‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్జాలాన్ని ఉపయోగించుకునే హక్కు కూడా ఉంది, 370 అధికరణ రద్దు అనంతరం ఇంటర్నెట్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయలేం ,ఇటీవల కాలంలో భావ ప్రకటనకు అదొక సాధనంగా మారింది’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 370 అధికరణం రద్దు తర్వాత జమ్మూ- కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లను జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది.కశ్మీర్‌లో ఆంక్షలకు సంబంధించిన అన్ని ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని న్యాయస్థానం పేర్కొంది. తాము ఇచ్చే ఆదేశాలపై వచ్చే రాజకీయ ఉద్దేశాలను పట్టించుకోమని న్యాయస్థానం తెలిపింది. జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు ప్రతులను చదివారు.
‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్జాలాన్ని ఉపయోగించుకునే హక్కు కూడా ఉంది. కశ్మీర్ చాలా హింసను ఎదుర్కొంది. మానవ హక్కులు, భద్రతా సమస్యలను సమతుల్యం చేయడం మాపని. జమ్ముకశ్మీర్‌లో విధించిన అన్ని ఆంక్షలపై వారంలోగా సమీక్షించాలి. ఇంటర్నెట్ సేవలను శాశ్వతంగా నిలిపివేయడానికి అనుమతించబోము. ఇంటర్నెట్ సేవలను పరిమితం చేయడం లేదా నిలిపివేయడం న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి. 144 సెక్షన్‌ను ఎక్కువగా విధించడం అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లేనని కోర్టు వ్యాఖ్యానించింది.