Slider ప్రత్యేకం

సూత్రధారుల వెనుకనున్న అల్టిమేట్ సూత్రధారులు ఎవరు?

#raghurama

మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి  హత్యకు పథకరచన చేసిన సూత్రధారులేవరో తేలిపోయిందని, ఈ హత్య వెనుక  అల్టిమేట్ సూత్రధారులు ఎవరైనా ఉన్నారా అన్నది తేలాల్సి ఉందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు.  హత్య కు పథక రచన చేసిన వారికి పెద్ద మొత్తం సొమ్మును  ఏర్పాటు చేస్తామని ఎవరైనా గాడ్ ఫాదర్ చెప్పారా అంటూ ప్రశ్నించారు.

హత్య చేసిన వారు ముందే దొరికారని, ఇప్పుడు లెవెల్ వన్ సూత్రధారుల పేర్లు  బయటకు వచ్చాయన్నారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు  మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి,  దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ప్రణాళిక రచించగా, మరో నలుగురు అమలు చేశారని హైకోర్టులో సిబిఐ దాఖలు చేసిన సునీల్ యాదవ్ బెయిల్ అభ్యంతర పిటిషన్ పేర్కొందన్నారు.

ఈ విషయాన్ని కొన్ని పత్రికలు స్పష్టంగా రాశాయని తెలిపారు. సాక్షి దినపత్రిక ఒక్క లైను కూడా రాయలేదన్న ఆయన, సాక్షి దినపత్రికలో రాయనంతమాత్రాన   నిజం అబద్ధం అయిపోదన్నారు. పులివెందులలో ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులు దగ్ధం చేసినంతమాత్రాన, ప్రయోజనం ఉండదన్నారు. సాక్షి దినపత్రికలో రాయకపోతే, ఇతర దినపత్రికల్లో రాయవద్దా  అంటూ ప్రశ్నించారు.

వైయస్ వివేకా హత్యకు సూత్రధారులు గురించి రాసినప్పుడు పులివెందులలో పత్రికా ప్రతులు దగ్ధం చేసిన వారు, ఆయన హత్య గావించబడినప్పుడు ఎటువంటి ఘర్షణలకు దిగలేదని గుర్తు చేశారు. అంటే ఈ హత్య వెనుక  ఎవరున్నారో స్పష్టమవుతుందని  రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు . వైయస్ వివేక హత్య  గావించబడిన మార్చి 14వ తేదీ అర్ధరాత్రికి కొన్ని గంటల ముందు వైయస్  భాస్కర్ రెడ్డి ఇంట్లో శివ శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి లు సమావేశమయ్యారన్నారు.

స్నేహంగా నటిస్తూనే గొడ్డలి వేటు

ఎర్ర గంగిరెడ్డి మాత్రం వైఎస్ వివేకా తో స్నేహాన్ని నటిస్తూ ఆయన వెంటే ఉన్నారన్నారు. వైయస్ వివేకను హత్య చేయడానికి  అనంతపురం జిల్లా కదిరిలో గొడ్డలిని కొనుగోలు చేశారని, గొడ్డలిని విక్రయించిన వ్యక్తి తాను దస్తగిరి కి అమ్మానని  ఆ తర్వాత సిబిఐ అధికారుల విచారణలో వెల్లడించారని గుర్తు చేశారు. దస్తగిరి, సునీల్ యాదవ్ ఇద్దరు కలిసి ఓచోట మద్యం సేవించి, ఎర్ర గంగిరెడ్డి సూచనల మేరకు వెనుక డోర్ నుంచి వైయస్ వివేకా ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు.

అప్పటికి వైఎస్ వివేకానంద రెడ్డి, వీళ్లు ఎందుకు వచ్చారని గంగిరెడ్డిని ప్రశ్నించగా…  ఏదో లావాదేవీల కోసం తన దగ్గరకు వచ్చారని పేర్కొని ఆయన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. వైయస్ వివేక ఇంట్లోకి ప్రవేశించిన దస్తగిరి, సునీల్ యాదవ్ లు తొలుత ఆయన చేతి పై  దాడి చేసి, ఆ తరువాత తలపై వేటు వేశారన్నారు. వైఎస్ వివేకా నిద్రకు ఉపక్రమించగానే దిండుతో ముఖం పై అదిమి హత్య చేసి గుండెపోటు గా చిత్రీకరించాలన్న  ఐడియా ఫెయిల్ అవడంతో, గొడ్డలితో ఆయనపై దాడి చేసినట్లు విచారణలో దస్తగిరి అంగీకరించిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

తుది శ్వాసతో ఉన్న వివేకాను ప్రాణాలతో వదిలివేస్తామని చెప్పి, ఆయన చేత బలవంతంగా ఒక లేఖ రాయించారని, అందులో ఊరులో లేని ప్రసాద్ ను వదిలి పెట్టవద్దని ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక  హత్యను దారి మళ్లించే కుట్ర దాగి ఉందన్నారు. హత్య జరిగిన విధానాన్ని ఆరోజు ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి పూసకొచ్చినట్లు వివరించారని  తెలిపారు. సిబిఐ కథనం ప్రకారం  హత్య జరిగిన రోజు ఉమా శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇంటికి పరిగెత్తుకుంటూ  వెళ్లినట్లు స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా   కనిపించినట్లు తెలియజేశారన్నారు .

గూగుల్ లుక్ అవుట్ లో ఎవరెవరి ఫోన్లు ఒకే సమయంలో ఒకే టవర్ రేంజ్ లో ఉన్నాయో, సిబిఐ అధికారులు తమ విచారణలో తేల్చారన్నారు. వైఎస్ వివేకా ఇంట్లో రక్తపు మడకలను తుడిచే కార్యక్రమాన్ని పెద్దలు చూసుకుంటామని హామీ ఇచ్చారని, ఎర్ర గంగిరెడ్డి…  హంతకులకు సమాచారం ఇచ్చారన్నారు. వివేక పీఏ కృష్ణారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కి సమాచారం అందించగా, వైఎస్ వివేక బావమరిది హత్య జరిగిన విషయాన్ని వైయస్ అవినాష్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేయడంతో, తనకు ఫోన్లో సమాచారం అందిన వెంటనే అవినాష్ రెడ్డి,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి అటెండర్  నవీన్ కు ఫోన్ చేసి  ఆయన ఫోన్ ద్వారా భారతి రెడ్డి తో ఆరు నిమిషాల పాటు చర్చించారన్నారు.

జమ్మలమడుగు కు వెళ్లే దారిలో ఉన్న తాను  వైయస్ వివేకా ఇంటికి చేరుకున్నానని అవినాష్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉదయం ఆరు గంటల 27 నిమిషాలకు వైఎస్ వివేకానంద రెడ్డి బావమరిది అవినాష్ రెడ్డికి ఫోన్ చేయగా, జమ్మలమడుగు కు వెళ్లే దారిలో ఉన్న అవినాష్ రెడ్డి రెండు నిమిషాల వ్యవధిలో వివేకానంద రెడ్డి ఇంటికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి ఇంటికి చేరుకున్న అవినాష్ రెడ్డి, సీఐ శంకరయ్యకు ఫోన్ చేసి ఓ నలుగురు సిబ్బందిని పంపించాలని కోరారని తెలిపారు.

ఆ తర్వాత గుండెపోటుతో  రక్తపు వాంతులు చేసుకొని  వివేకానంద రెడ్డి  మృతి చెందినట్లు అవినాష్ రెడ్డి పేర్కొనడం ముందుగా రచించిన ప్రణాళికలో ఒక భాగమని తెలిపారు. అప్పటివరకు గుండె పోటు థియరిని చెప్పిన, రక్తపు మడుగులో ఉన్న  వివేక ఫోటో బయటికి రావడంతో నర్రెడ్డి సునీత పోస్టుమార్టం చేయాలని కోరడం జరిగిందన్నారు. సాక్షిలోనూ, తమ పార్టీ నాయకులు కొంతమంది  ముందుగా వైయస్ వివేక రాసిన లేఖను ఎందుకు బయట పెట్టలేదంటూ ప్రశ్నించడం ఆస్యాస్పదంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి లలో ఒకరి ఆదేశాల మేరకు  తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి సైతం  వైయస్ వివేక  గుండెపోటుతో మరణించారని మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే నన్నారు.

వైయస్ వివేక హత్యకు నలభై కోట్ల డీల్

వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి  40 కోట్ల రూపాయల డీల్ కుదిరిందని సునీల్ యాదవ్, దస్తగిరిలతో  ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఒక్కొక్కరికి తమ వాటా కింద 5 కోట్ల రూపాయలు లభిస్తాయని, అడ్వాన్సుగా ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చారన్నారు. దస్తగిరికి ఇచ్చిన కోటి రూపాయలలో  సునీల్ యాదవ్ 25 లక్షల రూపాయలు తీసుకొని, 75 లక్షల రూపాయలు మాత్రమే  ఆయనకు ఇవ్వడం జరిగిందన్నారు. దస్తగిరి ఓ నలభై లక్షల రూపాయలను, మున్నా అనే చెప్పుల దుకాణం యజమానికి ఇవ్వగా, వాటిని ఆయన లాకర్లో భద్రంగా దాచి పెట్టారు. సిబిఐ అధికారులు తరువాత ఆ సొమ్మును రికవరీ చేయడం జరిగిందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

వైయస్ వివేకానంద రెడ్డి అంటే హత్యకు సూత్రదారులకు కోపం ఉంటే ఉండవచ్చునని, కానీ హత్య చేయడానికి  ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది ఎవరో తెలియాలన్నారు. ప్రస్తుతం 40 కోట్ల రూపాయలంటే సరే సరే అని, అప్పట్లో 40 కోట్ల రూపాయలు అంటే పెద్ద మొత్తమేనని పేర్కొన్నారు. వైయస్ వివేక హత్యను సిబిఐ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేశారని వెల్లడించారు. సీఐ శంకరయ్య 160 స్టేట్మెంట్లో  వివేకానంద రెడ్డి ఇంట్లో రక్తపు మరకలను తూడ్చారని పేర్కొన్నారని, అదే స్టేట్మెంట్ ఇవ్వమని కోరగా…  సిబిఐ అధికారులకు ఎదురు తిరిగారన్నారు.

తానే హత్య చేశానని అంగీకరించడానికి  గంగాధర్ రెడ్డి 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఒప్పందం కుదరడంతో, అంగీకరించిన ఆయన… ఆ తరువాత ఎలుక కొరికి చనిపోయారు అన్నారు. ఈ కేసులకు  మధ్యవర్తిత్వం నేర్పిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, సిబిఐ అధికారి రాంసింగ్ పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. 2017లో ఎమ్మెల్సీ టికెట్ శివశంకర్ రెడ్డికి దక్కాల్సి ఉండగా, వైయస్ వివేకానంద రెడ్డి పోటీ పడడంతో ఆయనకు ఇచ్చారు. వివేకానంద రెడ్డిని శివశంకర్ రెడ్డి ఇతరులు కలిసి ఓడించారు.

వీరిద్దరి మధ్య వైరం ఉంది. అయితే 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ షర్మిలాకు ఇవ్వాలని, జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ అవినాష్ రెడ్డికి ఇవ్వాలని వివేకానంద రెడ్డి ప్రతిపాదించారు. అయితే వైయస్ వివేకానంద రెడ్డితో న్యూసెన్స్ గా ఉందని భావించిన హత్యకు సూత్రధారులు ఆయన్ని ఎవరి అనుమతితోనైనా హత్య చేశారా?, లేక తామే హత్య చేశారా అన్నది తెలియాల్సి ఉందన్నారు.

సిబిఐ పరిశోధనలో హత్య సూత్రధారులు వీరే…

సిబిఐ పరిశీలించి, పరిశోధించగా వైఎస్ వివేకా హత్యకు సూత్రధారులు వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి లేనని  తేలిందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఇప్పటికే శివ శంకర్ రెడ్డి ని అరెస్టు చేశారని, మిగిలిన ముగ్గురిలో ముగ్గురిని ఒకేసారి అరెస్టు చేస్తారా?, లేకపోతే ఒకరిని ఇద్దరినీ అరెస్టు చేస్తారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. అరెస్టులు మాత్రం తప్పనిసరి అని పేర్కొన్నారు.

సిబిఐకి అరెస్టు చేసే ఉద్దేశమే లేకపోతే, హైకోర్టులో సునీల్ కుమార్ బెయిల్ అభ్యంతర పిటిషన్ పై ఈ విషయాలన్నీ ప్రస్తావించి ఉండేవారు కాదన్నారు. ఒకవేళ ఎవరిని అరెస్టు చేయకపోతే ప్రజలకు అనుమానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గతంలో సునీత స్టేట్మెంట్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయన్ని కలిసి అవినాష్ రెడ్డి పై అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా… అవినాష్ రెడ్డి బిజెపిలోకి వెళ్తారని, ఇప్పటికే తనపై 11 కేసులు ఉన్నాయని ఇది 12వ కేసు అవుతుందని పేర్కొనడం అనుమానాలకు తావునిస్తుందన్నారు.

తొలు త వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును అనుమానాస్పద హత్యగా నమోదు చేసి, ఆ తరువాత ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యగా నమోదు చేయడం జరిగిందన్నారు. వివేక హత్య విచారణ బాధ్యతలను టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి సిబి సిఐడి అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ అప్పగించారని,  రాష్ట్రంలో  ఎన్నికల హడావుడి నెలకొనడంతో చార్జిషీట్ దాఖలు చేయకపోవడం వల్ల  ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, మరొక వ్యక్తికి స్టాచ్యూరిటీ బెయిల్ లభించిందన్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి విచారణాధికారిని అడిషనల్ డిజి అధికారి స్థాయి, ఎస్పీ స్థాయికి తగ్గించారన్నారు. కడప ఎస్పీగా వ్యవహరించిన  అభిషేక్ మహంతి ఆయన కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేశారన్నారు. దీనితో ఆయనపై ప్రభుత్వ పెద్దలు   ఒత్తిడి తీసుకురాగా, అభిషేక్ మహంతి మరొక రాష్ట్రానికి వెళ్లిపోయారన్నారు. అభిషేక్ మహంతి స్థానంలో  ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హన్బు రాజ్  వివేక హత్య కేసులో టిడిపి నాయకుడు బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిల ప్రమేయం ఉన్నట్లుగా తప్పుడు ఆధారాలను సృష్టించే ప్రయత్నం చేయగా,  వివేకా హత్య కేసు సిబిఐ విచారణకు అప్పగించాలని కోరుతూ డాక్టర్ సునీతతో పాటు వారిద్దరూ, హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు.

ప్రతిపక్ష నేత హోదా లో సిబిఐ విచారణ కోరిన జగన్మోహన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన పిటీషన్ ను ఉపసంహరించుకొని రాష్ట్ర పోలీసులకే కేసు విచారణ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. అయితే హైకోర్టు మాత్రం, ఆ పప్పు లేని ఉడకవని చెప్పి  వివేక హత్య కేసును  సిబిఐ కి అప్పగించిందని  వివరించారు. సిబిఐ  విచారణ అధికారిని తమ వశీకరణ విద్యతో  ప్రభుత్వ పెద్దలు లోబరుచుకున్నప్పటికీ, రాంసింగ్ అనే అధికారి  విచారణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఎన్ని సమస్యలను సృష్టించిన కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు.

వివేక హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పట్టాభి అరెస్ట్

వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు  పెట్టారని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.. పట్టాభి అరెస్టు వల్ల వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మరుగున పడదని, పట్టాభి ఉదాంతమే  మరుగున పడుతుందని ఏలికలో ఉన్న పాలకులు గ్రహించాలని సూచించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు  సూత్రధారులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారు సిబిఐ కి  సహకరించడం మినహా మరొక ప్రత్యామ్నాయం  లేదన్నారు.

ఇవాళ కాకపోతే రేపైనా నోటీసులు ఇచ్చిన తర్వాత సిబిఐ విచారణకు హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు. ఒకరోజు కాకపోతే రెండు రోజులు తప్పించుకోగలరని , ఈ దశలో వారిని ఎవరు కాపాడలేరని స్పష్టం చేశారు. ఎవరెన్ని చిలిపి పనులు చేసుకున్నా ప్రయోజనం ఉండదని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు.

Related posts

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సినీ నటుడికి జరిమానా

Satyam NEWS

ఆరుగురికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

Satyam NEWS

నీళ్లెక్కడ నియామకాలెక్కడ కేసీఆరూ

Satyam NEWS

Leave a Comment