నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవస్థానం లో వసంత పంచమి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 28, 29, 30 తేదీలలో వసంత పంచమి ఉత్సవాలు జరుగుతాయి. ఈ రోజులలో శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ.
అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించే వసంత పంచమి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికి భారీగా భక్త జనులు వచ్చే అవకాశం ఉన్నందున దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ప్రత్యేక అక్షరాభ్యాసం క్యూ లైను ఏర్పాటు చేశారు.
వంద రూపాయల అక్షరాభ్యాసం క్యూ లైను, ప్రత్యేక దర్శనం క్యూ లైను, ఉచిత దర్శనం క్యూ లైన్లను భైంసా DSP నర్సింహా రావ్, ముధోల్ CI అజయ్ బాబు, బాసర మండల SI రాజు, దేవస్థాన ఆలయ EO వినోద్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆలయం లోపల, ఆలయం చుట్టు పక్కల, అన్ని ఆలయ మండపాలలో పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.