్న తర్వాత చిన్న చిన్న లోపాలు ఉంటాయని వాటిని బూతద్దంలో చూపించి బస్సులు సీజ్ చేస్తున్నారని మాజీ ఎంపి సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నో ట్రావెల్స్ బస్సులుండగా ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నా బస్సులే కనిపిస్తున్నాయి. నాకున్న ఎన్నో బస్సుల్లో ఇప్పటి వరకు 31బస్సులు సీజ్ చేశారు అని ఆయన అన్నారు. 70 ఏళ్ల నుంచి వాహనరంగం లో ఉన్నానని, చిన్న చిన్న లోటు పాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్ కైనా సహజమని ఆయన అన్నారు.అయితే నా బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారు. ఫైన్ లతో పోయే తప్పిదాలను సీజ్ చేయటం ఎంత వరకు సబబు అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. పరిపాలన లో వై ఎస్ జగన్ కిందా మీద పడుతున్నాడని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే జగన్ పాలనకు 100కి 150మార్కులు ఇవ్వాలని ఆయన అన్నారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మా అబ్బాయేనని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకూడదని మాత్రమే తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానని అంతే కానీ రాజకీయాలు మాట్లాడనని చెప్పలేదని దివాకర్ రెడ్డి తెలిపారు.
previous post