27.7 C
Hyderabad
April 30, 2024 07: 13 AM
Slider ప్రత్యేకం

కమ్యూనిస్టుల దారెటు ..?

#cpi

భారతదేశంలో ఖమ్మం జిల్లా పేరు చెబితే అది కమ్యూనిస్టుల ఖిల్లాగా గుర్తించేవారు. ఇప్పటికీ  కమ్యూనిస్టుల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరుంది. ఇప్పుడు గతమంత బలంగా లేకపోయినా, తమకంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఆ పార్టీ లకు వున్నది. గతంలో సి‌పి‌ఎం, సి‌పి‌ఐ, సి‌పి‌ఐ ఎం‌ఎల్ పార్టీలకు అసెంబ్లీ, పార్లమెంట్ లలో ప్రాతినిధ్యం ఖమ్మం జిల్లా నుంచి వుండేది. ఆ పార్టీల శాసనసభా పక్ష నేతలుగా పువ్వాడ నాగేశ్వర రావు, బోడేపూడి వేంకటేశ్వర రావు, వ్యవహరించగా, సి‌పి‌ఐ ఎం‌ఎల్ అభ్యర్ధిగా గుమ్మడి నరసయ్య నాలుగు సార్లు ఇల్లందు నుంచి విజయం సాధించారు. కానీ రాను రాను కమ్యూనిస్టు పార్టీ ల బలం కొంత మేర తగ్గుతూ వస్తున్నది. ఆ మూడు పార్టీలకు వుమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే రాష్ట్ర కార్యదర్శులుగా వున్నప్పటికీ ఆశించిన స్తాయిలో ఆ పార్టీ లు బలం పుంజుకున్న దాఖలాలు లేవు.

కానీ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వామపక్షాల వైఖరిపై చర్చ జరుగుతున్నది. వుమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన పార్టీలుగా వున్నా ఒంటరిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ లు ఆసక్తి చూపటం లేదనే ప్రచారo కూడా వున్నది. అదే సమయంలో సి‌పి‌ఎం, సి‌పి‌ఐ కలిసి పోటీ చేస్తామని ప్రకటిస్తున్నా, మరో పార్టీతో కూడా వారు జతకట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. కొంత కాలం క్రితం వరకు నల్గొండ జిల్లా మునుగోడు ఎన్నికల మాదిరిగా బి‌ఆర్‌ఎస్ తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించినా, ఆ తరువాత జరిగిన పరిణామాలలో బి‌ఆర్‌ఎస్ కు దూరమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ తో చర్చలు జరిగినా, అవి ప్రాధమిక దశలోనే ఆగిపోయాయి. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటున్న నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీల వైఖరిపై చర్చ తెరపైకి వచ్చింది. ఆ పార్టీల నాయకులు మాత్రం బి‌జే‌పిని ఓడించటమే తమ లక్ష్యం అంటూనే బి‌ఆర్‌ఎస్ తమకు చేసిన మోసాన్ని కూడా  ప్రజలకు తెలియచేసి తమకు మద్దతు ఇవ్వాలని కోరతామన్నారు. మరోవైపు  సి‌పి‌ఐ ఎం‌ఎల్ మాత్రం తాము ఎప్పటిమాదిరిగానే ఒంటరిగానే పోటీ చేస్తామని చెపుతున్నది.

కాగా యెవరితో పొత్తు వున్నా, లేకపోయినా కొత్తగూడెం నుంచి తాము పోటీచేస్తామని సి‌పి‌ఐ ప్రకటించింది. అదే విధంగా భద్రాచలం స్థానంలో తప్పనిసరిగా పోటీ చేసేలా సి‌పి‌ఎం ప్రయత్నిస్తున్నది.  ఈ నేపధ్యంలో ఉమ్మడి ఖమ్మం జిలాలో బలమైన పార్టీలుగా ఉన్న సి‌పి‌ఎం,సి‌పి‌ఐ కలిసి విడిగా పోటీ చేయటం వల్ల ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలిపోయి అధికార బి‌ఆర్‌ఎస్ కు లాభం జరిగే అవకాశం వున్నదనే చర్చ కూడా జరుగుతున్నది. దీనిపై కాంగ్రెస్స్ నాయకత్వం కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. మరో రెండు రోజుల్లో దీనిపై ఆయా పార్టీల ప్రధాన నేతల మధ్య   చర్చ జరుగుతుందని తెలుస్తున్నది. అదే జరిగి అవగాహన కుదిరితే  ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే సి‌పి‌ఎం, సి‌పి‌ఐ లు ఎక్కువ స్తానాలలో  పోటీ చేసే అవకాశం ఉంది.

ఇదిలా వుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సి‌పి‌ఐ తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. కానీ తెలంగాణ లో మాత్రం వామపక్షాల వైఖరిపై ఉత్కంట వీడలేదు. వామపక్షాల విధానాలపైనే ఖమ్మం జిల్లా రాజకేయాలు ఆధారపడి వుంటాయని, అందుకే కమ్యూనిస్టుల వైఖరిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నదని ఒక సీనియర్ రాజకీయ నేత వెల్లడించారు. మరో రెండు రోజుల్లో ఆ రెండు పార్టీ లు కూడా అసెంబ్లి ఎన్నికలలో తాము అనుసరించాల్సిన విధానపై చర్చించేందుకు సమావేశం కానున్నట్లు సమాచారం. ఆ సమావేశం తర్వాతే కమ్యూనిస్టులు ఏ దారిలో వెళ్తారో తెలిసే అవకాశం వున్నది.

Related posts

వెన్నెల రేడు

Satyam NEWS

ఈ సారి వైభ‌వంగా శ్రీరామ‌న‌వ‌మి మ‌హోత్స‌వాలు

Satyam NEWS

రేవంత్ రోడ్‌షో.. భారీగా హ‌జ‌రైన ప్ర‌జ‌లు

Sub Editor

Leave a Comment