ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఉన్న స్థలాలు ఊడబెరుక్కుంటున్నది వైసీపీ ప్రభుత్వం. ఇదేం న్యాయం అని ప్రశ్నిస్తున్నారు కడప పట్టణంలో చిన్న చౌకు గ్రామ పొలంలోని సబ్ జైలు వెనుకభాగంలో ఉన్న భూ యజమానులు. చిన్న చౌకు గ్రామ రైతులు ఎస్ రమేష్ బాబు, టి శివరామిరెడ్డి, ఎస్ నిర్మల, టీ లలితమ్మ, సుబ్బలక్ష్మమ్మ, కే అమ్ములు, శేషయ్య, శంకరయ్య మంగళవారం స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో తమకు డీకేటీ పట్టాలు ఇచ్చిందని తెలిపారు.
అయితే ఇప్పుడు ప్రభుత్వం తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తమ భూములు తీసేసుకుంటున్నదని వారు అన్నారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మా భూములే కావాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమకు డీకేటీ పట్టాలు ఇచ్చినప్పుడు సబ్ జైలు వెనుకభాగంలో ఉన్న పిచ్చి మొక్కలను, కంప చెట్ల ఉండేవని, వాటిని ఎంతో కష్టపడి తొలగించి భూమిని చదును చేసుకుని సాగు చేసుకుంటున్నామని తెలిపారు.
ఆ భూమిలో మామిడి చెట్లు జామ తదితర తోటలో పెంచుకుంటూ జీవనం గడుపుతున్నామని వారు తెలిపారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వకుండా తమ భూములు తీసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఉన్నత అధికారులు న్యాయం చేయాలని వారు కోరారు.