29.7 C
Hyderabad
May 3, 2024 03: 19 AM
Slider చిత్తూరు

రోత పుట్టిస్తున్న నగరి రాజకీయాలు

#roja

మంత్రి అర్ కె రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం రాజకీయాలు రోత పుట్టిస్తున్నాయి. టిడిపి, వైసిపి నేతలు ఒకరిపై ఒకరు  వ్యక్తి గత దూషణలకు పాల్పడుతున్నారు. దాడులు, ర్యాలీలు, విమర్శలు ప్రతి విమర్శలతో వార్తలకు ఎక్కుతున్నారు. ఇటీవల టిడిపి మాజీ మంత్రి బండారు సత్య నారాయణ రోజా నీలి చిత్రాల్లో నటించిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు ప్రతి విమర్శలు మార్మోగాయి. రోజాకు పార్టీ నుంచి మద్దతు లేక పోయినా సినీ తారలు కుష్బూ, నవనీత్ కౌర్, రమ్య కృష్ణ, మీనా తదితరులు అండగా నిలబడ్డారు.

తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులు దుమ్మెత్తి పోశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, గాలి భాను ప్రకాష్, జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ రోజాపై విరుచుకు పడ్డారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నగరి వెళ్లిన భాను ప్రకాష్ కారుపై వైసిపి నేతలు దాడిచేశారు. శనివారం వైసిపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి చీ చీ తెలుగు దేశం ఆపండి మీ దొంగ నాటకం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రోజా సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ భాను ప్రకాష్ తన తండ్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణానికి కారణమని ఆరోపించారు. అలాగే తల్లికి కూడా ద్రోహం చేశారని చెప్పారు.

రోజాకు పార్టీ పోరు… భానుకు ఇంటి పోరు

దీనితో  వీరిద్దరి రాజకీయ భవిష్యత్తుపై  ఆసక్తికర చర్చ సాగుతున్నది. వచ్చే ఎన్నికల్లో ఇద్దరికీ టిక్కెట్లు రాక పోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. రోజాకు పార్టీ పోరు, భానుకు ఇంటి పోరు వల్ల నష్టం తప్పదని అంటున్నారు. రోజాకు ఈ సారి టిక్కెట్టు ఇస్తే ఓడించేందుకు మాజీ మున్సిపల్ చైర్ పర్షన్ కె జె శాంతి, ఆమె భర్త కె జె కుమార్, శ్రీ శైలం దేవస్థానం పాలక మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి సిద్ధమవుతున్నారని  వార్తలు వస్తున్నాయి. తమలో ఒకరికి టిక్కెట్టు ఇమ్మని వారు పట్టు బట్టే అవకాశం ఉంది. అలాగే భాను ప్రకాష్ కు టిక్కెట్టు ఇస్తే ఓడిస్తామని అతని తమ్ముడు జగదీష్, తల్లి సరస్వతి బహిరంగంగా చెపుతున్నారు. జగదీష్ కూడా టిక్కెట్టు రేసులో ఉన్నారు.

అయితే ఇక్కడ రాజు లేదా రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థికి టిక్కెట్టు ఇస్తే మంచిదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సిద్దార్థ విద్యా సంస్థల అధిపతి అశోక రాజు పేరు తెరపైకి వస్తోంది. మాజీ మంత్రి రెడ్డివారి చెంగా రెడ్డి కూతురు ఇందిరా ప్రియదర్శిని అయినా బాగుంటుందని అంటున్నారు. కాగా ఎన్ బి సుధాకర్ రెడ్డి తనకు లేదా తన కుమారు హర్ష వర్ధన్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబును కోరారు.

ముద్దు’ మరణంపై అభాండాలు వద్దు: ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరిక

మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణంపై అభాండాలు వేయడం మంత్రి రోజాకు తగదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. రోజా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పలేక టిడిపి నేతలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం నగరి టిడిపి ఇంచార్జి గాలి భాను ప్రకాష్ కారుపై వైసిపి రౌడీలు దాడి చేశారని ఆరోపించారు. శనివారం వైసిపి కార్యకర్తలు నగరిలో ర్యాలీ పెట్టి టిడిపిని విమర్శించడం అన్యాయం అన్నారు. అలాగే రోజా అన్న రాంప్రసాద్ రెడ్డి ముద్దుకృష్ణమ నాయుడు మరణానికి ఆయన కుమారుడు భాను కారణం అంటూ తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరం అన్నారు. ఇదంతా రోజా వెనక ఉండి ఆడించే నాటకం అన్నారు. ముద్దు కృష్ణమ నాయుడు 2018 లో డెంగ్యూ జ్వరం వల్ల చనిపోయిన విషయం లోకానికి తెలుసు అన్నారు. అయితే రోజా ఓటమి భయంతో భాను ప్రకాష్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆమెకు స్వంత పార్టీలో వ్యతిరేకులు ఉన్నారని, మద్దతు తెలిపే నాధుడు లేరని చెప్పారు. ఈ నేపథ్యంలో రోజాకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు

Related posts

Chargesheet: కొందరి కోసమే పని చేస్తున్న మోదీ

Satyam NEWS

నిజాం తరహా కేసీఆర్ పాలనను తరిమి కొట్టాలి

Satyam NEWS

రికవరీ చేసిన 564 ఫోన్లు తిరిగి అందచేసిన కర్నూలు ఎస్పీ

Satyam NEWS

Leave a Comment