28.2 C
Hyderabad
January 21, 2022 17: 28 PM
Slider సంపాదకీయం

ఈ మంత్రులు ఉన్నది ఎందుకు?

#ramgopalvarma

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించినా ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకులుగా ముద్ర వేయడం వైసీపీ నాయకులకు అలవాటైపోయింది. తాము చేసిన పనికి హేతుబద్ధత లేనప్పుడే ఎవరైనా సరే వైలెంట్ గా రియాక్ట్ అవుతారు.

లేదా తమ వాదనలో పస లేదని తేలినప్పుడే బూతులకు దిగుతారు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించినా వైసీపీ నేతలు దారుణమైన ప్రతి విమర్శలు చేయడమో లేదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బూతులు తిట్టడమో చేస్తుంటారు.

ఇది ఒక సారి కాదు….. ఇప్పటికి కొన్ని వందల సంఘటనల్లో రుజువైంది. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేక తీర్పులు రాగానే జడ్జిలను కూడా వదలకుండా వ్యాఖ్యానించారు. ‘‘కరోనా వచ్చి చచ్చిపోవాలి’’ అంటూ శాపనార్ధాలు పెట్టారు.

వైసీపీ సోషల్ మీడియా టీమ్ ఏ పని చేసినా, అలా చేసిన పనుల వల్ల ఎవరికి ఇబ్బంది ఎదురైనా తాము అండగా నిలుస్తామని కూడా వైసీపీ నేతలు బాహాటంగానే చెబుతుంటారు. మిగిలిన విషయాల జోలికి వెళ్లకుండా ఒక్క సినిమా టిక్కెట్ల వ్యవహారం చూసుకున్నా కూడా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దారుణమైన వ్యాఖ్యలు సామాన్యమైనవి కాదు.

పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల ధరలపై వ్యాఖ్యానాలు చేసినప్పుడు అత్యంత దారుణంగా ఆయనను పోసాని కృష్ణ మురళి అనే సినిమా నటుడితో తిట్టించారు. అదే విధంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలపై అత్యంత దారుణమైన పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

సోషల్ మీడియానా? యాంటీ సోషల్ మీడియానా?

శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల సందర్భంగా హీరో నాని టిక్కెట్ ధరలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దానిపై నానిని వైసీపీ సోషల్ మీడియా (అధికారికంగా దీన్ని వైసీపీ అంగీకరించదు. ఏదైనా వివాదం వస్తే సదరు వ్యక్తితో తమకు సంబంధం లేదు అని ప్రకటిస్తారు….. కానీ ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేసే ఈ సోషల్ మీడియా ఎకౌంట్లు అన్నింటికి జగన్ ఫొటో నే ఉంటుంది.) దారుణమైన వ్యాఖ్యలు చేసింది.

హీరో నాని కి పవన్ కల్యాణ్ కు లింకు పెట్టి నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడ వినాల్సి, చూడాల్సి వస్తుందోనని చాలా మంది పరువుగల వారు బహిరంగంగా వైసీపీ విధానాలను విమర్శించేందుకు భయపడుతున్నారు. జడ్జిలనే వదలని వారితో మనకెందుకులే అని ఊరుకుంటున్నారు.

నిన్న మొన్నటి వరకూ చంద్రబాబునాయుడిని వ్యక్తిగతంగా విమర్శించే రామ్ గోపాల్ వర్మ, సినిమా టిక్కెట్లపై వ్యాఖ్యలు చేసే సరికి మంత్రి స్థాయి వ్యక్తులు ఆయనను టార్గెట్ చేశారు. చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారుడని సినిమా తీసినప్పుడు లేదా ఆయనపై ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ పైనా దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఇదే రామ్ గోపాల్ వర్మను వైసీపీ నాయకులు ఎంతో ప్రేమతో చూసుకున్నారు.

సినిమా టిక్కెట్ల ధరలను ప్రభుత్వం అదుపు చేసే ప్రక్రియను ప్రశ్నించగానే రామ్ గోపాల్ వర్మపై నీచమైన కామెంట్లు పెడుతున్నారు. సంబంధిత మంత్రి పేర్ని నాని అయితే పాలన మానేసి మరీ రామ్ గోపాల్ వర్మకు సమాధానాలు ఇవ్వడంలో నిమగ్నమైపోయారు.

హీరో నాని పై అరడజను మంది మంత్రులు మూకుమ్మడి దాడి చేసిన విషయం మరచిపోకముందే రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ జరుగుతుండటంతో అసలు ఈ మంత్రులు ఉన్నది ఎందుకు అనే ప్రశ్న తలెత్తకమానదు.  

Related posts

పేదవాడిని చూడకుండా పెద్దవాడికి సాయం చేస్తున్న నిర్మలమ్మ

Satyam NEWS

అరసవెల్లిలో వైభవంగా ఉత్తరద్వార దర్శనం

Satyam NEWS

జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!