సికింద్రాబాద్‌లోని చిలకలగూడ వారాసిగూడలో 17 ఏళ్ల బాలిక ఇర్ఫానా హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసు వివరాలను ఉత్తర మండల డీసీపీ మీడియాకు వెల్లడించారు. తనతో పెళ్లికి నిరాకరించడంతో బాలిక స్నేహితుడు షోయబ్ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించామని డీసీపీ తెలిపారు.
నిందితుడు షోయబ్ ఫ్లెక్సీబోర్డు డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో పెళ్లి చేసుకుంటానని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పాడని, మైనర్ కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. అప్పటి నుంచి షోయబ్‌ను బాలిక పట్టించుకోవడం మానేసింది. దీంతో ఇర్ఫానా తనకు దక్కదేమోననే అనుమానంతో నిందితుడు షోయబ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని డీసీపీ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం గురువారం అర్ధరాత్రి బాలిక ఇంటికి షోయబ్ వచ్చాడు. ఇద్దరూ కలిసి బాలిక ఇంటిపైకి వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి బాలిక తలపై రాయితో కొట్టాడు. తర్వాత బాలికను ఈడ్చుకుంటూ వెళ్లి భవనం పైనుంచి తోసేశాడు. షోయబ్‌ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నాం. తనకు దక్కలేదనే కోపంతో బాలికను హత్య చేశాడు అని డీసీపీ చెప్పారు.