29.7 C
Hyderabad
April 29, 2024 10: 33 AM
Slider ప్రత్యేకం

A tribute: తల్లి తలపుల్లో…

#Narendra Modi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ నిన్ననే కన్నుమూశారు. ఆమె నిండునూరేళ్లు జీవించారు. ఆమె కన్న మిగిలిన సంతానం సంగతి ఎట్లావున్నా దేశాన్ని పరిపాలించే ప్రధానికి జన్మనిచ్చిన తల్లిగా ఆమె చరిత్రలో మిగిలిపోయారు. తల్లిని తరచూ కలవడం, దీవెనలు పొందడం,ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల మోదీ మాతృమూర్తి బెన్ ప్రపంచానికి ఎక్కువగా పరిచయమయ్యారు.

ఆమె పరమపదించిన సందర్భంగా తల్లితో తనకున్న జ్ఞాపకాలను మోదీ అక్షరబద్ధం చేసి మనతో పంచుకున్నారు. అందులోని చాలా అంశాలు ఎంతోమంది జీవితాలకు దగ్గరగా ఉన్నవే.కాకపోతే, స్ఫూర్తినిచ్చేవి,నిన్నటిని గుర్తుచేసేవి, రేపటికి మిగిలేవి ఎన్నో ఉన్నాయి. పేదరికం,వెనుకుబాటుతనం, అవమానాలు, కష్టాలు,కన్నీళ్లను అనుభవించడం, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేసుకోవడం,రేపటి పట్ల ఆశాభావంతో ఉండడం, సంకల్పసిద్ధిని పొందడం,
నిన్నటి చీకటివెలుగులను మర్చిపోకుండా ఉండడం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు.

మట్టిళ్లు,పెంకుకప్పులు, వానకురిస్తే వణికిపోయే బతుకులు మనలో చాలామందికి అనుభవాలే.ఆ మట్టివాసన, ఆ బుడ్డిదీపపు కాంతులు, తల్లి పంచిన ప్రేమ, నింపిన ధైర్యం,నేర్పిన సంస్కారం తలపుల్లో నిలుపుకున్నవారు ధన్యులు.నిన్నమొన్నటి వరకూ కుగ్రామాలు మొదలు నగరాల వరకూ మట్టిల్లు, పెంకుటిళ్ళు దర్శనమిచ్చేవి.

“సూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వానసుక్క… ” అని సినీ గేయ రచయిత జాలాది ఆ మధ్య ఓ సినిమాలో అద్భుతమైన పాట రాశారు. ఆయన కూడా తన జీవితానుభవంలో చూసిన దృశ్యంలో నుంచే ఆ పాట పుట్టించారు.హీరాబెన్ జీవితం నూటికి నూరుశాతం స్ఫూర్తిదాయకం.నరేంద్రమోదీ తదనంతర జీవనపయనంలో రాజకీయాల్లోకి వచ్చారు.

ముఖ్యమంత్రి,ప్రధానమంత్రి అయ్యారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా సింహాసనాన్ని అధిరోహించబోయే ముందు తల్లిదీవెనల కోసం ఆయన వెళ్లారు. ఆశీరక్షలతో పాటు అమృతాక్షరాలను ఆమె మోదీకి అందించారు. “అధికారం/ప్రభుత్వంలోకి నువ్వు ఎందుకు వచ్చావో! నీకే తెలియాలి. కానీ లంచం అనేది ఎన్నడూ, ఎవరి దగ్గర తీసుకోవద్దు” అని ఆమె హితబోధ చేశారు. అట్లే అనేకమంది తల్లులు పిల్లలకు ఆదర్శభాషణలను అందిస్తారు. ఎందరు పాటిస్తారు,
ఎందరు పాటించరన్నది వారికే ఎరుక.హీరాబెన్ పసిగుడ్డుగా ఉన్నప్పుడే తల్లిని కోల్పోయారు.

తల్లిప్రేమ,పెంపకం ఎలా ఉంటుందో కూడా తెలియని చేదు అనుభవాలు ఆమెవి. కానీ,తన పిల్లలకు ఆ లోటులేకుండా ప్రేమానురాగాలను పంచారు. పిల్లలను కష్టపడి పెంచారు.శ్రమైక జీవన సౌందర్యాన్ని, గౌరవాన్ని పిల్లలకు తెలియజేశారు. ఇలాంటి తల్లులు ఈభూమిపై ఎందరో ఉన్నారు.మంచితల్లులు వలె మంచిపిల్లలు కూడా ఎందరో ఉంటారు.జీవితంలో గెలుపుమెట్లు ఎక్కిన ధీరులు ఎందరో ఉన్నారు.

తల్లివేసిన బంగరుబాటలో నడిచినవారు ధన్యులు. తల్లి తలపుల్లో తడిసినవారు పుణ్యులు.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్

Related posts

బార్ ఓనర్లకు షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

నవోదయ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Satyam NEWS

18వేల కోట్ల రుణాలు

Murali Krishna

Leave a Comment