27.7 C
Hyderabad
April 30, 2024 10: 32 AM
Slider సంపాదకీయం

కాపు జాతిని తమవైపు తిప్పుకునే ఎత్తుగడ: టీటీడీకి ముద్రగడ

#MudragadaPadmanabham

తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ గా ప్రముఖ కాపు జాతి నాయకుడుగా ఇప్పటి వరకూ నిలిచిన ముద్రగడ పద్మనాభం ను నియమించేందుకు వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. టీటీడీ బోర్డు చైర్మన్ గా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రెడ్డి సొంత బాబాయి వై వి సుబ్బారెడ్డి ప్రస్తుతం ఉన్నారు. టీటీడీ చైర్మన్ పదవి అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈ పదవిని నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డికి కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ గతంలో హామీ ఇచ్చారు. అయితే ఆయనను ఏ కారణం వల్లనో నియమించలేదు.

ఇప్పుడు సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తి అవుతుండటంతో మళ్లీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు ముందుకు వచ్చినా కూడా వైసీపీ పెద్దలు ఆ దిశగా ఆలోచించడం లేదని తెలిసింది. తాజా రాజకీయ పరిణామాలలో కాపు కులస్తులను దగ్గరకు తీసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఎంతో ఉంది. పవన్ కల్యాణ్ దూసుకువెళుతున్న తీరు ఒక వైపు కంగారు పెట్టిస్తుండగా మరో వైపు ఆయన తెలుగుదేశం పార్టీతో కలిస్తే ఎలా అన్న ఆందోళన వైసీపీని వెన్నాడుతున్నది.

ఈ నేపథ్యంలో కాపు కులస్తులు అందరూ మూకుమ్మడిగా పవన్ కల్యాణ్, చంద్రబాబు వైవు వెళ్లిపోతే వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం. మొత్తం కాపు జాతి వెళ్లకపోయినా సగం మంది వేరే విధంగా నిర్ణయం తీసుకున్నా వైసీపీకి తీరని నష్టం కలుగుతుంది. ఈ నేపథ్యంలో కాపు జాతిని కట్టిపడేసేందుకు వ్యూహాలు రచిస్తున్న వైసీపీ తాజాగా ముద్రగడ పద్మనాభం పేరును పైకి తీసుకువచ్చింది. ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి చంద్రబాబునాయుడికి బద్ధ వ్యతిరేకి. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంత కాలం కాపులకు మేలు జరగడం లేదని ముద్రగడ పద్మనాభం ఎన్నో ఉద్యమాలు చేసేవారు. కాపు జాతిని చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని ప్రచారం చేయడంలో ముద్రగడ పద్మనాభం ఎత్తులు బాగా పని చేశాయి.

చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్ ను కల్పించినా, కాపు కార్పొరేషన్ తో కాపు కులస్తులను ఆదుకున్నా కూడా ముద్రగడ పద్మనాభం ఏనాడూ చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడలేదు. ముఖ్యమంత్రిగా జగన్ వచ్చిన తర్వాత, రాకముందు కూడా కాపులకు రిజర్వేషన్ కల్పించే అవకాశమేలేదని చెప్పినా కూడా ముద్రగడ పద్మనాభం ఏం మాట్లాడలేదు. కాపు జాతికి ఎంతో అన్యాయం జరుగుతున్నా కూడా ముద్రగడ పద్మనాభం ఎక్కడా విమర్శించిన దాఖలాలు లేవు. కాపు జాతికి నాయకుడైన ముద్రగడ పద్మనాభం చేసే ప్రతి చర్య, తీసుకునే ప్రతి నిర్ణయం తమకు మేలు చేస్తున్నందున ఆయనను సముచిత రీతిలో సత్కరించాలని వైసీపీ భావిస్తున్నది. ఈ మేరకు త్వరలో ఖాళీ కాబోతున్న టీటీడీ చైర్మన్ పదవిని ముద్రగడ పద్మనాభానికి ధారాదత్తం చేస్తే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కాపు జాతి మొత్తం తమకు అండగా నిలుస్తుందని వై సీపీ భావిస్తున్నది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ ఆ రెండు ఉమ్మడి జిల్లాల్లో అత్యంత బలహీనంగా ఉంది. కాపు కులస్తులు అందరూ కూడా పవన్ కల్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ దశలో ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తిని తమకు అనుకూలంగా మలచుకుంటే రాజకీయంగా లాభం జరుగుతుందని వైసీపీ ఎత్తుగడ వేస్తున్నది. ముద్రగడ పద్మనాభం కూడా టీటీడీ చైర్మన్ పదవిని ఆశ చూపితే కాదనే పరిస్థితి ఉండదు.

Related posts

రిపోర్టర్ సురేష్‌ను ప‌రామ‌ర్శించిన జడ్పీ చైర్మన్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు

Satyam NEWS

ఉత్సాహంగా సీఎం సభకు వెళ్లిన ఉప్పల్ గులాబీ శ్రేణులు

Satyam NEWS

మానవ హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు గా కట్టా సంపత్ కుమార్

Satyam NEWS

Leave a Comment