కొల్లాపూర్ పట్టణం అభివృద్ధి జరగాలంటే కొత్త రాజకీయం రావాలని ఔట చైతన్య పిలుపునిచ్చారు. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలలో 11వ వార్డు నుంచి నేడు ఆమె నామినేషన్ వేశారు. ఎస్సి రిజర్వుడు వార్డు అయిన 11 వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ఆమె రంగంలో నిలిచారు.
2012 లో ఏర్పడ్డ కొల్లాపూర్ మున్సిపాలిటీ లో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవేనని ఆమె తెలిపారు. కొల్లాపూర్ మునిసిపాలిటీ తొలి ఎన్నికలలో మంచి అభ్యర్ధులను ఎన్నుకోవాలని చైతన్య ఓటర్లను కోరారు. తన భర్త ఔట రాజశేఖర్ జర్నలిస్టుగా సేవలు అందిస్తున్నారని, అవినీతి అక్రమాలపై నిరంతరంగా పోరాటం చేస్తున్నారని చైతన్య అన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ అవకాశం వల్లే 11 వార్డు ఎస్సీ రిజర్వుడు అయిందని, అదే చైతన్యంతో తాను పోటీ చేస్తున్నానని ఆమె అన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని కాకుండా నీతి నిజాయితీల వైపు ఉండే తన లాంటి వారిని కొల్లాపూర్ ప్రజలు ఎన్నుకోవాలని చైతన్య కోరారు.