టిటిడి అధికారులు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ పి.నవీన్ కుమార్ రెడ్డి పై పెట్టిన కేసును తక్షణం ఉపసంహరించు కోవాలని సైకాలజిస్ట్ సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ప్రజల శ్రేయస్సు కోరి, మంచి ఉద్దేశ్యంతో కరోనా వార్తను సోషియల్ మీడియాలో ప్రచారం చేశారు తప్ప టిటిడి ప్రతిష్టకు భంగం కలిగించడానికి కాదని అన్నారు.
ఓ భక్తునికి కరోనా సోకిందని కొన్ని చానెళ్లలో వచ్చిన వార్తకు స్పందించిన ఆయనకు దురుద్దేశం అంటగట్టడం తగదన్నారు. ఆ వార్త తప్పయితే వెంటనే టిటిడి అధికారులు వివరణ ఇస్తూ మీడియాలో ప్రసారం చేసివుంటే సరిపోయేదని చెప్పారు.
టిటిడి లాంటి ధార్మిక సంస్థ ఇలాంటి అణచివేత, కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డం మంచిది కాదన్నారు. ప్రజలు కూడా కేసులు పెట్టడం ప్రారంభిస్తే అధికారులు అందరూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసులు ఫిర్యాదులు స్వీకరించకపోతే కోర్టులో ప్రైవేటు కేసులు వేస్తారన్నారు.
పలువురు టిటిడి అధికారులు అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడటం రోజు వార్తల్లో చూస్తున్నామన్నారు. తమ మీద ఆరోపణలు చేసే వారిని భయపెట్టడానికే ఇలాంటి కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇకనైనా టిటిడి అధికారులు కేసును ఉపసంహరించుకుని సున్నితంగా పరిష్కరించుకోవాలని సూచించారు.