పంటల మార్పిడిలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయిల్ పామ్ పెంపకానికి ప్రోత్సాహం కల్పిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు, అలంపూరు, గద్వాల, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతాలు ఆయిల్ పామ్ పెంపకానికి అనువైన ప్రాంతాలుగా గుర్తించామని ఆయన అన్నారు. పామాయిల్ మొక్కలు, ఎరువులకు నాలుగేళ్లకు హెక్టారుకు రూ.20 వేల సబ్సిడీ అందిస్తామని ఆయన అన్నారు. నిరంతరం అంతరపంటలు సాగు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని, నాలుగేళ్ల నుండి ప్రారంభమై 30 ఏళ్ల వరకు ఏడాది పొడవునా దిగుబడి వచ్చే పంట ఆయిల్ పామ్ అని ఆయన తెలిపారు. రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసి రవాణా ఛార్జీలతో కలిపి రైతుల బ్యాంకు ఖాతాలలో టీఎస్ ఆయిల్ ఫెడ్ నగదు జమ చేస్తుందని మంత్రి వివరించారు. ఎకరాకు ఖర్చులు పోను రూ.75 వేల నుండి రూ.80 వేల ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. ఆయిల్ పామ్ సాగులో ఉన్న సత్తుపల్లి, అశ్వారావుపేట, అప్పరావుపేట, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ప్రాంతానికి వెయ్యి మంది రైతులను స్వయంగా తీసుకువెళతానని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వచ్చే సీజన్ నాటికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో సంతోషంగా సాగు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో 206 మండలాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమని కేంద్ర ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ, రాష్ట్ర ఉద్యాన శాఖ చెప్పాయని మంత్రి గుర్తు చేశారు. ఆయిల్ పామ్ రైతులకు అందుబాటులో ఉండేందుకు బీచుపల్లి ప్లాంట్ పునరుద్దరణ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
previous post