40.2 C
Hyderabad
April 26, 2024 12: 08 PM
Slider సంపాదకీయం

స్టోరీ ఆఫ్ కౌన్సిల్: జీవీఎల్ చిలక పలుకులు ఎవరి కోసం?

radical muslims caa gvl

కౌన్సిల్ రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ పంపితే ఆమోదించడం తప్ప కేంద్ర ప్రభుత్వం వద్ద వేరే గత్యంతరం లేదా? బిజెపి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెబుతున్న మాటలను బట్టి చూస్తూ అదే నిజమనిపిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేందుకు వీలులేదని ఆయన అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగా ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్న తరుణంలో జీవీఎల్ నరసింహారావు మరో విధంగా చెప్పడం రాష్ట్ర బిజెపిలో గందరగోళం సృష్టిస్తున్నది.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే కౌన్సిల్ రద్దు బిల్లు ముందుకు వెళ్లే అవకాశమే లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తిరస్కరించవచ్చు కూడా. లేదా కాలయాపన చేయవచ్చు. కేంద్ర క్యాబినెట్ స్థాయిలోనే ఆగిపోవచ్చు. కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ రద్దు బిల్లు ఆగమేఘాలపై ఉరుకులు పరుగులు పెడుతున్నదని సత్యం న్యూస్ నిన్ననే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కావాలని చేస్తే తప్ప ఇలా జరగదు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కౌన్సిల్ రద్దుకు సానుకూలంగా ఉన్నట్లు, వైసిపి ప్రభుత్వంతో ఏదో ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చి ఉండవచ్చునని జరుగుతున్న పరిణామాలను బట్టి అంచనా వేసుకోవచ్చు. కౌన్సిల్ రద్దు ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించవచ్చు అనే దానికి గత అనుభవాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అవిచ్ఛిన్నంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలనను అంతం చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1983 లో కౌన్సిల్ రద్దుకు ప్రతిపాదన పంపింది.

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రాధమిక స్థాయి లోనే తిరస్కరించింది. దాంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు ఏం చేయాలో అర్ధం కాక ఆగిపోయారు. ఆ తర్వాత జరిగిన దురదృష్టకర పరిస్థితుల్లో ఇందిరాగాంధీ హత్యకు గురి కావడం దేశం మొత్తం కాంగ్రెస్ ప్రభంజనం వీచడంతో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. అయితే రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం పార్టీ 30 పార్లమెంటు స్థానాలను గెలిచి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది.

ఈ దశలో ముందుగా ప్రధాని రాజీవ్ గాంధీ అనుమతి తీసుకుని మళ్లీ ఎన్ టి రామారావు కౌన్సిల్ రద్దుకు అసెంబ్లీ తీర్మానం పంపించారు. రాజకీయంగా ప్రత్యర్థి అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం రాజీవ్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ రద్దు కు అనుమతించారు. 1985 ఏప్రిల్ 30న అసెంబ్లీ తీర్మానం ఆమోదిస్తే మే 30 నాటికి కౌన్సిల్ ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ రద్దు చట్టం 1985 అమలులోకి వచ్చేసింది.

1989 అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ టి రామారావును ఓడించి రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కౌన్సిల్ ను పునరుద్ధరించేందుకు 1990 జనవరి 22న అసెంబ్లీ తీర్మానం చేసి పంపారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ మెజారిటీ లో ఉన్న రాజ్యసభ ఆమోదించింది కానీ కాంగ్రెస్ మెజారిటీ లేని లోక్ సభ ఆమోదించలేదు. దాంతో కౌన్సిల్ పునరుద్ధరణ జరగలేదు.

మళ్లీ 2004 లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. 2004 జులై 8న కౌన్సిల్ పునరుద్ధరణకు మళ్లీ తీర్మానం పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆదేశించడంతో వై ఎస్ రాజశేఖరరెడ్డి అదే పని చేశారు. లోక్ సభ, రాజ్య సభ ఈ బిల్లును వెనువెంటనే పాస్ చేసినా రాష్ట్రపతి వద్ద చాలా కాలం ఆగింది. 2007 జనవరి 10వ తేదీన రాష్ట్రపతి సంతకం చేశారు.

2007 మార్చి 30న కౌన్సిల్ ఏర్పాటు కాగా ఏప్రిల్ 2న అప్పటి రాష్ట్ర గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ దాన్ని ప్రారంభించారు. పై విషయాలన్నీ చూస్తే కేంద్రం ఆపాలనుకుంటే ఆపవచ్చు, పాస్ చేయాలనుకుంటే చేయవచ్చు కదా? కౌన్సిల్ రద్దు కు బిజెపి సమ్మతి లేకపోతే బిల్లు ఆపడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది బిజెపి మిత్రపక్షమూ (అధికారికంగా) కాదు. మరి మేం ఆపలేము అని జీవీఎల్ నరసింహారావు చెప్పడంలో అర్ధం ఉందా? వెనుక ఏదైనా మతలబు ఉందా?

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

గౌడుల రాజకీయ ఆర్థిక అభివృద్దే గౌడ జేఏసీ లక్ష్యం

Satyam NEWS

పొలిటికల్ ఫెస్టివల్: భోగి మంటల్లో బోస్టన్ నివేదిక

Satyam NEWS

మిద్దె కూలి మరణించిన సర్పంచ్ ఆమె మనుమడు

Satyam NEWS

Leave a Comment