40.2 C
Hyderabad
April 26, 2024 12: 30 PM
Slider ప్రత్యేకం

అన్ని వ్యవస్థలనూ ‘పోలరైజ్’ చేస్తున్న ఏపి రాజకీయం

#CMJagan

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్తపుంతలు తొక్కుతున్న తీరు పరిశీలకుల దృష్టినాకర్షిస్తోంది. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మూస తరహా రాజకీయాలకు కాలం చెల్లినట్లు, కొత్త రాజకీయ వ్యవస్థ స్థాపన ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆ పార్టీనాయకులు పదేపదే ప్రకటిస్తుంటారు.

రాష్ట్ర అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం, రాష్ట్ర బీజేపీ వై ఎస్ ఆర్ పార్టీ పట్ల కనబరుస్తున్న మెతక వైఖరి వంటి అంశాలు రాజకీయ విశ్లేషకుల ఊహకు అందక పోవడం గమనార్హం. కేంద్రప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం కోరుకుంటున్నట్లు పలు సంఘటనలు తేటతెల్లం చేశాయి.

బిజెపి సంతృప్తి చెందినట్లుంది…..?

ముఖ్యంగా…. రైతుసంక్షేమం లక్ష్యంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మూడు వివాదాస్పద బిల్లులకు  వై ఎస్ ఆర్ ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో బీజేపీ అధిష్ఠానం సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. జీఎస్టీ బకాయిల విషయంలో కూడా పొరుగు రాష్ట్రం తెలంగాణా ప్రభుత్వం గట్టిగా వాదిస్తున్న తరహాలో కాకుండా సౌమ్యంగా కేంద్రం నుంచి రాబట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తోంది.

రాజ్యసభ ఎన్నికల తరువాత కేంద్రమంత్రి వర్గంలో లో వై ఎస్ ఆర్ కు ఒకటి లేదా రెండు పదవులు ఖాయమని రాజకీయ వర్గాలలో వినిపించింది. కానీ ఏ కారణం చేతనో అది వాస్తవం కాలేదు. ప్రభుత్వం లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కాకపోయినా బీజేపీ నాయకత్వంతో కలిసి పనిచేయడానికి వై ఎస్ ఆర్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

తాజా వివాదం న్యాయం వైపా? అన్యాయం వైపా?

తాజాగా ఉన్నత న్యాయస్థానంలో కీలక హోదాలో ఉన్న వ్యక్తులపై వై ఎస్ ఆర్ పార్టీ ఘాటుగా విమర్శించడం వివాదాస్పదమవుతోంది. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులపై వ్యాఖ్యానించడం, పసలేని వాదనలు చేయడం ,అన్యాపదేశంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం వంటివి తగదని న్యాయశాస్త్రకోవిదులు సలహా ఇస్తున్నారు.

ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికై, అధికారం చేపట్టిన ప్రజాప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను చట్టం పరిధి మేరకు వినియోగించాలని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారతరాజ్యాంగం లో శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ వేటికవే ప్రత్యేక స్థానం, విశిష్ట లక్షణం కలిగిఉంటాయి.

పరస్పర గౌరవం లేని రాజ్యాంగ వ్యవస్థలు

పరస్పరం ఒకదానిని ఒకటి గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను పరి పుష్టం చేయాల్సిన బాధ్యత సమష్టిగా ఉంటుందనేది విస్మరించరానిది. రాజ్యాంగ పరిధిలోమిగిలిన వ్యవస్థలు సక్రమంగా వాటికి కేటాయించిన విధులు, నిషేధాలు నిర్వర్తించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించాలన్నది ప్రమాణం.

కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి న్యాయ స్థానాలను బెదిరించి లబ్దిపొందే ఎత్తుగడకు పాల్పడడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తో సహా న్యాయమూర్తులు తీవ్రంగా ఖండించారు.

సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు గుప్పిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం దురదృష్టకరమని విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయశాస్త్ర విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఘాటుగా విమర్శిస్తున్నారు.

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పలు వివాదాస్పద కేసులు ఉన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్న సమయంలో ఆయన పరిధిదాటి వ్యవహరిస్తున్నట్లు తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేవారు, సమర్ధించేవారుగా మీడియాసైతం రెండుగా చీలిపోవడం పరిశీలకుల దృష్టి ని ఆకర్షిస్తోంది.

కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో….?

జాతీయ మీడియాలో చర్చోపచర్చలకు దారితీసింది. నడుస్తున్న పరిణామాలపై కేంద్రప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది పరిశీలకులలో ఉత్కంఠ రేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ బలపడాలనే ఉద్దేశం పార్టీ అధిష్టానానికి ఉన్నా తెలంగాణాతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ఒకింత నిదానంగానే పావులు కదుపుతోంది.

దక్షిణాది నుంచి కేంద్రానికి అంశాలవారీ  వత్తాసు పలికే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పరిణమించడం చూపరులకు విస్మయం కలిగించడం సహజం. న్యాయమూర్తులపై ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఘాటుగా వ్యాఖ్యానించడం చరిత్రలో ఇదే మొదటిసారని , ఇది గర్హనీయమని వై ఎస్ ఆర్ వ్యతిరేకులు అంటున్నారు.

రాజకీయ కక్షలు తీర్చుకొనేందుకు న్యాయమూర్తులను బలి పెట్టడం సముచితం కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. బీజీపీ, వై ఎస్ ఆర్ మధ్య ఉన్న చీకటి ఒప్పందం  బహిర్గతం కావాలని బీజేపీ, వై ఎస్ ఆర్ పార్టీలను ఇరుకున పెట్టాలని మిగిలిన రాజకీయ పార్టీలు వ్యూహం పన్నుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ లేని రాజకీయ చదరంగంలో చివరికి గెలిచేది ఎవరో కాలమే నిర్ణయించాలి.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

ఫోర్‌ వే పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అనంత

Satyam NEWS

ఈ వర్షాకాలంలో సన్నరకం వరి మాత్రమే పండించాలి

Satyam NEWS

2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం

Murali Krishna

Leave a Comment