కంటికి రెప్పగా కాపాడాల్సిన కన్నతండ్రే కామాంధుడయ్యాడు.సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురు పై అత్యాచారానికి పాల్పడిన ఆ కసాయిని అకృత్యం రాయవరం మండలంలోని ఓ శివారు గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి ఒడిగట్టిన తీరుపై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు.
తల్లి చనిపోవడంతో ఓ వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి వచ్చింది. ఆదివారం నాన్నమ్మతో ఉన్న బాలికను గదిలోకి తీసుకెళ్లిన తండ్రి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తిరిగి సోమవారం రాత్రి అదే రీతిలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టేందుకు తండ్రి యత్నించడంతో భయంతో పక్కింటికి పారిపోయింది.
ఇరుగుపొరుగు వారికి చెప్పగా తండ్రి వారిని దూషిస్తుండటంతో కొందరు స్థానికులు 100కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ కొనసాగించిన పోలీసు అధికారులు, బాలిక తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. బాలికను కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును రామచంద్రపురం డీఎస్పీ ఎం.రాజగోపాలరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.