29.7 C
Hyderabad
May 3, 2024 04: 15 AM
Slider ప్రత్యేకం

ఉత్తుత్తి పెట్టుబడులే తప్ప ఒరిగేది ఏమీ లేదు

#raghurama

పెట్టుబడులను పెట్టే  సోలార్ విద్యుత్ కంపెనీలకు భూములు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు?

పారిశ్రామికవేత్తల సదస్సులోని పెట్టుబడుల ఒప్పందాలు, మాయాబజార్ చిత్రం  తరహాలో రాష్ట్రంలో  బీభత్సమైన అభివృద్ధి జరగనుందని ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు ప్రచారానికి చేసుకోవడానికి మినహా,  పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే సూచనలేవీ కనిపించడం లేదని  నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు అన్నారు.

పారిశ్రామిక అభివృద్ధి పేరిట పాలకులు, పారిశ్రామికవేత్తలు  కలిసి దోచుకోవడానికి మాత్రమే ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి . అంతే కానీ పెట్టుబడులు పెడతామని చెబుతున్న  సంస్థల మార్కెట్ క్యాప్  పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. కోట్ల రూపాయల మూలధనం కలిగి సంస్థ లు వేలకోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని ఒప్పందాలు చేసుకోవడం పరిశీలిస్తే, ఆ సంస్థలకు అంత ఆర్థిక స్తోమత  లేదన్న విషయం తేటతెల్లమవుతుందన్నారు.

శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పారిశ్రామికవేతల  సదస్సులో రెన్యువల్ ఎనర్జీ కోసమే ఎక్కువగా ఒప్పందాలను చేసుకోవడం జరిగిందన్నారు.  ఇప్పటికే ఈ విభాగంలో  7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సంతకాలు జరిగాయి. ఎన్ టి సి పి 2.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్లాంట్ల ఏర్పాటుచేసి ,   77 వేల మందికి ఉద్యోగ,  ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

దేశవ్యాప్తంగా ఎన్ టి పి సి  పెట్టుబడులు మొత్తమే 2.2  లక్షల కోట్ల రూపాయలు. ఆ సంస్థ అధికారిక వెబ్సైట్  లెక్కల ప్రకారం  ఉద్యోగుల సంఖ్య 15700. ఆ సంస్థ రాష్ట్రంలో  2.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను పెడతామని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని, అందుకే ప్రభుత్వ రంగ సంస్థలలో  పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. 

రాష్ట్రంలో ఎన్ టి సి పి   2. 35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలంటే, ఆ సంస్థ రుణాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ, తన వంతుగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను మూలధనంగా  పెట్టాల్సి వస్తుంది.   ఎన్ టి సి పి కి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత ఏడాది క్రితం  ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. గత ప్రభుత్వ హయాంలో  అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింహాద్రి థర్మల్ ప్రాజెక్టు పక్కనే ఎన్ టి సి పి  మోడ్రన్ థర్మల్ ప్లాంట్  నిర్మిస్తామని చెబితే 1200 ఎకరాల భూమిని కేటాయించారు.

ప్రభుత్వానికి డబ్బులు కట్టిన ఎన్ టి సి పి , భూమి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించుకుంది. అయితే ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి  పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూరదృష్టితో ఇతరులకు కేటాయించవచ్చుననే ఉద్దేశంతో, ఎన్ టి సి పి కి కేటాయించిన భూమిని  వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్ టి సి పి న్యాయస్థానంలో సవాల్ చేసి, కోర్టు నుంచి స్టే ఆర్డర్ పొందిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు  ఎన్ టి సి పి తరఫున  జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తి హాజరై ఒప్పందాన్ని చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలంటే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, లేదంటే ఎన్ టి సి పి  సిఎండి స్థాయి  వ్యక్తులు హాజరై, చేసుకోవాలన్నారు. ఈ లెక్కన  రాష్ట్రంలో ఎన్ టి సి పి పెడతానని చెబుతున్న పెట్టుబడులన్నీ ఉత్తుత్తివేనని స్పష్టమవుతోందన్నారు.  

యాక్సెస్  బ్రూక్ ఫీల్డ్  క్లీన్ ఎనర్జీ  ( ఏ బి సి ) కంపెనీ కూడా రాష్ట్రంలో 1.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కంపెనీ ఈక్విటీ మూలధనం  ఒక కోటి 76 లక్షల రూపాయలు. ఎంతగా ఇన్వెస్టర్లు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పినప్పటికీ,  22 నుంచి 23 వేల కోట్ల రూపాయలను తమ వంతుగా పెట్టుబడి  పెట్టాల్సి ఉంటుంది.

కేవలం కోటి  76 లక్షల మూలధనం కలిగిన  ఒక సంస్థ, అన్ని వేల కోట్ల రూపాయలను తీసుకురాగలదా? అన్నది ప్రశ్నార్ధకమేనని రఘురామకృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు.  హ్యాచ్ వెంచర్స్  అనే సంస్థ  వినూత్న ఆలోచనలతో వస్తే, 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు  పెడతామని చెప్పింది. ఎవరు కూడా అంతగా వెంచర్ క్యాపిటల్ లో  వెచ్చించిన దాఖలాలు లేవు.

హ్యాచ్ వెంచర్ సంస్థ 20వేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఆ సంస్థ ఉద్యోగులు ఎంతమంది అంటే, కేవలం 12 మంది మాత్రమే. అటువంటి సంస్థ రాష్ట్రంలో 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో, 20వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందట అని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. అదానీ గ్రీన్ ఎనర్జీ  పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఇటీవల ఆ సంస్థ తీవ్ర నష్టాలను చవిచూసినప్పటికీ, ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటుంది.

ఆవారా గ్రూప్ 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారాన్ని కుదుర్చుకుంది. మార్కెట్ క్యాప్  మొత్తం కుదవపెట్టిన ఆ కంపెనీకి కేవలం 1200 కోట్ల రూపాయల  ఈక్విటీ లభిస్తుంది. మూడు రెట్లు ఎక్కువగా  ఈక్విటీ లభించినప్పటికీ, ఐదువేల కోట్ల  పెట్టుబడులు  పెట్టే అవకాశం ఉంది. అటువంటి సంస్థతో  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాన్ని చేసుకుందని  రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న 11 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలలో, 7.91 లక్షల కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు రెన్యుబుల్ ఎనర్జీ కోసం చేసుకున్నవే కావడం విశేషం. సోలార్ ఎనర్జీ, పంపుడ్ స్టోరేజ్ ఎనర్జీల కోసం ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దాదాపు పదివేల మెగావాట్ల  విద్యుత్ ఉత్పత్తి ఒకేసారి జరిగితే, ట్రాన్స్మిట్ చేసే  సామర్థ్యం లేదు. దానికోసం పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతభత్యాలు చెల్లించడానికి, రోడ్లపై ఉన్న గుంతలను కప్పెట్టాడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. అటువంటిది పదివేల కోట్ల రూపాయలను వెచ్చించి, ట్రాన్స్ మీట్ సామర్ధ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటుందా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయలతో  సౌర విద్యుత్ పార్కులను ఏర్పాటు చేసే విధంగా ఒప్పందాలను కుదుర్చుకున్నారు.

ఒక్క మెగావాట్  సౌర విద్యుత్ ఉత్పత్తికి  ఐదు కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా. నాలుగున్నర ఎకరాల స్థలం కావాలి. ఈ లెక్కన ఏడు లక్షల ఎకరాలు సౌర విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాన్ని కుదుర్చుకున్న కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని నెడ్ క్యాప్ అనే సంస్థ భూములను సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది.  నెడ్ క్యాప్ సంస్థ ఇప్పటికే 43 వేల  ఎకరాల భూమిని గుర్తించి సేకరించింది.

ఈ భూమిని  సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అప్పగించినప్పటికీ, ఇంకా ఆరున్నర లక్షల ఎకరాల భూమి అవసరం అవుతుంది. కోస్తా ప్రాంతంలో ఎకరా భూమి 20 నుంచి 30 లక్షల ధర పలుకుతుంది. గిరిజన ప్రాంతాలలో అడుగుపెట్టడానికి అవకాశం లేదు. అదంతా అటవీ ప్రాంతమే. ఇక రాయలసీమ జిల్లాలలోనూ భూమి అందుబాటులో ఉంది అనుకున్నప్పటికీ, అక్కడ కూడా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇక అందుబాటులో ఉన్నది నెల్లూరు  ఆ పైన ప్రాంతాలలో మాత్రమే. ఇప్పటికే అక్కడ నెడ్ క్యాప్ సంస్థ భూములను సేకరించింది.

ఏ విధంగా చూసినా,  ఆరున్నర లక్షల ఎకరాల భూములు సేకరించే అవకాశమే లేదు.  ఒకేసారి ప్రభుత్వ భూమిని పెద్ద మొత్తంలో పారిశ్రామికవేత్తలకు  అందజేయడానికి వీలు లేదు. భవిష్యత్ అవసరాలను కూడా చూసుకోవలసి ఉంటుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎవరి అబ్బా,  బాబు సొమ్ము తీసుకొని, సౌర విద్యుత్ ఉత్పత్తి  కంపెనీలకు భూములను అప్పగిస్తారని ప్రశ్నించారు. 

ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలను వెచ్చించి, విద్యుత్ ఉత్పత్తి కంపెనీ  ఏర్పాటు చేస్తామని చెప్పిన అరబిందో కంపెనీ,  మెగా వాట్ కు పాతిక వేల రూపాయల ఫీజు చెల్లించమంటే సమయం కావాలని కోరింది.  అటువంటి వారే మళ్లీ పారిశ్రామికవేత్తల సదస్సులో  పెట్టుబడులు పెడతామని  ఒప్పందాలను కుదుర్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

సౌర విద్యుత్ ఉత్పత్తిలో  దేశంలోనే అగ్రగామి రాజస్థాన్

సౌర విద్యుత్ ఉత్పత్తిలో  దేశంలోనే అగ్రగామిగా రాజస్థాన్, ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఎడారి ప్రాంతం  ఉండడంవల్ల, సూర్యతాపం అధికంగా ఉంటుంది. అలాగే భూమి లభ్యత కూడా ఎక్కువే.  

ఈ ఏడాది జనవరి 31వ తేదీ నాటికి,దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి  62 వేల మెగావాట్లు. రాజస్థాన్ 15 వేల మెగావాట్లతో  అగ్రస్థానంలో ఉండగా, గుజరాత్ 13వేల మెగావాట్లతో ద్వితీయ స్థానంలో, కర్ణాటక,  తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఆ తరువాత స్థానాలలో ఉండగా, ఆంధ్ర ప్రదేశ్  మూడు నుంచి  నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ఏడవ స్థానంలో ఉంటుందని తెలిపారు .

దేశంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి మొత్తం 62 వేల మెగావాట్లు కాగా, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే  లక్ష 70 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి  పెట్టుబడులు పెడతాననడం, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలను చేసుకోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు  విమర్శించారు. ఒకవేళ సౌర విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు భూములు ఇచ్చేందుకు బలవంతంగా ప్రజల నుంచి భూములు సేకరిస్తామంటే, ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా 4.08 లక్షల మెగావాట్ల   సౌర విద్యుత్ తో పాటు, పవన విద్యుత్, బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్  ఉత్పత్తి జరుగుతోంది. కృష్ణపట్నం, వీటిపిఎస్ అన్ని కలుపుకొని రాష్ట్రంలో 20వేల మెగావాట్ల  విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, రాష్ట్రంలో మరో లక్ష 70 వేల  మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగితే మొత్తం దాదాపు రెండు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి  అవుతుంది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న 4 లక్షల మెగావాట్ల విద్యుత్తు తో పాటు, ఈ రెండు లక్షల మెగావాట్ల  విద్యుత్ ఉత్పత్తి సరపరాకు కేంద్ర ప్రభుత్వం వద్ద,  పవర్ గ్రిడ్ వద్ద ప్రణాళికే లేదు. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు విద్యుత్ ఉత్పత్తి జరిగితే, విద్యుత్ సరఫరా కి మెగా వాట్ కి కోటిన్నర లక్షల కోట్ల రూపాయల అవసరం అవుతాయి. అంటే 1.7 లక్షల మెగావాట్లకు  రెండు లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. అటువంటి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను  ఎలా వెచ్చిస్తుందని ప్రశ్నించారు. రెన్యుబుల్ ఎనర్జీ పేరిట పెట్టుబడులన్నీ ఒక కట్టు కథ అని మండిపడ్డారు. రెన్యుబుల్ ఎనర్జీలో పెడతామని చెప్పిన పెట్టుబడుల్లో 10% పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే గొప్ప విషయమే. అదాని, జెఎస్ డబ్ల్యూ వంటి సంస్థలు పెట్టుబడులను పెట్టే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పదిహేను వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును అదానీకి గతంలోనే కేటాయించారు. ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు సంతకాలను చేశారని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

సంక్షేమంలో కూడా పెద్దగా చేసిందేమీ లేదు

గత నాలుగేళ్లలో  రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులోను కూడా పెద్దగా చేసిందేమీ లేదని రఘు రామకృష్ణంరాజు విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి, నొక్కిన బటన్ నే మళ్ళీ నొక్కారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి, రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తాను రాసిన లేఖలతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మారిస్తే నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. దీనితో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోకుండా, కక్షలు కమిషన్ల పేరిట పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమివేశారు. ఇప్పుడు అభివృద్ధి పేరుతో ఒక డ్రామాను సృష్టించారని  మండిపడ్డారు.

పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ  అన్నివేళల్లో తనని పారిశ్రామికవేత్తలు  ఫోన్లో సంప్రదించవచ్చునని  పేర్కొన్నారు కానీ ఫోన్ నెంబర్ మాత్రం ఇవ్వలేదని అపహాస్యం చేశారు. ఫోన్లో జగన్మోహన్ రెడ్డి  ప్రజాప్రతినిధులకే అందుబాటులోకి రారని, ఇక పారిశ్రామికవేత్తలకు  అందుబాటులోకి వస్తారా అంటూ ప్రశ్నించారు.

నా ముఖం చూసే పెట్టుబడులని చెప్పుకోవడానికే..

తన ముఖము చూసే రాష్ట్రంలో 11 లక్షల రూపాయల పెట్టుబడులను  పారిశ్రామికవేత్తలు పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి ఈ డ్రామా అంతా అని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు వస్తే, అక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని యువతను మరోసారి మోసగించేందుకే ఈ ప్రయత్నం. గతంలో జాబ్ క్యాలెండర్ అన్నారు… జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన పాపాన పోలేదు.

జగన్మోహన్ రెడ్డి దెబ్బకు నిరుద్యోగం అబ్బా అనాలి అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్విట్ ను ప్రస్తావిస్తూ… ఈ విధంగానే రానున్న ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు ప్రచారం చేసుకోనున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రెన్యుబుల్ ఎనర్జీ పరిశ్రమలు ఏర్పడితే పెద్దగా ఉద్యోగ అవకాశాలు ఉండవు. రాజస్థాన్లో 15 వేల మెగావాట్ల  సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, అక్కడ ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయో తెలుసుకోవాలని సూచించారు. 

10, 000 మెగావాట్ల పార్కు అయినా , 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి  పార్కులోనైనా పదుల సంఖ్యలోనే ఉద్యోగులు ఉంటారన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి  పరిశ్రమల వల్ల, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నన్ని ఉద్యోగ అవకాశాలు లభించవు. ప్రభుత్వం చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని రఘురామకృష్ణం రాజు తెలిపారు. చిత్తశుద్ధితో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని భావిస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలను అవలంబించాలని సూచించారు.

ప్రధాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి గుజరాత్ లో  పరిశ్రమల ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం కల్పించిన సబ్సిడీలు ప్రోత్సాహకాలతో గుజరాత్లో పరిశ్రమలను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో రెన్యుబుల్ ఎనర్జీ కోసం పెట్టుబడులు పెడతామన్న సంస్థలకు స్థలాన్ని, ఉత్పత్తి చేసిన విద్యుత్తును సరఫరా  ఎలా చేస్తారో చెప్పాలని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  తాను బహిరంగంగా సవాల్ చేస్తున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఎం ఎస్ ఎం ఈ  ద్వారా సబ్సిడీ ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయలను  ఇప్పటికీ పారిశ్రామికవేత్తలకు  ఇవ్వలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తానన్నా, తాను విశాఖకు మకాం మారుస్తున్నానని జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామికవేత్తలకు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి విశాఖ అభివృద్ధి కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే… అది కూడా లేదని  రఘు రామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

Related posts

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా చావా కిరణ్మయి ఎంపిక

Satyam NEWS

ఆకట్టుకునే విధంగా ప్రమిదలు

Murali Krishna

(2022) > Diet Pills For Menopause Weight Loss Best Weight Loss Supplement For Women

Bhavani

Leave a Comment