38.2 C
Hyderabad
April 29, 2024 21: 48 PM
Slider విజయనగరం

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు

#depikaips

విజయనగరం జిల్లాలో గొర్రె, కోడి పందాలు నిర్వహిస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎం.దీపిక హెచ్చరించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని గ్రామాల్లోను, శివార్లలోను, పట్టణాల్లోను కోడి, గొర్రె పందాలు మరియు జూదాలు నిర్వహించే అవకాశం ఉన్నందున, అటువంటి స్థావరాలను గుర్తించి, వాటిపై గ్రామ స్థాయిలో నిఘా పెట్టాలన్నారు.

ఇందుకు మహిళా పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గతంలో కోడి, గొర్రె పందాలలో పట్టుబడిన వ్యక్తులను బైండోవరు చేయాలన్నారు. బైండోవరు చేసిన వ్యక్తులు మళ్ళీ ఇదే తరహా కేసుల్లో పట్టుబడితే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

కోడి పందాలు నిర్వహించేందుకు కత్తులను తయారు చేసే వారిని, పందాలకు కత్తులను సరఫరా చేసే వారిని, పందాలు నిర్వహించేందుకు స్థలాలను కేటాయించే వారిని గ్రామస్థాయిలో మహిళా పోలీసుల సహకారంతో గుర్తించాలన్నారు. అలా గుర్తించిన వ్యక్తులను మండల లేదా సబ్ డివిజనల్ మెజిస్ట్రేటు కోర్టుల్లో హాజరుపర్చి, మంచి ప్రవర్తన కొరకు వారిని కూడా బైండోవరు చేయాలని, వారి నుండి సెక్యూరిటీగా పెద్ద మొత్తంలో బాండులను తీసుకోవాలన్నారు.

ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, కోడి, గొర్రె పందాలు, జూదం ఆడినా వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసు అధికారులు గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించి, సంక్రాంతి పండుగను సాంప్రదాయ పద్దతిలో జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని కోరుతున్నారు.

ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలపై దాడులు చేసేందుకు పోలీసు బృందాలను కూడా సిద్ధం చేసామన్నారు. ఎక్కడైనా జూదం, కోడి, గొర్రె పందాలు జరుగు తున్నట్లుగా తెలిస్తే డయల్ – 100కు లేదా పోలీసు వాట్సాప్ నంబరు 9392903402 కు సమాచారాన్ని అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేసారు.

ఇప్పటి వరకు కోడి, గొర్రె పందాల్లో గతంలో పట్టుబడిన 265 మందిని బైండోవరు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. రోజు రోజుకు కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. వేడుకల పేరుతో ఒకచోటుకు గుంపులుగా చేరవద్దని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు. ప్రజలను అప్రమత్తం చేసి, కోవిడ్ నిబంధనలు, కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పట్ల అవగాహన కల్పించే విధంగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు.

Related posts

దొడ్డిదారిన కరెంటు చార్జీలు పెంచి బుకాయిస్తారా?

Satyam NEWS

రిమ్స్ ఆసుపత్రిలో పసికందు అపహరణ…

Bhavani

దొంగలు బాబోయ్ దొంగలు

Satyam NEWS

Leave a Comment