తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాలన్ని తెలుగులోనే కొనసాగించాలని ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రపంచ తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు కోటిపల్లి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.
అందరూ తమ పిల్లల్ని అమెరికా పంపించి డబ్బులు సంపాదించేలా చేసేందుకు ఇంగ్లీష్ నేర్పించాలనుకుంటున్నారని అయితే అది కరెక్టు కాదని ఆయన అన్నారు. మాతృ భాషలో విద్యాభ్యాసం ద్వారానే, జ్ఞనాభివృధితో పాటు ఆర్ధిక అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ప్రపంచం లోని మేధావులు, విద్యావేత్తలు, మానసిక శాస్త్ర వేత్తలు, ఐక్యరాజ్య సమితి మండలి, యునెస్కో వారు ప్రతి ఏటా మాతృభాషా దినోత్సం జరుపుతారని ఆయన గుర్తు చేశారు.
విద్యాభ్యాసం మాతృ భాషలో చేస్తున్న తమిళులు, గుజరాతీలు, పంజాబిలు, మలయాళీలు, మహారాష్ట్రీయులు, కన్నడిగులు, బెంగాలీ భాష మాట్లాడేవారు ప్రపంచమంతా విస్తరించి ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలని సుబ్బారావు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు అమలు కాకపోతే మరే రాష్ట్రంలో మరే దేశంలో అమలవుతుందని ఆయన ప్రశ్నించారు.
మాతృభాష అయిన తెలుగులో విద్యాభ్యాసం జరిగే ఇంగ్లీష్ గానీ మరే భాష గానీ నేర్చుకోండం సులభం అవుతుందని ఆయన అన్నారు. తెలుగును ప్రపంచ భాషగా అభివృద్ధి చేయాలన్న ఆశయ సాధనలో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.