33.7 C
Hyderabad
April 28, 2024 00: 36 AM
Slider ప్రత్యేకం

మంత్రి పదవి దక్కేదెవరికి

#shabbirali

అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అధిష్టానం సీఎం పదవి కట్టబెట్టింది. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడే అసలు కథ మొదలవుతోంది. కేబినెట్ కూర్పు అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. కామారెడ్డి జిల్లాలోని మూడు స్థానాల్లో కామారెడ్డి మినహా రెండు చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేసింది.

జుక్కల్ ఎమ్మెల్యేగా ఎన్నారై లక్ష్మీ కాంతారావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మదన్ మోహన్ రావు గెలుపొందారు. అయితే ఇప్పుడు జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా కేబినెట్ లోకి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్లు వినిపిస్తుండటంతో ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది అని ఉత్కంఠ నెలకొంది

మైనారిటీ కోటాలో షబ్బీర్ ఆలీకి

మాజీ మంత్రిగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా కామారెడ్డిలో పెద్దదిక్కుగా షబ్బీర్ అలీ ఉన్నారు. నాలుగు సార్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతిలో ఓటమి పాలైనా పార్టీని వీడాలన్న ఆలోచన షబ్బీర్ అలీ చేయలేదు. కష్టమొచ్చినా, కన్నీళ్లొచ్చినా కార్యకర్తలకు షబ్బీర్ అలీ అండగా నిలిచారు. తన ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీతో అభ్యర్థిని మార్చలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు కాదనకుండా తన సీటును త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్ కు పయనమయ్యారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసినా అభ్యంతరం చెప్పకుండా తనపని తాను చేసుకుంటూ పోయారు. దాంతో మైనార్టీ కోటాలో షబ్బీర్ ఆలీకి మంత్రి పదవి వస్తుందని, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించి మైనారిటీ శాఖ అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది.

ఐటీ మంత్రి రేసులో మదన్ మోహన్ రావు

ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావుకు కేబీనెట్ లో చోటు దక్కుతుందని రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఎంపీగా ఓటమి పాలైన మదన్ మోహన్ రావు తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రశంసలు పొందారు. అమెరికాలో అనేక కంపనిలు స్థాపించి కామారెడ్డి జిల్లాలో యువతకు ఉపాధి కల్పించేందుకు మదన్ మోహన్ రావు ప్రత్యేక జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించారు.

ఐటి రంగంలో మదన్ మోహన్ రావుకు అత్యంత అనుభవం ఉన్న వ్యక్తిగా పేరుంది. ఇదే ఆయనకు మంత్రిగా అవకాశం కల్పిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో మదన్ మోహన్ రావుకు దగ్గర సాన్నిహిత్యం కూడా మంత్రి పదవి రావడానికి సహకరిస్తుందని అనుకుంటున్నారు. రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు తేవడానికి మదన్ మోహన్ రావు ప్రత్యేక కృషి చేస్తారన్న ప్రచారం సాగుతోంది. మంత్రివర్గ కూర్పులో మదన్ మోహన్ రావుకు స్థానం దక్కుతుందని భావిస్తున్నారు

ఇద్దరికి మంత్రి పదవి వస్తుందా

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఇప్పుడు ఇద్దరు నేతలు ముఖ్యమైన వాళ్ళుగా ఉన్నారు. సీనియర్ నాయకునిగా షబ్బీర్ అలీ, రాహుల్ గాంధీకి సన్నిహిత వ్యక్తిగా మదన్ మోహన్ రావు కొనసాగుతున్నారు. పార్టీకి నమ్మిన బంటుగా షబ్బీర్ అలీ వ్యవహరిస్తూ మొదటినుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చినా అటువైపు వెళ్లలేదన్న ప్రచారం సాగింది. మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడిగా మదన్ మోహన్ రావు బీఆర్ఎస్ వ్యక్తిగా దుష్ప్రచారం సాగినా ఆయన బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ లోనే కొనసాగుతూ ఎమ్మెల్యేగా గెలిచి చూపించారు.

దాంతో ఇద్దరు పార్టీకి రెండు కళ్లుగా ఉన్నారు. దాంతో ఇప్పుడు ఇద్దరిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్న ఆందోళన పార్టీలో మొదలైంది. ఇద్దరికి గతంలో పడక ఎడమోహం పెడమోహంగా ఉన్నారన్న ప్రచారం సాగింది. ఒకానొక సందర్భంలో మదన్ మోహన్ రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది. దాంతో ఇప్పుడు ఇద్దరు కేబినెట్ రేసులో ఉండటంతో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

రెండురోజుల్లో స్పష్టత

సీఎం అభ్యర్థిని ఈరోజే పార్టీ నిర్ణయించడంతో మనత్రివర్గ కూర్పు రెండురోజుల్లో చేపడతారని తెలుస్తోంది. ఈనెల 7 న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి బెర్త్ కూడా కన్ఫర్మ్ అయిందన్న ప్రచారం సాగుతోంది. దాంతో డిప్యూటీ సీఎంగా మరొక వ్యక్తికి అవకాశం ఇస్తారా.. లేక ఒకరికే అవకాశం కల్పిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది అనేది ప్రమాణ స్వీకారం తర్వాతే తేలనున్నట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా కొనసాగుతోంది.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘సలార్’

Satyam NEWS

మళ్లీ కోర్టులపై వ్యాఖ్యలు….: దేనికి సంకేతం?

Satyam NEWS

లిజన్ కేర్ ఫుల్లీ: సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment