తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు బుధవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవీగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. రాత్రి 7.30 నుండి 11 గంటల వరకు వాహనసేవ కోలాహలంగా సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజ వాహనం. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు ఓంకారానికీ, విశ్వాసానికీ సంకేతమని చెబుతారు.