33.7 C
Hyderabad
April 30, 2024 01: 41 AM
Slider ఖమ్మం

విఆర్ఎ లకు శాఖలు కేటాయింపు

#Minister Puvwada Ajay Kumar

విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖలకు కేటాయించిన గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏ) పేదలకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో 496 మంది విఆర్ఏలకు వివిధ శాఖల యందు ప్రభుత్వ ఉద్యోగులుగా నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని నియామక ఉత్తర్వులను అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, నిన్నటి వరకు జిల్లాలోని గ్రామాలలో గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏ) గా విధులు నిర్వహించిన 496 మంది విఆర్ఏ లను ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 81 ద్వారా వారి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, వార్డ్ ఆఫీసర్, రికార్డు అసిస్టెంట్ ఆఫీసు సబార్డినేట్, హెల్పర్ లుగా ప్రభుత్వం నియమిస్తూ చారిత్మాత్మక నిర్ణయాన్ని తీసుకుందని, దీనితో విఆర్ఏ ల గౌరవం పెరగడంతోపాటు, ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించే అన్ని ఫలాల లబ్ది చేకూరుతుందని అన్నారు. నిన్నటి వరకు 11000 రూపాయల వేతనం పొందిన విఆర్ఏ లు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా వారి పోస్టు ప్రకారం పిఆర్సి పే స్కేల్ ఆధారంగా వేతనం పొందనున్నారన్నారు.

ప్రభుత్వ శాఖల్లో నియమితులైన వారు తమ సర్వీసు పదిమందికి ఉపయోగపడేలా, న్యాయాన్ని సహాయ సహకారాలను అందించి ప్రజల మన్నలను పొందాలని, భవిష్యత్తులో పదోన్నతులు పొంది అభివృద్దిని సాదించాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో 610 మంది విఆర్ఏ లు ఉండగా, ఇందులో 61 సంవత్సరాల లోపు ఉన్న 496 మందికి ఇప్పుడు వివిధ శాఖలకు కేటాయించడం జరుగుతుందని, 61 సంవత్సరాలు పూర్తిచేసుకున్న114 మంది వీఆర్ఏ ల కొరకు కారుణ్య నియామకాలు, వారి డిపెండెంట్లకు త్వరలోనే ఇస్తామన్నారు. రాష్ట్రంలో 11 వేల రూపాయల వేతనం పొందిన 20500 మంది విఆర్ఏ లు ఇకపై పిఆర్సి ప్రకారం వేతనాలు పొందుతారని తెలిపారు.

కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, గ్రామాల్లో విఆర్ఓల అందిoచిన సేవలు, వారి శ్రమ విలువకట్టలేనిదని అన్నారు. సుదీర్ఘ కాలం పే స్కెళ్ళు, ఉద్యోగ భద్రత, విద్యార్హతల ప్రకారం ప్రమోషన్స్ కావాలని ఆందోళనలు చేశారని అన్నారు. గ్రామాల్లో ఏ కార్యక్రమం అయిన ప్రభుత్వానికి కళ్లు, చెవుల్లా పనిచేసి, కార్యక్రమాలు విజయవంతం చేశారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్ మాట్లాడుతూ, పరిపాలన, సంక్షేమం లో సమూలమైన మార్పులు తెచ్చారన్నారు. తెలంగాణ బిడ్డలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. గతంలో 4-5 గ్రామాలకు ఒక కార్యదర్శి ఉండేవారని, తెలంగాణ వచ్చాక ప్రతి పంచాయితీకి కార్యదర్శిని నియమించారన్నారు.

తెలంగాణ అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులది గొప్ప పాత్ర అని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల్లో నియమితులైన విఆర్ఏ లకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా పంచాయితి కార్యదర్శులుగా 4 సంవత్సరాల సర్వీసు కాలం పూర్తిచేసుకున్న వారికి క్రమబద్ధీకరణ ఉత్తర్వులను అందజేశారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు అభిలాష అభినవ్, డి. మధుసూదన్ నాయక్, ఇర్రిగేషన్ సిఇ శంకర్ నాయక్, జెడ్పి సిఇఓ అప్పారావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమికి స‌ర్వం సిద్ధం

Satyam NEWS

వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?

Sub Editor

కస్టోడియన్ భూములను కాపాడడానికి కదంతొక్కిన రెవెన్యూ అధికారులు

Satyam NEWS

Leave a Comment