27.7 C
Hyderabad
April 30, 2024 07: 13 AM
Slider ప్రత్యేకం

హ్యాపీ పొంగల్: కొత్త దిశలో దినకరుడి దివ్యయాత్ర

suryudu fresh

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

సంక్రాంతి హిందువుల పండుగలన్నింట్లోకి పెద్ద పండుగ. దినకరుడి దివ్యయాత్రకు సంబంధించిన పర్వదినం. సూర్యుడు ఆరు మాసాలు దక్షిణాభిముఖంగానూ,  ఆరు మాసాలు ఉత్తరాభిముఖంగానూ సంచరిస్తాడు. వాటినే దక్షిణాయనం, ఉత్తరాయణం అని అంటారు. సూర్యుడు  ఒక సంవత్సరంలోని పన్నెండు  మాసాలలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క మాసముంటాడు.

ఒక రాశి నుంచి  మరొక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించే సమయాన్ని  సంక్రాంతి లేదా  సంక్రమణం అంటారు. వృశ్చిక రాశి  నుండి మకర రాశిలోకి ప్రవేశాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి ఆంగ్లమాసం ప్రకారం  జనవరి  14వ తేదీన గానీ 15వ తేదీన గానీ వస్తుంది. విష్ణువు భక్తుడైన ధ్రువుడికి శింశుమార చక్రాధిపత్యం ఇచ్చినప్పటి నుంచి ఆ దిక్కు దివ్యకాంతితో వెలుగుతుంటుంది.

ఆ దిక్కుకు ధ్రువమూలమని, ధ్రువతార అనే పేరుతో ధ్రువుని నక్షత్ర రూపి అని చాలా విధాలుగా వర్ణన వాడుకలో ఉంది. సూర్యుడు ఉత్తరాయణ సఁచారంలో ధ్రువతారకు సూటిగా పోతుండటం వల్ల పరమభక్తుడైన ధ్రువుని సమీపించి తరలిపోయే కాలం పుణ్యకాలమని, అన్ని విధాల శుభకార్యాలకు, ఉత్తరాయణం ఉత్తమోత్తమమైనదని శాస్త్రాలలో చెప్పారు.

సూర్యుడు యమలోకానికి సూటిగా దక్షిణ ధ్రువంవైపు సంచరించే దక్షిణాయనం శుభకార్యాలకు తగిన యుక్త కాలం కాదని చెప్తారు. హేమంత రుతువైన మార్గశిర పుష్య మాసంలో శీతలం ఎక్కువై చలి బాధతో పీడింపబడే మానవలోకానికి సూర్యప్రకాశం కొంత ఊరట కల్గిస్తుంది. కొన్ని పురాణ గాథలలోను, పరంపరానుగత కథలలోను, దక్షిణాయన ప్రారంభం నుండి, ఉత్తరాయణారంభంవరకు స్వర్గలోక కవాటాలు మూయబడి ఉంటాయని నమ్మకం.

రవి మకరరాశిలో ప్రవేశిస్తే స్వర్గ ద్వారాలు తీయబడతాయని, కనుక దేవతాదర్శన సుదినం అప్పటి నుండి ఆరంభమవుతుందని అటువంటి ఉత్తరాయణ కాలం చాల ఉత్కృష్టమైనదని భారతీయుల గట్టి నమ్మకం. అందులో కర్కట మకర సంక్రమణాలు యమపుణ్యకాలమని, వీటిలో ముఖ్యంగా దక్షిణోత్తరాయణంలో కర్మములు ఆచరించడం విధికృతమని మను స్మృతి పురాణాలలో చెప్పబడింది.

భారత దేశంలో మనం  జరుపుకునే  పండులన్నీ ఏదో ఒక తిథి ప్రాతిపదికగా వచ్చేవే. ఉదాహరణకు,  వినాయకచవితి,  కృష్ణాష్టమి,  మహర్నవమి, విజయదశమి, దీపావళి  అమావాస్య మొదలైనవి. కాని  సంక్రాంతి  తిథి ప్రాతిపదికగా జరుపుకోని పండుగ. అన్ని  పండుగలు చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేవైతే సంక్రాంతి  మాత్రం సూర్య గమనాన్ని  అనుసరించి వస్తుంది. మార్గశిర, పుష్యమాసాలో వస్తుందీ పండుగ.

ఇది  ముచ్చటయిన  మూడు  రోజుల పండుగ. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండుగ సందడి ఒక నెల ముందే ప్రారంభమవుతుంది.  ధనుర్మాసంలో  గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలతో దేవాయాలు మార్మోగుతాయి. మహిళలు వాకిళ్ళలో సంక్రాంతి ముగ్గులు పెడతారు. గుమ్మాలకు మామిడితోరణాలతోపాటు బంతిపూలతోరణాలు కడతారు. కన్నెపిల్లలు ఆవుపేడతో గొబ్బెమ్మలను చేసి పసుపు, కుంకుమలు పెట్టి బంతి, చేమంతి, గుమ్మడి, పొట్ల, బీరపూలతో అలంకరిస్తారు.

పటికబెల్లమో ఖర్జూరమో ఎండు ద్రాక్షో నైవేద్యం పెట్టి పాటలు పాడి హారతులిచ్చి వాటిని  ముగ్గుల్లో  అమరుస్తారు. కొందరిళ్ళల్లో సందె గొబ్బెమ్ము పెట్టి వేడుక చేస్తారు. పెద్ద సైజులో తల్లి  ` చిన్నవిగా పిల్ల  గొబ్బిళ్లను చేసి వాటికి అలంకారం చేసి పీట మీద పెట్టి  ఇరుగుపొరుగు పిల్లలంతా దాని  చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతూ చప్పట్లు చరుస్తూ గొబ్బిళ్ళో  గొబ్బిళ్ళో’ అంటూ పాడుతూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది.

ఈ పండుగలో మొదటి రోజు వచ్చేది భోగీ.  భోగీనాడు త్లెవారుజామున  అందరూ లేచి ఇంటి ముందు  చెత్తాచెదారం పోగేసి భోగీ మంటలు వేస్తారు.  తర్వాత తలంట్లు, కొత్తబట్టలు, పిండివంటలు, ఇరుగుపొరుగు,  బంధుమిత్రులు అంతా  కలుసుకోవడం, ఇచ్చుపుచ్చుకోవడాలు,  శుభాకాంక్షులు చెప్పుకోవడం పరిపాటి. భోగీనాడే శ్రీరంగనాథుడు  గోదాదేవిని  వివాహం  చేసుకుని  భోగభాగ్యాలను  ప్రసాదించిన రోజు కనుకనే  భోగి అయిందని పురాణ కథనం.

ఈ రోజునే వామనుడు  బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినట్లు,  శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని  ఎత్తి గోవులను, గోపాలకులను ఇంద్రుని రాళ్ళ వాన నుండి కాపాడినట్లు కథనం. భోగీనాటి సాయంత్రం  చిన్న పిల్లలకు భోగీపళ్ళు పోస్తారు. చెరకు  ముక్కు,  రేగుపళ్ళు, సెనగలు, చిల్లరనాణాలు, పూరేకులు  వీటన్నింటిని కలిపి పిడికిడంత తీసి పిల్లల తల చుట్టూ తిప్పుతూ వారి తలల మీద  పోస్తారు.  ఇదంతా దిష్టి పరిహారం కోసమే.

`రెండవ రోజున సంక్రాంతి. దేవాయాల్లో ప్రభాత సేవ, మంగళవాయిద్య ఘోష, దధ్యోజనం, చక్కెర పొంగలి, పులిహోర మొదలైనవి ధనుర్మాసారంభం  నుండి మొదలవుతాయి. సంక్రాంతి శోభ ముగ్గులతో  ప్రారంభమవుతుంది. ముగ్గు పెట్టే  సమయానికి హరిదాసు  నొసట నామం, మెళ్ళో పూదండ, కాళ్ళకు గజ్జెలు, ఒక చేత్తో చిడతలు, మరో చేత్తో తంబురా, బొట్లు  పెట్టి  బంతిపూలు చుట్టిన రాగిపాత్ర తలపైన  పెట్టుకుని భుజాన సంచీ, ధోవతి కట్టు, నడుమున  ఉత్తరీయం  బిగించి ‘‘హరిలో రంగ హరి’’  అంటూ భజనలు పాడుతూ, చిందులేస్తూ వస్తారు.

బియ్యం  పెట్టేందుకు వచ్చిన వారి ఎదుట అలవోకగా  వంగి ‘‘కృష్ణార్పణం’’ అంటూ కదలివెళ్ళడం…ఒకవైపైతే డూడూడూడూ బసవన్నా…డూ….ఎంకన్నా…అంటూ సన్నాయి  నొక్కులు  నొక్కుతూ, డోలు గీకుతూ  గంగిరెద్దు వాడు సందడి చేస్తాడు. ఇంకోపక్క అంబ పలుకు  జగదంబపలుకు  అంటూ  డమరుకం వాయిస్తూ అంబా  పలుకు  …పుణ్యకాలమొచ్చిందని  బుడబుక్కలవాడు రావడం….ఇలా  సంక్రాంతి  నాడు ఎంత  సందడో.

`  ఆబాలగోపాలానికి ఎంత సంబరమో….  తెలుగునాట ఈ పండుగకు కొందరు  బొమ్మలకొలువు పెడతారు. సంక్రాంతి  పండక్కి పల్లెల్లో  కోడి పందాలు, ఎడ్ల బండ్ల పందాలు, గొఱ్ఱె పోతు పందాలు కూడా ఉంటాయి. మూడవరోజు కనుమ  పండుగ. ఇది  కర్షకుల పండుగ. ఆనాడు రైతు పశువులకు స్నానం చేయించి అలంకారం చేసి  పండిన పంటతో  పులగం  వండి పంచభూతాలకు నైవేద్యం పెట్టి, పొలాల్లోకి పోయి అన్నం మెతుకుసు  చేనంతా చల్లుతారు.

దాన్నే పొరి చల్లడం  అంటారు. పశువును చేరువలో ఉన్న దేవాలయానికి  తోలుకెళ్ళి  ప్రదక్షిణం చేయించి తీసుకుని వస్తారు. కనుమ పండుగ నాడు  అందరూ, మినుములు తినాలంటారు.  అందువల్ల గారెలను వండుకుని  తింటారు. కనుమనాడు కాకి అయినా ప్రయాణం చెయ్యదని  ఊరు విడిచి ఎవరూ వెళ్ళరాదని కట్టడి. కనుమ మర్నాడు  ముక్కనుమ. ఆనాటి నుండి సావిత్రి గౌరీదేవి వ్రతం ప్రారంభమవుతుంది.  తొమ్మిదిరోజులు జరిపి  తర్వాత నిమజ్జనోత్సవం చేస్తారు.

క్లుప్తంగా చెప్పాలంటే, సంక్రాంతి పండుగను భారతదేశమంతటా కాశ్మీరు మొదలుకుని కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల ప్రజలు జరుపుకుంటారు.  తమిళనాడులో ఈ పండుగను పొంగల్‌ అంటారు. సూర్యరశ్మి పడేటట్టు పొయ్యి పెట్టి  కొత్త గిన్నెలో కొత్త బియ్యం, పాలు, చక్కెర,  పెసరపప్పుతో  పొంగలి  చేసి సూర్యనారాయణస్వామికి  నైవేద్యం పెడతారు. రథసప్తమిలాగే ఈ పండుగ సూర్యారాథనకు ప్రాశస్త్యమిచ్చే పర్వదినం.

ఉత్తరాయణ పుణ్యకాం ప్రవేశించేది  మకరసంక్రమణంనాడే.  ఈ పర్వదినాన దానాలు, పుణ్యస్నానాలు, పుణ్యకార్యాలు ఆచరిస్తారు. శుభకార్యాలకు ఈ  నాటి నుండి నాందీ పలుకుతారు. పైర్లు ఇంటికి వచ్చే వేళ. అందరికీ సమృద్ధిగా ధనధాన్యాలు చేతికి అందే వేళ. ఈ విధంగా పౌష్యలక్ష్మికో దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ఇది పుణ్యఫలాలను ప్రసాదించే పుణ్యమాసం.

ఇంటి ముంగిళ్ళలో  రంగ వల్లులను తీర్చి దిద్దే ధనుర్మాసం. భోగభాగ్యాలకు నెలవై నిష్కల్మషమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాథుడే  గోదాదేవిని పతిగా చేసిన నాడే భోగీ పండుగ.  పెద్దలకు ఉత్తమ గతులను ప్రసాదిస్తూ పరమేశ్వరానుగ్రహానికి వాకిళ్ళు తెరిచే మకర సంక్రమణం.  సాక్షాత్తు నందీశ్వరునికి ప్రతీకగా పశుసంపదను పూజించే కనుమ  పండుగ…వీటన్నిటితోపాటు  భక్తిశ్రద్ధలతో దీక్ష చేసి  అయ్యప్పభక్తులు ఆరాధించే  శబరిగిరీశుడు మకరజ్యోతిగా దర్శనమిచ్చే శుభతరుణం ఈ సంక్రాంతి.

యామిజాల జగదీశ్

Related posts

కోదండరాముని అలంకారంలో శ్రీ పద్మావతి

Sub Editor

ఇక అఖిల్ తో పూజా హెగ్డే ఆటా పాటా

Satyam NEWS

మాజీ మంత్రి మృతి సీఎం, మంత్రి సంతాపం

Sub Editor

Leave a Comment