38.2 C
Hyderabad
April 29, 2024 12: 19 PM
Slider ముఖ్యంశాలు

ఖమ్మం వచ్చే నైతిక హక్కు అమిత్‌షాకు లేదు

#CPI

తొమ్మిదేళ్ళుగా తెలంగాణకు పునర్విభజన చట్టంలో హామీలు నెరవేర్చని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఖమ్మంకు వచ్చే నైతిక హక్కు లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన పెద్ద వల తీసుకొని ఖమ్మంకు వస్తున్నారని, ఆ వలకు చేపలు కాదు కదా కనీసం పాములు కూడా చిక్కబోవని ఎద్దేవా చేశారు.

విషం కక్కే పాములు కూడా కాలకూటంలాంటి విషంగక్కే బిజెపి అంటే భయంతో పారిపోతున్నాయి. బిజెపి అంటేనే తెలంగాణ ప్రజలు పారిపోతున్నారని, చివరకు క్రాస్‌ రోడ్స్‌(నడి రోడ్డు) లో ఉండి ఏ పార్టీలో చేరాలని అటూ ఇటూ చూస్తున్న వారు సైతం ఆ పార్టీలో చేరబోరని అన్నారు.

హైదరాబాద్‌ మగ్దూంభవన్‌లో సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్‌ రెడ్డి, ఎన్‌.బాలమల్లేశ్‌ కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై అన్ని పార్టీల నాయకులు ఫోకస్‌ పెట్టారని, ఇతర పార్టీల వారిని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అంగడిలో సరుకు దొరుకుతుందా లేదా అని ఖమ్మంకు అమిత్‌ షా వస్తున్నారని, ఆయన పార్టీ ఆటలు ఇక్కడ సాగబోవన్నారు.

జిల్లాకు చెందిన కొందరు నడిరోడ్డులో నిలబడి అటూ ఇటూ చూస్తున్నారని, వాళ్ళను పట్టుకుందామని కేంద్రంలో అధికారంలో ఉన్నవారు, అలాగే అధికారం కావాలని కోరుకుంటున్న వారు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాని కమ్యూనిస్టులకు ఖమ్మంలో సహజ బలం ఉండడంతో చైతన్యం గల జిల్లా అయిందని, అందుకే బిజెపిని పట్టించుకోవడం లేదన్నారు.

మోడీ , అమిత్‌ షాలు కవల పిల్లలు అని, తొమ్మిదేళ్ళలో వారు తెలంగాణకు ఏమి చేశారో చెప్పాలని కూనంనేని ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించారా? గిరిజన యూనివర్సిటీ ఇచ్చారా? కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చారా? అని నిలదీశారు.

బయ్యారంలో ఇనుప ఖనిజం ఉన్నదని నాటి కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌ చెప్పారని, జియలాజికల్‌ సర్వే సైతం 60 శాతం ఖనిజం ఉన్నట్ల నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు ఇవ్వలేదని, తెలంగాణ అంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అంత కోపం అని ప్రశ్నించారు. అందుకే అమిత్‌ ఖమ్మంకు వచ్చే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

సింగరేణి గనులను ప్రైవేటు పరం చేస్తున్నారని, కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, అలాంటి వారి మాటలు జనం నమ్మబోరని అన్నారు. జనాభా ప్రాతిపదికన త్వరలో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి నష్టం జరుగుతుందని, దాని ద్వారా దక్షిణ భారతం వర్సెస్‌ ఉత్తర భారతం అనే అనారోగ్య పోటీ వస్తుందని, దానిని కూడా బిజెపి స్వార్థ ప్రయోజనానికి ఉపయోగించుకుంటుందని విమర్శించారు.

‘ధరణి’పై అఖిలపక్షం ‘ధరణి’ పోర్టల్‌ ను ఎత్తివేయాలనే వాదనను తాము సమర్థించడం లేదని, అయితే అందులో లోటు పాట్లను సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూనంనేని సాంబశివరావు సూచించారు. దీనిపై ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరించాలని, ప్రభుత్వం కూడా ప్రతిష్టకు పోకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు స్వీకరించాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా భూములను డిజిటల్‌ సర్వే చేయాలని, జిఒ 58 కింద పేదలందరికీ పట్టాలు ఇచ్చే ప్రక్రియను మరింత వేగిరం చేయాలని డిమాండ్‌ చేశారు.

Related posts

కాగడాలతో నెల్లూరు టీడీపీ నేతల నిరసన

Satyam NEWS

బోడ్రాయి, సీసీ రోడ్డు నిర్మాణాల‌కు శంకుస్థాప‌న‌

Sub Editor

కళ్యాణదుర్గంలో టీడీపీ సానుభూతిపరుడి ఇల్లు కూల్చివేత

Satyam NEWS

Leave a Comment