39.2 C
Hyderabad
April 28, 2024 12: 40 PM
Slider విజయనగరం

20 నుంచి విజయనగరం పీటీసీ లో అగ్నివీర్ ర్యాలీ

#agni veer

సాయుధ ద‌ళాల్లో చేరాల‌న్న యువ‌త ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చుకొనే స‌మ‌యం ఆస‌న్న‌మ‌య్యింది.  విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఆదేశాల మేర‌కు జిల్లా యంత్రాంగం  ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి  ఏర్పాట్లు పూర్తి చేసింది. అగ్నిప‌థ్ ప‌థ‌కంలో భాగంగా ఈ నెల 20 తేదీ తెల్ల‌వారుఝాము నుంచీ స్థానిక పోలీసు శిక్ష‌ణా క‌ళాశాల మైదానంలో  అగ్నివీర్ ఎంపిక ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. శ్రీ‌కాకుళం నుంచి కృష్ణా వ‌ర‌కు మొత్తం 13 జిల్లాల‌నుంచీ సుమారు 10 వేల‌ మంది యువ‌కులు ఈ ర్యాలీకి హాజ‌రు కానున్నారు.

14 రోజుల‌పాటు రిక్రూట్‌మెంట్‌…!

భార‌త సైన్యంలో చేరాల‌న్న‌ది ఎంతోమంది యువ‌కుల‌ క‌ల‌. దీనికోసం నెల‌ల త‌ర‌బ‌డి క‌ఠోర సాధ‌న చేస్తున్న‌వారు ఎంద‌రో ఉన్నారు. వారి ఆశ‌ల‌ను నిజం చేసుకొనే అవ‌కాశం ఇప్పుడు మ‌న జిల్లాలోనే వ‌చ్చింది. ఈ నెల 20 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి స‌ర్వం సిద్ద‌మ‌య్యింది. మొదటి రోజు 20వ తేదీ ర్యాలీకి పిల‌వ‌బ‌డ్డ‌ అభ్య‌ర్ధులు 19వ తేదీ అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌క‌ల్లా పిటిసి గ్రౌండ్‌వ‌ద్ద సిద్దంగా ఉండాలి. వీరిని 20వ తేదీ తెల్ల‌వారుఝామున 12.30 గంట‌ల‌కు గ్రౌండ్‌లోప‌లికి అనుమ‌తిస్తారు. ఇలా త‌మ‌కు కేటాయించిన తేదీకి ముందురోజు అర్ధ‌రాత్రే అభ్య‌ర్ధులు హాజ‌రు కావాల్సి ఉంటుంది. ఆర్మీ ర్యాలీ కోసం క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి వివిధ శాఖ‌ల అధికారుల‌తో ప‌లుమార్లు స‌మీక్షా స‌మావేశాల‌ను ఏర్పాటు చేసి, ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.  ఎంపిక ప్ర‌క్రియ‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా  ప‌లుచోట్ల సిసి కెమేరాల‌ను అమ‌ర్చారు. ఆర్మీ ఉన్న‌తాధికారుల నిఘా, ప‌ర్య‌వేక్ష‌ణ మ‌ధ్య‌, జిల్లా యంత్రాంగం సంపూర్ణ స‌హ‌కారంతో ఫ్ల‌డ్‌లైట్ల వెలుగుల మ‌ధ్య‌ ఈ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. జిల్లా యువ‌త అధిక‌శాతం ఉద్యోగాల‌ను సాధించాల‌న్న ల‌క్ష్యంతో, 40 రోజుల ప్ర‌త్యేక శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. దీనికి జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, జెడ్‌పి నుంచి 5ల‌క్ష‌లు నిధులు మంజూరు చేశారు.

ఎవ‌రు అర్హులు ?

అగ్నిప‌థ్ ప‌థ‌కంలో భాగంగా, ఎంపిక ప్ర‌క్రియ‌లో  ప్ర‌భుత్వం ప‌లు కొత్త మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది. రాత ప‌రీక్ష‌, శారీక ధారుడ్య ప‌రీక్ష‌, వైద్య ప‌రీక్ష‌లు, డాక్యుమెంట్స్ వెరిఫికేష‌న్ మొద‌ల‌గు నాలుగు ద‌శ‌లుగా ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతుంది. దానికి అనుగుణంగా ఇప్ప‌టికే ఔత్సాహిక అబ్య‌ర్ధుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన వారు మాత్ర‌మే ర్యాలీకి హాజ‌ర‌య్యేందుకు అర్హులు. ఇలా ఉత్తీర్ణులైన సుమారు 10 వేల మందికి ఇప్ప‌టికే అడ్మిట్ కార్డుల‌ను పంపించ‌డం జ‌రిగింది. త‌మ‌కు జారీ చేసిన అడ్మిట్ కార్డుల్లో కేటాయించిన తేదీన‌ మాత్ర‌మే అభ్య‌ర్ధులు పిటిసి గ్రౌండ్‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. ఎంపిక ప్ర‌క్రియ ప్ర‌తిరోజూ రాత్రి సుమారు 12.30 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. అభ్య‌ర్ధులంతా త‌మ‌కు కేటాయించిన తేదీకి ముందురోజు రాత్రి 12 గంట‌ల‌క‌ల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. రోజుకు వెయ్యి మంది అభ్య‌ర్ధుల‌కు మాత్ర‌మే అడ్మిట్ కార్డుల‌ను పంపించారు.

ఎంపిక ప్ర‌క్రియ ఇలా..!

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌లో భాగంగా, త‌మ‌కు కేటాయించిన నిర్ణీత తేదీకి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికేట్ల‌ను తీసుకొని అభ్య‌ర్ధులు 30 నిమిషాల ముందు హాజ‌రు కావాలి.  అడ్మిట్ కార్డు, 20 క‌ల‌ర్ పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్‌, నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న వివిధ‌ స‌ర్టిఫికేట్ల‌ను తీసుకురావాలి.  అడ్మిట్ కార్డు, బార్‌కోడ్ ను ప‌రిశీలించి, వెయ్యి మందిని లోప‌లికి అనుమ‌తిస్తారు. వీరిని రెండు బ్యాచ్‌లుగా విడ‌దీస్తారు. విడ‌త‌కు వంద మంది చొప్పున ప‌రుగు పందెం జ‌రుగుతుంది.  అభ్య‌ర్ధుల‌కు ముందుగా ఎత్తు కొలిచిన అనంతర‌మే లోప‌లికి అనుమ‌తించి, 1.6 కిలోమీట‌ర్ల‌ ప‌రుగుపందెం నిర్వ‌హిస్తారు. ఈ దూరాన్ని ఐదున్న‌ర నిమిషాల్లో పూర్తి చేసిన‌వారికి 60 మార్కులు, 5 నిమిషాల‌, 45 సెకండ్లు, ఆ లోగా పూర్తి చేసిన‌వారికి 48 మార్కులు కేటాయిస్తారు. అంత‌కంటే స‌మ‌యం దాటితే అన‌ర్హులవుతారు. ఈ ప‌రుగు పందెంలో ఉత్తీర్ణులైన వారికి మాత్ర‌మే త‌దుప‌రి ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తిస్తారు. త‌రువాత ప్ర‌తీ అభ్య‌ర్ధీ క‌నీసం 6 పులప్స్ తీయాల్సి ఉంటుంది.  తీసిన పుల‌ప్స్‌ను బ‌ట్టి మార్కులు ఉంటాయి. 10 పులప్స్ తీస్తే గ‌రిష్టంగా 40 మార్కులు, 9 తీస్తే 33, 8 తీస్తే 27, 7 తీస్తే 21, 6 పులప్స్ తీస్తే 16 మార్కులు వ‌స్తాయి. ఆ త‌రువాత జిగ్‌జాగ్ న‌డ‌క‌, 9 అడుగుల‌ లాంగ్ జంప్ పోటీలు ఉంటాయి. ఈ రెండింటిలో కేవ‌లం ఉత్తీర్ణులైతే స‌రిపోతుంది. అనంత‌రం అభ్య‌ర్ధుల‌కు మ‌రునాడు ఉద‌యం స‌ర్టిఫికేట్ల‌ను త‌నిఖీ చేసి, వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం తుదిజాబితా త‌యారు చేస్తారు. ప్ర‌స్తుతం విస్తృతంగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో, ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌ను చేస్తున్నారు.

ఏర్పాట్లు ఇవీ..!

విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు సెట్విజ్‌, పిటిసి, పోలీస్‌, మున్సిప‌ల్, రెవెన్యూ, ర‌వాణా, వైద్య‌, డిఆర్‌డిఏ, విద్య‌, ఆర్ అండ్ బి, విద్యుత్‌, ఐ అండ్ పిఆర్‌ తదిత‌ర శాఖ‌లు ఈ ర్యాలీ ఏర్పాట్ల‌లో భాగ‌స్వాములు అయ్యాయి.  ర్యాలీకి హాజ‌ర‌య్యే అభ్య‌ర్ధులు ఎటువంటి ఇబ్బందీ ప‌డ‌కుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్రాగునీరు, మ‌రుగుదొడ్లు త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను క‌ల్పించారు. వ‌ర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పెరేడ్ గ్రౌండ్స్‌లో వాట‌ర్ ప్రూఫ్ టెంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల‌నుంచి వ‌చ్చే వారు బ‌స చేయ‌డం కోసం యూత్ హాస్ట‌ల్‌, రాజీవ్ స్టేడియంలో నామ‌మాత్ర‌పు రుసుముతో వ‌స‌తి సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నారు. పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకొనేందుకు ఆర్‌టిసి కాంప్లెక్స్‌, రైల్వే స్టేష‌న్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేశారు. రాత్రి 12 గంట‌ల‌కు ఎంపిక ప్ర‌క్రియ‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్ధులు, అన్ని ద‌శ‌ల్లోని ప‌రీక్ష‌ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేస్తే, మ‌రునాడు సాయంత్రం గ్రౌండ్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారు. వీరికి అల్పాహారం, భోజ‌నాన్ని జిల్లా యంత్రాంగం ఉచితంగా స‌మ‌కూరుస్తుంది.

16 సిసి కెమేరాలు…!

రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌కోసం ఆర్మీ అధికారుల సూచ‌న‌లకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్ల‌ను చేస్తోంది. పార‌ద‌ర్శ‌క‌త కోసం 16 సిసి కెమేరాల‌ను ఏర్పాటు చేశారు. 18 కంప్యూట‌ర్లు, 3 లాప్‌టాప్‌లు, రెండు జ‌న‌రేట‌ర్లు, యుపిఎస్‌లు, ప్రింట‌ర్లు, జెరాక్స్ మిష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. సుమారు 110 మంది ఆర్మీ సిబ్బంది, 110 మంది పోలీసులు, వంద‌మంది ప్ర‌భుత్వ‌శాఖల ఉద్యోగులు ఈ ప్ర‌క్రియ‌లో పాల్గొంటున్నారు. 15 మంది పారిశుధ్య కార్మికులు నిరంత‌రం పారిశుధ్య ప‌నుల‌ను నిర్వ‌హిస్తారు. వైద్యులు, సిబ్బందితోపాటు, ప్ర‌ధ‌మ చికిత్సా కేంద్రాల‌ను, 108 వాహ‌నాల‌ను సిద్దంగా ఉంచుతున్నారు. స‌ర్టిఫికేట్ల త‌నిఖీకి 10 మంది ఉపాధ్యాయుల‌ను, త‌ర్జుమా చేసేందుకు మ‌రో 4గురు ఉపాధ్యాయుల‌ను దుబాసీలుగా ఎంపిక చేశారు.

స‌ద్వినియోగం చేసుకోండి: జిల్లా క‌లెక్ట‌ర్‌

సాయుధ ద‌ళాల్లో చేరాల‌నుకొనే యువ‌త‌కు ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ చ‌క్క‌ని అవ‌కాశం. స్థానికంగానే ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతుండటంతో, దేశానికి సేవ చేసేందుకు వ‌చ్చిన‌ ఈ సువ‌ర్ణ‌ అవ‌కాశాన్ని జిల్లా యువ‌త స‌ద్వినియోగం చేసుకోవాలి. సైనిక ద‌ళాల్లో చేరిన‌వారికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంటుంది. జిల్లాలో రిక్రూట్ మెంట్ కోసం ప‌టిష్ట‌మైన ఏర్పాట్ల‌ను చేయ‌డం జ‌రిగింది. జిల్లాకు చెందిన యువ‌త అధిక సంఖ్య‌లో ఉద్యోగాలు సాధించాల‌ని ఆశిస్తూ….అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియజేసారు… కలెక్టర్ నాగలక్ష్మి.

అగ్నివీర్ ర్యాలీ విశేషాలు

రిక్రూట్‌మెంట్ తేదీలు -20 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు

ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యం – ప్ర‌తిరోజూ రాత్రి 12.30 గంట‌ల‌కు

హాజ‌ర‌య్యే మొత్తం అభ్య‌ర్ధులు -10వేలమంది

రోజువారీగా హాజ‌ర‌య్యే అభ్య‌ర్ధులు- 1000 మంది

పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది – 300 సుమారు

ఏర్పాటు చేసిన సిసి కెమేరాలు -16

వినియోగిస్తున్న కంప్యూట‌ర్లు -18

ప్రింట‌ర్లు -15

లాప్‌టాప్‌లు -3

జెరాక్స్ మిష‌న్లు – 2

Related posts

స్వామి శ్రీ రామానంద యోగజ్ఞానాశ్రమంలో “అపర వాల్మీకి” జయంతి…!

Bhavani

నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభించనున్న చంద్రబాబు

Satyam NEWS

విజయనగరం జిల్లాలో ఎన్నికలకు పకడ్బంది ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment