అధికారం చేపట్టి ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నా అపనిందలు వేస్తున్నారని, ఏ తప్పూ చేయకపోయినా ప్రజలను మభ్య పెట్టేందుకు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బ్యాక్‌వర్డ్ క్లాసులను బ్యాక్‌బోన్ క్లాసులుగా మార్చాలనుకున్నానని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ముందడుగు వేయించే దిశగా పలు చర్యలు చేపట్టానని తెలిపారు.
అయితే అది తప్పు అన్నట్లు తనను విమర్శిస్తున్నారన్న సీఎం, ఎవరు ఎన్ని అపనిందలు వేసినా తట్టుకోగలనని, అందరి చల్లని దీవెనలతో ఇంకా మేలు చేస్తానని స్పష్టం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, ‘వైయస్సార్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రారంభించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కొమానపల్లిలో ‘వైయస్సార్ మత్స్యకార భరోసా’ను ప్రభుత్వం ప్రారంభించింది.
ప్రజా సంకల్పయాత్రలో 2018లో ముమ్మిడివరంలో పర్యటించినప్పుడు మత్స్యకారుల కష్టాలు స్వయంగా చూశానని, వారి బాధలు విన్నప్పుడు గుండె తరుక్కుపోయిందని చెప్పారు. 16 వేలకు పైగా మత్స్యకారులు తమ హక్కు కోసం దాదాపు 6 ఏళ్లుగా ఆందోళన చేసినా, అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే ఆరోజు చెప్పానని.. ‘నేను విన్నాను. నేను ఉన్నాను’ అని ఒక అన్నలా, తమ్ముడిలా మాట ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో 974 కి.మీ తీర ప్రాంతం ఉన్నా, బతుకుతెరువు కోసం వలసలు పోతున్న వారిని చూశాను.
అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి గంగపుత్రుల జీవితాలు మార్చే నిర్ణయాలు ప్రకటిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లీటరు డీజిల్‌పై రూ.6.03గా ఉన్న సబ్సిడీని రూ.9 చేస్తున్నామని, అంతే కాకుండా 81 బంకుల యజమానులకు ఆ సబ్సిడీ మొత్తం వెంటనే అందేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రతి మత్స్యకారుడికి ఐడీ కార్డు ఇచ్చామన, స్మార్ట్ కార్డుల ద్వారా ఆ సబ్సిడీని అమలు చేస్తున్నామని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తిరిగి వచ్చే వరకు ఆ కుటుంబాల్లో అంతులేని ఆవేదన ఉంటుందని, అందుకే ఎక్కడైనా పొరపాటున వారికి ఏమైనా జరిగితే, ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబోతున్నామని ప్రకటించారు. కచ్చులూరు వద్ద గోదావరి నుంచి బోటు వెలికి తీసిన ధర్మాడి సత్యంను కార్యక్రమంలో సీఎం జగన్ సత్కరించారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, పిన్నింటి విశ్వరూప్, ఎంపీలు చింతా అనురాధ, వంగా గీతతో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులతో పాటు, పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.