చెట్లు మానవాళికి ఆధారమని, చెట్లు లేనిదే మానవ మనుగడ లేదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ హరితవనంలో సాహస క్రీడల పార్క్ (అడ్వేంచర్ స్పోర్ట్స్) ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మొక్కలను సమృద్ధిగా పెంచి, ఆరోగ్య కరమైన స మాజాన్ని నిర్మిద్దాం అని తెలిపారు. అడవుల వలన వర్షాలు సకాలంలో కురుస్తాయని తెలిపారు. చెట్లు మానవాళికి ఉపయోగపడే ప్రాణవాయువును ఇచ్చి, మనకు హాని కలిగించే, గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయువు ను పీల్చుకుంటాయని తెలిపారు. పర్యావరణ సమతుల్యత ఎంతో ముఖ్యమని, ఇది దెబ్బతినడం మూలంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని అన్నారు. భూభాగంలో 33శాతం మేర అడువులు, చెట్లు ఉండాలని, కానీ 24 శాతం మేర మాత్రమే ఉన్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం ద్వారా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని, ప్రతి ఒక్కరూ ఉద్యమంలా చెట్లను నాటి సంరక్షించాలని అన్నారు. నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మేర కాపాడబడలేకపోతే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిదులపై చర్యలు తప్పవన్నారు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ఇది ప్రతి ఒక్కరి కార్యక్రమమన్నారు. ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్యెల్యే జోగు రామన్న, పీసీసీఎఫ్ ఆర్.శోభ, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్ పర్సన్ రాథోడ్ జనార్ధన్, కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్, జిల్లా అటవీ అధికారి ప్రభాకర్, ఎఫ్ డీవో చంద్రశేఖర్,ఎఫ్ఆర్వో అప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.
previous post
next post