కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఒక సినిమా తీసి తక్కువ పెట్టుబడిలో ఎక్కువ పబ్లిసిటీ కొట్టేద్దామని శతవిధాలా ప్రయత్నించిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చిత్రం సెన్సార్ దశలోనే చుక్కలు కనిపించాయి. రాజకీయ కథాంశంతో చిత్రాలు నిర్మించి చీప్ పబ్లిసిటీ కొట్టేసే రామ్ గోపాల్ వర్మ ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను తీసి అభాసుపాలయ్యాడు. పెట్టిన పెట్టుబడి కూడా రాక ఆ చిత్రం కుదేలైపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ చిత్రాన్ని విడుదల చేయరాదని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రామ్ గోపాల్ వర్మ ఆశించింది చేయలేకపోయాడు. ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తర్వాత కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే విచిత్రమైన టైటిల్ పెట్టి మరో రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని ప్రారంభించాడు. కులాల ప్రస్తావన తో సినిమా నిర్మించడం పై ఎంతో మంది నిరసన వ్యక్తం చేసినా రామ్ గోపాల్ వర్మ ఖాతరు చేయలేదు.
క్రైస్తవ మతానికి చెందిన కే ఏ పాల్ క్యారెక్టర్ ను కూడా ఈ చిత్రంలో పెట్టి వివాదం రేపేందుకు రామ్ గోపాల్ వర్మ శతవిధాలా ప్రయత్నం చేశాడు. కే ఏ పాల్ ఈ చిత్రంపై హైకోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. చంద్రబాబునాయుడిని పోలిన ఒక వ్యక్తిని తీసుకువచ్చి సినిమాలో క్యారెక్టర్ వేయించిన రామ్ గోపాల్ వర్మ అదే తరహాలో లోకేష్ కు కూడా డూప్ ను పెట్టాడు. ఏపి సిఎం జగన్ క్యారెక్టర్ కూడా ఈ చిత్రంలో ఉండటం, చంద్రబాబునాయుడి క్యారెక్టర్, జగన్ క్యారెక్టర్లు కలిసి ఉండే విధంగా పోస్టర్లు విడుదల చేయడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో ఆసక్తి రేపే ప్రయత్నాన్ని రామ్ గోపాల్ వర్మ చేశాడు.
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ విడుదల తేదీ ప్రకటించిన తర్వాత కూడా ఈ సినిమా సెన్సార్ కాలేదు. చిత్రం సెన్సార్ కాకపోవడానికి పలు రకాల ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. చిత్రం టైటిల్ వివాదాస్పదంగా ఉన్నందున అసలు టైటిల్ నుంచే సెన్సార్ లో అభ్యంతరం వ్యక్తం అయినట్లు తెలిసింది. ఆ టైటిల్ గల చిత్రాన్ని సెన్సార్ చేసేందుకే సెన్సార్ బోర్డు విముఖత వ్యక్తం చేసినట్లు గా చెబుతున్నారు. చిత్రం విడుదల తేదీ దగ్గర పడటం, సెన్సార్ బోర్డు ముందుకు కూడా చిత్రం వెళ్లకపోవడంతో రామ్ గోపాల్ వర్మకు చుక్కలు కనిపించాయి. దాంతో చిత్రం టైటిల్ ను మారుస్తున్నట్లు ప్రకటించాడని భావిస్తున్నారు. అమ్మ రాజ్యంలో..కడప బిడ్డలు….అంటూ టైటిల్ ను రామ్ గోపాల్ వర్మ మార్చాడు.