వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మూడు ముక్కలుగా చేయడం పాలనా పరంగా ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం ‘ఒకే దెబ్బకు మూడు పిట్టలు’ అనే విధంగానే ఉంది. రాజధాని ప్రాంతంలో భూములు కొనుక్కుని ఆర్ధికంగా స్థిరపడిన తెలుగుదేశం అనుకూల వర్గాలైన కమ్మ కులస్తులకు ఈ నిర్ణయం మింగుడుపడదు.
రాజధాని అమరావతి నుంచి పాక్షికంగానైనా తరలిపోతే కమ్మ కుల ప్రాబల్యం తగ్గే అవకాశం ఉంటుందని సిఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. కమ్మ వారి ఆర్ధిక మూలాలను దెబ్బ కొట్టేందుకు జగన్ రాజధాని అంశాన్ని తలకెత్తుకున్నారనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బలంగా ఉన్న ఉత్తరాంధ్రలో ఆ పార్టీని దెబ్బ కొట్టేందుకు జగన్ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ అనే అస్త్రాన్ని ప్రయోగించారు.
అధికారులంతా కూడా విశాఖ పట్నంలోనే ఉంటారని చెప్పడం ద్వారా ఆప్రాంత ప్రజలను జగన్ సమ్మోహితులను చేసినట్లవుతుంది. ఉత్తరాంధ్ర లో ఇప్పటికే వైసిపికి బలమైన నాయకులు ఉన్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో వారు మరింత బలవంతులు అవుతారు. తెలుగుదేశం పార్టీకి ఆ ప్రాంతంలో బలమైన నాయకత్వం లేకపోవడంతో ఈ నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ అక్కడ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి తలెత్తుతుంది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాయలసీమకు చెందిన వ్యక్తి అయినా కూడా రాయలసీమ లో తెలుగుదేశం పార్టీకి అంతగా ఆదరణ లేదు. హైకోర్టును కర్నులులో ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమలో జగన్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. రాయలసీమపై ఎంతో ఆశ పెట్టుకుని పని చేస్తున్న బిజెపికి కూడా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా దెబ్బే.
రాయలసీమ ఉద్యమాన్ని నిర్మించాలని బిజెపి చాలా కాలంగా అక్కడ పని చేస్తున్నది. బిజెపి కార్యకర్తలు ఊరూరా తిరుగుతూ ఇప్పటికే రాయలసీమ ఉద్యమంపై ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు. ఇక ఇప్పుడు రాయలసీమ ప్రత్యేక ఉద్యమం జరిగే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. కోస్తా ప్రాంతంలో బలమైన వర్గంగా ఉన్న కాపు సామాజిక వర్గంపై కాపు ఉద్యమానికి సంబంధించిన కేసులు ఎత్తేయడం ద్వారా కాపుల్లో సానుకూలత తెచ్చుకున్న జగన్ జనసేనపై కూడా దెబ్బ కొట్టినట్లయింది.
ఒకే దెబ్బతో తెలుగుదేశం, జనసేన, బిజెపిలకు చెక్ పెట్టే విధంగా జగన్ రాజధానిపై పావులు కదిపారు. కాపులను దగ్గరకు తీసుకోవడం, కమ్మ కులస్తుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయడం ద్వారా బిజెపి ఆశలను దూరంగా నెట్టారు. పరిపాలనా సంబంధమైన వ్యవహారాలు ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం తెలుగుదేశం, జనసేన, బిజెపిలకు ఇది మింగుడు పడని నిర్ణయం గా మారుతుందనడంలో సందేహం లేదు. అందుకే మూడు రాజధానులపై మూడు పార్టీలూ మాట్లాడలేకపోతున్నాయి. దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయా ప్రాంతాలలో వారికి రాజకీయంగా దెబ్బ.